Share News

రాష్ట్రంలోనే విదేశీ విద్య

ABN , Publish Date - Oct 08 , 2026 | 05:34 AM

ఉన్నత విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశ పెడుతోంది. ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి లక్ష మంది విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారని గుర్తించిన ప్రభుత్వం.. విదేశాల్లోని ప్రముఖ వర్సిటీల క్యాంప్‌సలను ఇక్కడకు రప్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీ రూపొందిస్తోంది.

రాష్ట్రంలోనే విదేశీ విద్య
ap sachivalayam

అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానం ప్రవేశ పెడుతోంది. ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి లక్ష మంది విద్యార్థులు చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారని గుర్తించిన ప్రభుత్వం.. విదేశాల్లోని ప్రముఖ వర్సిటీల క్యాంప్‌సలను ఇక్కడకు రప్పించడమే లక్ష్యంగా కొత్త పాలసీ రూపొందిస్తోంది. ఈ ప్రతిపాదనకు బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభించింది. ‘విదేశీ ఉన్నత విద్యాసంస్థలు, ప్రైవేటు యూనివర్సిటీలు-2026’ పేరుతో వాటి ప్రోత్సాహకానికి పాలసీ రూపొందిస్తున్నారు. 2029 నాటికి కనీసం 5 విదేశీ విద్యా సంస్థలను రాష్ర్టానికి తీసుకురావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. స్థానిక విద్యార్థులే కాకుండా.. 5 వేల మంది విదేశీ విద్యార్థులు రాష్ట్రానికి వచ్చి చదువుకుంటారని అంచనా వేస్తున్నారు. విదేశీ విద్యా సంస్థల్లో.. క్యూఎస్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌-500లో ఉన్న విద్యాసంస్థలకు మాత్రమే రాష్ట్రంలో క్యాంపస్‌ ఏర్పాటుకు అవకాశం కల్పిస్తారు. లేదా సబ్జెక్టు ర్యాంకింగ్‌లో టాప్‌- 100లో ఉంటే ప్రాధాన్యత ఇస్తారు. దేశంలోని ప్రైవేటు వర్సిటీల క్యాంప్‌సలను ఏపీలో ఏర్పాటు చేయాలంటే ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో టాప్‌-100 లో ఉన్న సంస్థలకు ప్రాధాన్యత ఇస్తారు.

మూడు విధానాల్లో రావొచ్చు

ఉన్నత విద్యాసంస్థలు మూడు విధానాల్లో రాష్ట్రానికి వచ్చేలా అవకాశం కల్పిస్తున్నారు. 1) విద్యాసంస్థ స్వయంగా క్యాంప్‌సను నిర్మించి, నిర్వహించుకుంటుంది. ఈ సంస్థలు ఇచ్చే డిగ్రీలకు భారతీయ డిగ్రీలతో సమాన హోదా ఉంటుంది. అదనపు గుర్తింపు అవసరం లేదు. 2) విద్యాసంస్థ ప్రభుత్వం నుంచి భూమి తీసుకుని, క్యాంపస్‌ నిర్మించుకుంటుంది. 3) రాష్ట్రంలోని ఏదైనా యూనివర్సిటీతో కలిసి జాయింట్‌ డిగ్రీ, డ్యూయెల్‌ డిగ్రీ అందించే విధానం ప్రారంభించుకోవచ్చు. ఈ విధానంలో సొంత క్యాంపస్‌ అవసరం లేదు. యూజీసీ నుంచి లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ జారీ అయిన 6 నెలల్లోపు విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం భూమి, నిర్మాణ అనుమతులు ఇస్తుంది. దీనికోసం రాష్ట్ర స్థాయి పోర్టల్‌ను రూపొందిస్తారు.


ప్రభుత్వ సహకారం ఇదీ..

50 ఎకరాల వరకు రాయితీపై భూమి.

స్టాంపు డ్యూటీ, రిజిస్ర్టేషన్‌ చార్జీల మినహాయింపు.

పీపీపీ విధానంలో స్థానిక పరిశ్రమలు, ఇన్‌ఫ్రా డెవలపర్లతో విద్యాసంస్థలను సమన్వయం చేస్తుంది.

ఏపీఈడీబీ పోర్టల్‌ ద్వారా సింగిల్‌ విండో విధానంలో అనుమతులు మంజూరు.

యూజీసీ, కేంద్ర విద్యాశాఖతో సమన్వయం చేస్తుంది.

వీసాలు, వర్క్‌ పర్మిట్ల జారీలో సహకారం

Updated Date - Oct 08 , 2026 | 05:34 AM