Share News

ఫ్లైఓవర్‌ వింతలు!

ABN , Publish Date - Feb 12 , 2026 | 12:29 AM

గుడివాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో కాంట్రాక్టర్‌, ఎన్‌హెచ్‌ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన ఓ బాధితుడి భవనాన్ని రాత్రికిరాత్రే కూల్చేశారు. మరో చోట రహదారి, పంట కాల్వను ఆక్రమించి మరీ నిర్మించిన భవనాలను చూసీచూడనట్టు వదిలేశారు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఫ్లైఓవర్‌ వింతలు!

- కోర్టు స్టే ఉన్న భవనం రాత్రికిరాత్రే కూల్చివేత!

- రోడ్డు ఆక్రమించి నిర్మించిన భవనాన్ని వదిలేశారు!

- వైసీపీ నాయకుడి భవనం వైపు కన్నెత్తిచూడలేదు..

- ఎన్‌హెచ్‌ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు

గుడివాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్లై ఓవర్‌ నిర్మాణంలో కాంట్రాక్టర్‌, ఎన్‌హెచ్‌ అధికారుల తీరు వివాదాస్పదంగా మారింది. పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన ఓ బాధితుడి భవనాన్ని రాత్రికిరాత్రే కూల్చేశారు. మరో చోట రహదారి, పంట కాల్వను ఆక్రమించి మరీ నిర్మించిన భవనాలను చూసీచూడనట్టు వదిలేశారు. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రజ్యోతి-గుడివాడ:

గుడివాడ పట్టణంలోని భీమవరం రైల్వే గేటు, మచిలీపట్నం గేటు మీదగా బస్టాండ్‌ వద్ద నుంచి మండలంలోని బిళ్లపాడు శివారు చినఎరుకపాడు వరకు రూ.317.22 కోట్ల వ్యయంతో ఇంజినీరింగ్‌ ప్రాసిక్యూట్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈ.పి.సి) ప్రాజెక్టు ఒప్పందం ప్రకారం రైల్వే ప్లై ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు ఎన్‌హెచ్‌ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి అవసరమైన చోట భూసేకరణ పూర్తిచేశారు.ఈ క్రమంలో ప్రైవేటు స్థలాలు, రహదారి వెంబడి ఆక్రమణలు, కాల్వల ఆక్రమణలకు సైతం పరిహారం చెల్లించారు.

కోర్టులో ఉన్న భవనం బలవంతంగా కూల్చివేత

తొలి విడతగా 53 పిల్లర్‌లతో మెయిన్‌ క్యారేజ్‌ వే (ఎం.సి.డబ్ల్యూ) ప్రధాన బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టారు. పనులు ప్రారంభం కాకుండానే భూసేకరణలో తీసుకున్న స్థలాలను ఎన్‌హెచ్‌(నేషనల్‌ హైవే) అధికారులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో భీమవరం రైల్వే గేటు వద్ద మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నుగలాపు వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీనివాసరావుకు చెందిన స్థలం భూసేకరణలో ఉంది. కోల్పోతున్న ఆస్తికి రూ.1.95 కోట్లు వస్తాయని తెలిపి, మొదటి విడతలో కేవలం 85 చ.గ.ల స్థలం తాలూకు రూ.90 లక్షలు వారి ఖాతాలో జమచేశారు. మిగిలిన 65 చ.గ.ల స్థలానికి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా నోటిఫికేషన్‌ను విడుదల చేసేసారు. దీనిపై శ్రీనివాసరావు కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో రెండో విడతలో రూ.45 లక్షలు చెల్లించారు. మొదట పేర్కొన్న విధంగా శ్రీనివాసరావుకు రూ.1.95 కోట్లు చెల్లించాల్సి ఉండగా, బాధితునికి రెండు విడతల్లో కలిపి రూ.1.35 కోట్లు మాత్రమే చెల్లించారు. మిగిలిన పరిహారాన్ని చెల్లించాలని పలుమార్లు రెవెన్యూ అధికారులు, ఎన్‌హెచ్‌ అధికారులను బాధితుడి కుటుంబసభ్యులు సంప్రదిస్తే దాటవేయసాగారు. అభివృద్ధికి తాను ఆటంకం కాకూడదనే ఉద్దేశ్యంతో కోర్టు పరిధిలో ఉన్నా కూడా తాను కోల్పోతున్న భవన భాగాన్ని మిగిలిన భవనానికి ఎటువంటి నష్టం కలుగకుండా కట్‌ చేయించసాగారు. ఈ క్రమంలో రెండు నెలల కిందట కోర్టు స్టే ఉన్నా కూడా ఎన్‌హెచ్‌ అధికారులు లెక్కచేయకుండా.. రాత్రికి రాత్రి పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారుల అండతో బలవంతంగా భవనాన్ని కూల్చేశారు. కోర్టు పరిధిలో ఉందని చెప్పిన వినలేదని బాధితుడు శ్రీనివాసరావు తండ్రి మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నుగలాపు వెంకటేశ్వరరావు వాపోయారు.

బందరు రోడ్డులో భవనాన్ని వదిలేశారు!

స్థానిక ఆటోనగర్‌ మొదటి రోడ్డు, బొమ్ములూరు పంట కాల్వను ఆక్రమించి రెండు భారీ భవనాలున్నాయి. ఫ్లైఓవర్‌ భూసేకరణలో ఈ రెండు భవనాలకు నష్టపరిహారం చెల్లించారు. ప్రధాన ఫ్లై ఓవర్‌కు అనుసంధానంగా బందరు రోడ్డు వైపు ఫ్లై ఓవర్‌ పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. రాజకీయ పలుకుబడి మెండుగా ఉండటంతో రెండు భవనాలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తగా పిల్లర్‌లను, వాటిపై శ్లాబును నిర్మించేశారు. నిర్మాణానికి అడ్డుగా ఉన్న ఎందుకు మినహాయించారో అర్థంకావడం లేదు. వీటిలో ఒక భవనం మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అనుచరుడు గుత్తా నానికి చెందింది కావడంతోనే మినహాయించారని కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది. అధికారంలో లేకున్నా వైసీపీ వాళ్ల హవానే నడుస్తోందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు.

సర్వీస్‌ రోడ్డు నిర్మాణంలోనూ అంతే!

ప్రధాన ఫ్లైఓవర్‌కు అనుసంధానంగా బందరు వైపు ఫ్లైఓవర్‌ నిర్మాణ పనులు చేపట్టారు. దీనిలో భాగంగా ఫ్లైఓవర్‌ కింద వచ్చే సర్వీస్‌ రోడ్డు నిర్మాణాన్ని మార్కెట్‌ యార్డు వైపు నుంచి పెద్ద కాల్వ వైపునకు ప్రారంభించారు. దీని కోసం అవసరమైన మట్టిని తోలి చదును చేశారు. కానీ వైసీపీ నాయకులకు చెందిన భవనాలు ఎన్‌హెచ్‌, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులకు కనపడకపోవడం విశేషం.

త్వరలోనే రెండు భవనాలను తొలగిస్తాం : ఎన్‌హెచ్‌ డీఈఈ

ఫ్లైఓవర్‌ నిర్మాణంలో భాగంగా బందరు రోడ్డులో ఉన్న రెండు భవనాల్లో కొంత మేర ప్రైవేటు ఆస్తి, కొంత భాగం ప్రభుత్వ స్థలం ఉందని ఎన్‌హెచ్‌ డీఈఈ సత్యనారాయణ తెలిపారు. స్థల యజమాని పలుమార్లు సర్వే చేయించడంతో ఆలస్యమైందని చెప్పారు. ఇటీవలే అవార్డు ప్రకటన జరిగిందని, పరిహారం చెల్లించిన వెంటనే రెండు భవనాలను తొలగిస్తామని వివరించారు. నుగలాపు శ్రీనివాసరావు స్థల విషయంలో ఎటువంటి స్టే లేదని, ఉన్నతాధికారుల ఆదేశాలతో భూసేకరణ స్థలంలోని భవనాన్ని తొలగించినట్టు చెప్పారు. బాధితుడికి పరిహారం పూర్తిగా చెల్లించినట్టు స్పష్టం చేశారు.

Updated Date - Feb 12 , 2026 | 12:29 AM