Site Inspection: పోలవరంలో నేటి నుంచి విదేశీ నిపుణుల పర్యటన
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:36 AM
పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించనుంది.
ప్రాజెక్టు పురోగతిపై పరిశీలన
పోలవరం, జనవరి 18(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ పర్యటించనుంది. విదేశీ నిపుణులు సీన్ హించ్‌బెర్గర్, డేవిడ్ బి పాల్, జియాన్‌ఫ్రాంకో డి సిక్కోల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది ఆరోసారి. ఈ బృందంతో పాటు కేంద్ర జలసంఘంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు సరబ్జిత్ సింగ్ బక్షి, మనీష్ రాథోడ్, గౌరవ్ తివారి, హేమంత్ గౌతమ్, కేంద్ర మట్టి రాతి నాణ్యతా పరిశీలన (సీఎ్‌సఎంఆర్‌ఎస్) అధికారులు మనీష్ గుప్తా, రవి అగర్వాల్, సీడబ్ల్యుపీఆర్‌ఎస్ ప్రతినిధి వీఎస్ రామారావు, ప్రాజెక్టు అథార్టీ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, డైరెక్టర్ కె.శంకర్, ఏపీ జలవనరులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్, గౌరవ సలహాదారులు ఎం.వెంకటేశ్వరరావు, ఎన్‌ఐఆర్‌ఎం డైరెక్టర్ అజయ్ కుమార్ నేతాని, మెఘా కంపెనీ ప్రతినిధులు పర్యటనలో పాల్గొంటారు. విదేశీ నిపుణుల బృందం అయా విభాగాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చిస్తారు. ప్రాజెక్టులో కీలక నిర్మాణ ప్రాంతాలైన గ్యాప్ 1, డి హిల్, గ్యాప్ 2, జి హిల్, మట్టి నిల్వల ప్రాంతాలను సోమవారం పరిశీలిస్తారు. 20వ తేదీన మెయిన్ డ్యాం నిర్మాణ ప్రాంతంలో గ్యాప్ 2, ఇసుక రీచ్, మెటీరియల్ నిల్వల ప్రాంతాలను పరిశీలించి వాటి నాణ్యతా ప్రమాణాలు ఇతర అంశాలపై అధికారులతో చర్చిస్తారు. 21న ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం నిర్మాణ ప్రణాళిక, స్పిల్ ఛానల్, ఆప్రోచ్ ఛానల్ తదితర అంశాలను పరిశీలించి వాటి నిర్వహణ అంశాలపై అధికార బృందంతో సమీక్షిస్తారు. 23న బృంద సభ్యులు ఢిల్లీలో ప్రాజెక్టు అథార్టీ బృందంతో సమావేశమవుతారు.