Share News

Farmers Issues: పాస్‌ కాని పుస్తకాలు

ABN , Publish Date - Jan 03 , 2026 | 04:50 AM

గత ప్రభుత్వంలో జగన్‌ ఫొటోలతో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాల స్థానంలో జగన్‌ బొమ్మ స్థానంలో రాజముద్ర ఉన్న పాస్‌పుస్తకాల పంపిణీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Farmers Issues: పాస్‌ కాని పుస్తకాలు

  • గత ప్రభుత్వంలోని రీ సర్వే తప్పులు

  • సరిదిద్దకుండా ఆ డేటాతోనే ముద్రణ

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వంలో జగన్‌ ఫొటోలతో ముద్రించిన పట్టాదారు పాస్‌పుస్తకాల స్థానంలో జగన్‌ బొమ్మ స్థానంలో రాజముద్ర ఉన్న పాస్‌పుస్తకాల పంపిణీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇది మంచి పరిణామమే. అయితే నాడు జగన్‌ జమానాలో రీ సర్వే చేసిన గ్రామాల్లో సృష్టించిన కొత్త సమస్యలు, వివాదాలు, తప్పుగా నమోదు చేసిన రికార్డులను పరిష్కరించకుండానే.. అవే తప్పులతో రైతులకు పాస్‌పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. నాడు రీ సర్వే చేసిన 6,700 గ్రామాల్లో పాస్‌పుస్తకాల్లో తప్పులు సవరించాలని 8.75 లక్షలమంది రైతులు కూటమి ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు. వీటిలో ఒక్కటీ పరిష్కారం కాలేదు. కానీ ఏకంగా 21.80 లక్షల పాస్‌ పుస్తకాలు ముద్రించారు. సమస్యలు పరిష్కరించిన తర్వాత పాస్‌పుస్తకం ఇస్తే రైతుకు ఉపయోగం. కానీ జగన్‌ సృష్టించిన తప్పులను యథాతథంగా నమోదు చేసి కొత్తగా పాస్‌పుస్తకాలు ఇవ్వడం వల్ల రైతులకు ఉపయోగం ఏమిటి? కొత్త పాస్‌పుస్తకాల్లో జగన్‌ ఫొటో తీసేసినా, తప్పులు మాత్రం కొనసాగుతున్నాయి. నాడు రీ సర్వే చేసిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త పాస్‌పుస్తకాలు తీసుకుంటున్న రైతులు వాటిలో మళ్లీ పాత తప్పులు చూసి గగ్గోలు పెడుతున్నారు. కొన్ని పుస్తకాల్లో రైతుల ఫొటోలు మారిపోయాయి. మరికొన్నింటిలో అసలు ఫొటోలే లేవు. సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, ఖాతా నంబర్లు.. ఇలా అన్నీ తప్పు వచ్చాయి. వీటిపై అధికారులను ప్రశ్నిస్తే, సరిచేసి మళ్లీ ఇస్తామని వెనక్కి తీసుకుంటున్నారు. ఈ మాత్రం దానికి 35 కోట్లపైనే ఖర్చు పెట్టి పాస్‌పుస్తకాలు ముద్రించి ఇవ్వాలా? ఇంతకీ ప్రభుత్వం సాధించింది ఏమిటి? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ‘నాటి సమస్యలను కొన్ని పరిష్కరించాలని నిర్ణయించాం. మరికొన్ని త్వరలోనే పరిష్కరిస్తాం’ అని రెవెన్యూ శాఖ మంత్రి గురువారం ప్రకటించారు. ఆ పరిష్కార ప్రక్రియ మొదలుకాకముందే పాస్‌పుస్తకాలు పంపిణీ మొదలుపెట్టారు.


నాడు ఏం జరిగిందంటే...

గత జగన్‌ ప్రభుత్వం 2020 నుంచి 2024 వరకు భూముల సర్వే చేసింది. రైతులకు వివాదాలు లేని భూముల రికార్డులు అందిస్తామని, రికార్డు ప్రక్షాళన చేస్తామని చెప్పింది. జగన్‌ సర్కారు దిగిపోయేనాటికి 6,700 గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేసినట్లుగా ఫైనల్‌ నోటిఫికేషన్లు ఇచ్చారు. రైతులకు జగన్‌ బొమ్మలతో కూడిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేశారు. ఆ పుస్తకాల్లో రైతుల పేర్లు, భూమి సర్వే నంబర్‌, విస్తీర్ణం, సరిహద్దుల్లో భారీగా తప్పులు వచ్చాయి. రైతుల ప్రమేయం లేకుండా రెవెన్యూ, సర్వే సిబ్బంది సొంతంగా సర్వే రికార్డులు తయారు చేసుకొని ఆ డేటానే ఫైనల్‌ చేశారన్న విమర్శలొచ్చాయి. ఆ డేటాను నాటి ప్రభుత్వం పున:పరిశీలన చేయలేదు. నాటి జగన్‌ సలహాదారుకు సమీప బంధువు, గుంటూరులోని ఓ ప్రైవేటు ప్రింటర్‌కు పాస్‌పుస్తకాల పంపిణీ బాధ్యత ఇచ్చారు. తప్పులతడక పాస్‌పుస్తకాలను లక్షల మంది రైతులు తీసుకోలేదు. కొందరు తీసుకున్నా దానితో ఉపయోగం లేదని చించివేశారు.


రీ సర్వే గ్రామాల్లో 8.75 లక్షల సమస్యలు

కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే గత ప్రభుత్వం రీ సర్వే నిర్వహించిన 6,700 గ్రామాల పరిధిలో సభలు నిర్వహించింది. తమ సమస్యలు పరిష్కరించాలని 8,75,900 మంది రైతులు ప్రభుత్వానికి వినతులు ఇచ్చారు. తక్కువగా భూమి విస్తీర్ణం చూపించడం, తప్పుగా సర్వే నంబర్‌ నమోదు చేయడం, సరిహద్దులను తారుమారు చేయడం, వారసత్వపు భూములను సబ్‌ డివిజన్‌ చేయకపోవడం, నోషనల్‌ ఖాతాలను సరిచేయకపోవడం.. ఇలాంటి అనేక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఇవిగాక ఫ్రీ హోల్డ్‌ అయిన అసైన్డ్‌, చుక్కల, షరతుగల పట్టా, సర్వీస్‌ ఇనాం భూములు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులు, మాజీ సైనికులు, సర్వీసులో ఉన్న సైనికుల భూముల సమస్యలు కూడా ఉన్నాయి. కానీ ఈ సమస్యలను పరిష్కరించలేదు. గత ప్రభుత్వంలో తప్పులతడకగా పాస్‌పుస్తకాలు ముద్రించారని తెలిసినా ప్రభుత్వం ఆ డేటానే పరిగణనలోకి తీసుకుంది. రీ సర్వే తప్పులను సరిదిద్దకుండానే గుంటూరులోని ప్రైవేటు ప్రెస్‌కు పంపించింది. జగన్‌ ఫొటో మాత్రమే తీసేసి, మిగతా డేటాతో కొత్త పాస్‌పుస్తకాలను ముద్రించింది. ఈ ప్రైవేటు ప్రెస్‌ కూడా గత జగన్‌ సర్కారులో కీలక సలహాదారుకు సన్నిహితుడిది. ఇప్పుడూ ఆయనకే టెండర్‌ కట్టబెట్టారు. వాస్తవం ఇది కాగా రైతులకు నేరుగా మద్రాస్‌ సెక్యూరిటీ ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి స్పీడ్‌ పోస్టులో పాస్‌పుస్తకాలు అందిస్తామని ముఖ్యమంత్రితో రెవెన్యూశాఖ ప్రకటన చేయించింది.


75 శాతం తప్పులే

  • సీఎం సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరులో పుంగనూరు మండలం మంగళం గ్రామంలో నాడు జగన్‌ సర్కారు రీ సర్వే అనంతరం 1500 మందికి పాస్‌పుస్తకాలు ఇచ్చింది. వీటిలో 1132 పుస్తకాల్లో తప్పులు వచ్చాయి. కూటమి సర్కారు తాజాగా ఇదే గ్రామంలో రైతులకు అందించేందుకు 1052 పాస్‌పుస్తకాలు పంపించింది. అందులో 245 మాత్రమే ఏ తప్పులూ లేకుండా ఉన్నాయి. 807 పాస్‌పుస్తకాల్లో మళ్లీ తప్పులు వచ్చాయి. రైతుల ఫొటోలు మారిపోయాయి. సర్వే నంబర్లు, భూమి విస్తీర్ణం, ఖాతా నంబర్లు.. ఇలా అన్నీ తప్పే వచ్చాయి. దీంతో వాటిని రైతులకు పంపిణీ చేయకుండా రెవెన్యూ అధికారులు వెనక్కి తీసుకెళ్లారు.

  • ఉమ్మడి చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలో రైతుల కోసం 3,834 పాస్‌పుస్తకాలు పంపించారు. అందులో 1337 పుస్తకాల్లో తప్పులు వచ్చాయని గుర్తించారు. 413 పుస్తకాల్లో రైతుల ఫొటోలు మార్చేశారు. 27 పుస్తకాల్లో రైతుల ఫొటోలే లేవు. మరో 897 పుస్తకాల్లో భారీగా తప్పులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో తప్పులున్న వాటిని పంపిణీ చేయకుండా వెనక్కి తీసుకెళ్లారు.

  • పాస్‌పుస్తకాల్లో భారీగా తప్పులున్నాయని రెవెన్యూ యంత్రాంగం గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించింది. కొందరు జాయింట్‌ కలెక్టర్లు, కలెక్టర్లు ఇదే విషయాన్ని రెవెన్యూ శాఖ పెద్దల దృష్టికి తీసుకొచ్చారు. తప్పులున్న పుస్తకాలను రైతులకు పంపిణీ చేయవద్దని రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

Updated Date - Jan 03 , 2026 | 04:52 AM