పదేళ్లుగా..
ABN , Publish Date - Jan 14 , 2026 | 01:14 AM
చారిత్రక నేపథ్యం కలిగిన మచిలీపట్నం పురపాలక సంఘం గత ఐదేళ్ల క్రితం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్పు చెందింది. 50 డివిజన్‌లు, మేయర్, ఇద్దరు డెప్యూటీ మేయర్‌ల పరిపాలనలో కొనసాగుతోంది. కానీ నేటికీ కొత్త భవనం సమకూరడం లేదు. శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే చాలీచాలని గదుల్లో దినదినగండంగా కార్యాలయాన్ని నడుపుతున్నారు. మచిలీపట్నం పాత రైల్వేస్టేషన్ సమీపంలో మునిసిపల్ కార్పొరేషన్ స్థలంలో నూతన భవన నిర్మాణానికి 2016లో టీడీపీ ప్రభుత్వం రూ.3కోట్ల నిధులను మంజూరు చేసింది. అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పి.నారాయణ, చేనేత, ఎకై్ౖసజ్‌శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఈ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భవనం బహుళ అంతస్తులతో నిర్మిస్తారని నగర ప్రజలంతా ఆశించారు. కానీ పునాదుల దశలోనే ఈ పనులు నిలిచిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ భవన నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదు. దీంతో పునాదుల దశలోనే ఈ భవనం ఉండిపోయింది.
- పునాది దశలోనే మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణం
- రూ.3 కోట్ల అంచనా వ్యయంతో 2016లో శంకుస్థాపన
- పునాది వరకు వేసి వదిలేసిన కాంట్రాక్టర్
- దశాబ్ద కాలం పాటు అలాగే ఉండటంతో తుప్పు పట్టిన చువ్వలు
- కార్పొరేషన్‌గా మార్పు చేసి ఐదేళ్లు అయినా పట్టించుకోని అధికారులు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
చారిత్రక నేపథ్యం కలిగిన మచిలీపట్నం పురపాలక సంఘం గత ఐదేళ్ల క్రితం మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్పు చెందింది. 50 డివిజన్‌లు, మేయర్, ఇద్దరు డెప్యూటీ మేయర్‌ల పరిపాలనలో కొనసాగుతోంది. కానీ నేటికీ కొత్త భవనం సమకూరడం లేదు. శిథిలావస్థకు చేరిన పాత భవనంలోనే చాలీచాలని గదుల్లో దినదినగండంగా కార్యాలయాన్ని నడుపుతున్నారు. మచిలీపట్నం పాత రైల్వేస్టేషన్ సమీపంలో మునిసిపల్ కార్పొరేషన్ స్థలంలో నూతన భవన నిర్మాణానికి 2016లో టీడీపీ ప్రభుత్వం రూ.3కోట్ల నిధులను మంజూరు చేసింది. అప్పటి పురపాలక, పట్టణాభివృద్ధిశాఖా మంత్రి పి.నారాయణ, చేనేత, ఎకై్ౖసజ్‌శాఖల మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు ఈ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భవనం బహుళ అంతస్తులతో నిర్మిస్తారని నగర ప్రజలంతా ఆశించారు. కానీ పునాదుల దశలోనే ఈ పనులు నిలిచిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ భవన నిర్మాణాన్ని అసలు పట్టించుకోలేదు. దీంతో పునాదుల దశలోనే ఈ భవనం ఉండిపోయింది. పిల్లర్లకు వాడిన ఇనుము తుప్పుపట్టి పాడైపోతోంది.
పాత భవనంలోనే పరిపాలన, సమావేశాలు
ప్రస్తుతం రాబర్ట్‌సన్‌పేట(ఆర్‌పేట) పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న పాత మునిసిపల్ కార్యాలయంలో పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఇటీవల కాలంలో కమిషనర్, మేయర్ చాంబర్‌లను కొంతమేర ఆధునీకరించి సరిపెట్టారు. కార్యాలయంలోని మిగిలిన అన్ని గదులకు కనీస మరమ్మతులు కూడా చేయలేదు. గతంలో పురపాలక సంఘంగా ఉన్నపుడు 42 వార్డులు ఉండేవి. మునిసిపల్ కార్పొరేషన్‌గా మార్పు చేశాక 50 డివిజన్‌లకు పెంచారు. అయినా పాత సమావేశపు హాలులోనే కార్పొరేషన్ పాలకవర్గం నెలవారీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌లకు అధికారులు హాజరవుతున్నారు. కార్యాలయం పైఅంతస్తులో ఉన్న సమావేశపు హాలు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. అయినా ప్రత్యామ్నాయం లేకపోవడంతో పాత సమావేశపు హాలులోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్‌గా మారినా మేయర్ పోడియం, కార్పొరేటర్‌లు సమావేశాలు నిర్వహించేందుకు సరైన సమావేశపుహాలు వంటి ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకుండానే గత ఐదు సంవత్సరాలుగా మమ అనిపిస్తున్నారు.
రెండువైపులా ప్రహరీ నిర్మాణం
మచిలీపట్నం మునిసిపల్ కార్యాలయ భవన నిర్మాణ పనులను 2016 ఏప్రిల్‌లో ప్రారంభించారు. కాంట్రాక్టర్ పనులు చేయకుండా జాప్యం చేయడం లేదా రాజకీయపరమైన కారణాలు, ఇతరత్రా అంశాల నేపథ్యంలో ఈ భవన నిర్మాణం పునాదుల దశలోని నిలిచి పోయింది. దీనిపై దృష్టి సారించి పనులు పూర్తిచేయించాల్సిన పురపాలక సంఘం అధికారులు ఈ పనిని పక్కన పెట్టేశారు. ఈ భవనం నిర్మాణం చేసే స్థలం చుట్టూ రెండు వైపులా ఇటీవల ప్రహరీ నిర్మించారు. రంగులు కూడా వేశారు. ముస్తాఖాన్‌పేట వైపువెళ్లే రహదారి వెంబడి ఉన్న ప్రహరీ కూల్చివేశారు. ఈ పని ఎందుకు చేశారో తెలియదు. పోర్టు రోడ్డు వైపున ప్రహరీ శిఽథిలావస్థకు చేరినా కనీస మరమ్మతులు చేయలేదు. ముందుచూపులేకుండా మునిసిపల్ ఇంజనీర్‌లు అత్యుత్సాహంతోనే ఈ ప్రహరీని రెండువైపులా నిర్మాణం చేశారని కార్యాలయ ఉద్యోగులు బాహటంగానే చెప్పుకుంటున్నారు. అసలు కార్యాలయ భవన నిర్మాణాన్ని పక్కనపెట్టి రెండు వైపులా ప్రహరీ నిర్మాణం చేయడం వెనుక మర్మమేమిటనే అంశంపై కార్యాలయ ఉద్యోగులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పనిచేయని ఆర్వోప్లాంట్
ప్రస్తుతం నడుస్తున్న మునిసిపల్ కార్యాలయంలో కమిషనర్ చాంబరు ఎదురుగా కార్యాలయ ఉద్యోగులు, వివిధ పనులపై వచ్చే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు ఆర్వో ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. రెండు నెలలుగా ఈ ప్లాంట్ పనిచేయడం లేదు. దీంతో తాగునీటి కోసం ఉద్యోగులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.