Share News

ప్రభుత్వ కార్యాలయం కడుతున్నాం.. చందాలివ్వండి!

ABN , Publish Date - Feb 17 , 2026 | 04:07 AM

అన్నమయ్య జిల్లా పాత జిల్లా కేంద్రం రాయచోటి నుంచి కొత్త పాలనా కేంద్రం మదనపల్లెకు ప్రభుత్వ కార్యాలయాలు క్రమంగా చేరుకుంటున్నాయి. వాటికి కేటాయించిన భవనాలు, గదులు పాతవి కావడంతో మరమ్మతులు లేక...

ప్రభుత్వ కార్యాలయం కడుతున్నాం.. చందాలివ్వండి!

  • మదనపల్లెలో భారీగా వసూళ్ల పర్వం

  • 25 వేలతో మొదలై 5 లక్షల వరకూ..

  • రూ.కోటికి పైగా వసూళ్లు!

  • టార్గెట్లు పెట్టి మరీ దండుకున్న వైనం

  • డబ్బులే కాదు నిర్మాణ సామగ్రి కూడా..

  • చిన్న వ్యాపారులపై మోయలేని భారం

  • రాష్ట్ర ప్రభుత్వానికి పలువురి ఫిర్యాదు

(మదనపల్లె, ఆంధ్రజ్యోతి)

అన్నమయ్య జిల్లా పాత జిల్లా కేంద్రం రాయచోటి నుంచి కొత్త పాలనా కేంద్రం మదనపల్లెకు ప్రభుత్వ కార్యాలయాలు క్రమంగా చేరుకుంటున్నాయి. వాటికి కేటాయించిన భవనాలు, గదులు పాతవి కావడంతో మరమ్మతులు లేక రీమోడలింగ్‌ చేయించుకోవడం, వాటికి అదనంగా కొత్త భవనాల నిర్మాణంపై దృష్టి సారించాయి. ఈ పనులకు చేసిన ఖర్చులను బిల్లు పెడితే చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఇందుకు భిన్నంగా ఓ శాఖ వసూళ్లకు తెర లేపింది. ‘కార్యాలయం కడుతున్నాం.. చందాలివ్వండి’ అంటూ భారీ ఎత్తున డబ్బులు దండుకునే కార్యక్రమం మొదలుపెట్టింది. తమకు కేటాయించిన భవనానికి ఆ శాఖ మరమ్మతులతోపాటు అదనపు నిర్మాణాలు చేపడుతోంది. అనుబంధంగా మైదానం ఏర్పాటు చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ గోడ కట్టాల్సి ఉంది. ఈ 3 పనులు పూర్తి చేయాలంటే పెద్దమొత్తంలో నిధులు కావాల్సి ఉంది. ‘మీకు కేటాయించిన గదులు, భవనాల్లో ఆయా విభాగాలకు సంబంధించిన పనులు చేసుకోండి. అందుకయ్యే ఖర్చుకు బిల్లులు చెల్లిస్తాం’ అంటూ జిల్లా అధికారులు చెబుతున్నా, ఆ శాఖ మాత్రం వసూళ్లతో ముందుకెళ్లింది. ఇందులోభాగంగా మదనపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో హడావుడి చేసింది.


చిరు వ్యాపారులకు పెద్ద కష్టం..

చిరు వ్యాపారుల నుంచి పెద్దస్థాయి వర్తకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల వరకు ఎవరినీ వదిలిపెట్టడం లేదు. కనిష్ఠంగా రూ.25 వేల నుంచి మొదలై మధ్యస్థంగా రూ.లక్ష, గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఇక అసోసియేషన్‌ పరంగా తీసుకుంటే పెద్ద మొత్తాన్ని ప్రకటించి, ఆ మొత్తాన్ని కార్యాలయానికి లేదా ఆ అధికారికి చేర్చేలా ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కార్యాలయ నిర్మాణాలు, ఇతర ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఎవరైనా స్వచ్ఛందంగా ఇస్తే స్వీకరించవచ్చు. కానీ, టార్గెట్లు పెట్టి మరీ వసూలు చేయడం, చిన్నపాటి వ్యాపారులు, కుటీర పరిశ్రమలనూ వదిలిపెట్టకుండా చందాలు దండుకోవడమే తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. అసలే వ్యాపారాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని మరింత ఇబ్బంది పెట్టడం ఏమిటంటూ మదనపల్లె వాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మదనపల్లె టమోటా మార్కెట్‌ వ్యాపారులు మొదట్లో రూ.2.20లక్షలు వసూలు చేసి ఇవ్వగా, తక్కువగా ఉందని వెనక్కి పంపారు. ఆ తర్వాత మరింత వసూలు చేసి రూ.3లక్షలు ఆశాఖ ఉన్నతాధికారికి చేర్చినట్లు సమాచారం. ఇలాగే పుంగనూరు మార్కెట్‌ మార్కెట్‌కమిటీ కూడా రూ.లక్ష చెక్కును డివిజన్‌స్థాయి అధికారికి చేర్చినట్లు చెబుతున్నారు.


సీఎంవో సీరియస్‌

భవనాలు, ఇతర నిర్మాణాలకు కావాల్సిన సామగ్రిని ఆయా వర్గాల నుంచి సమకూర్చుకున్నట్లు చెబుతున్నారు. మట్టి, ఇసుక, ఇటుకలు, కంకర, రాళ్లు, సిమెంటు, కమ్మి, పెయింట్స్‌, విద్యుత్తు సామగ్రి తదితర వస్తువులు ఆయా రంగాల వ్యక్తులు, వ్యాపారుల నుంచి వస్తు రూపేణ సమకూర్చుకున్నట్లు స్థానికంగా ఆశాఖలో చర్చ నడుస్తోంది. ఇక ట్రాక్టర్లు, టిప్పర్లు, ఎక్సకవేటర్ల యజమానుల నుంచి కూడా వారు ఏ పని చేస్తారో, ఏ వ్యాపారం నిర్వహిస్తారో ఆయా పనిని సేవల రూపంలో వినియోగించుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ శాఖ చేస్తున్న అక్రమ వసూళ్ల వ్యవహారంపై కొందరు అఽధికార పార్టీ నేతలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం నిధులు ఇస్తామన్నా..ఇలా ప్రజలు, వ్యాపారులపై పడి వసూలు చేయడం ఏంటని వారు సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి మదనపల్లెలోని సంబంధిత అధికారులకు అక్షింతలు పడినట్లు తెలిసింది. ఆ తర్వాతనుంచి ఈ వసూళ్లకు బ్రేక్‌ పడినట్టు చెబుతున్నారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.

Updated Date - Feb 17 , 2026 | 04:10 AM