Share News

మునిగిన బతుకులు

ABN , Publish Date - Jul 19 , 2026 | 03:39 AM

ఎప్పటిలాగే ఆ గిరిజనులు చేపలు పట్టేందుకు గోదావరికి వెళ్లారు. 11 మంది కలిసి వలలు వేసేందుకు నదిలో దిగారు. కానీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లోతు అంచ నా వేయలేకపోయారు.

మునిగిన బతుకులు

  • చేపలు పట్టేందుకు వెళ్లి గోదావరిలో ఐదుగురు గిరిజనులు మృతి

  • లోతు, వరద ఉధృతి అంచనా లేక మునక

  • రక్షించే ప్రయత్నం చేసినా లేని ఫలితం

  • మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు

  • మరో ఆరుగురు మహిళలు ఈదుకుంటూ ఒడ్డుకు

  • మృతుల కుటుంబాలను ఆదుకోవాలని అధికారులకు ఆదేశం

ఎటపాక/అమరావతి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఎప్పటిలాగే ఆ గిరిజనులు చేపలు పట్టేందుకు గోదావరికి వెళ్లారు. 11 మంది కలిసి వలలు వేసేందుకు నదిలో దిగారు. కానీ వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో లోతు అంచ నా వేయలేకపోయారు. ఈ క్రమంలో ఐదుగురు కొట్టుకుపోయి మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన పోలవరం జిల్లా ఎటపాక మండలం, గొల్లగూడెం గోదావరి రేవులో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం గొమ్ముకొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే సుశీల (37), ఊకే లక్ష్మి (37), తుర్రం భారతి (40), బాసిబోయిన బాలరాజు (40), ఊకే రమేశ్‌ (38)తో పాటు మరో ఆరుగురు మహిళలు కలిసి చేపలు పట్టేందుకు వలతో గోదావరి నదిలో దిగారు. ఒకవైపు నుంచి వల పన్నే క్రమంలో ఊకే సుశీల, ఊకే లక్ష్మి, తుర్రం భారతి లోతు అంచనా వేయలేకపోవడం, వరద నీరు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోయారు. ఇది గమనించి మరో పక్కన ఉన్న బాలరాజు, రమేశ్‌ వారిని రక్షించేందుకు ఈతకొడుతూ వెళ్లారు. వరద ఉధృతికి ముగ్గురు మహిళలతో పాటు ఈ ఇద్దరూ కూడా నీటిలో మునిగిపోయారు. ఆ సమయంలో వరదనీటి ఉధృతిగా ఉన్నా మరో ఆరుగురు మహిళలు ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మునిగిపోతున్న తమ వారికి కాపాడేందుకు వలలు, చీరలు వారికి అందించేందుకు నదిలోకి విసిరారు.


అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఐదుగురు నీటిలో మునిగిపోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు, స్థానిక మత్య్సకారులకు తెలపడంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. రెండు గంటల తర్వాత నది నుంచి ఐదుగురి మృతదేహాలు వెలికితీశారు. ఈ ఘటనతో గొమ్ముకొత్తగూడెం గిరిజన గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


సీఎం, డిప్యూటీ సీఎం విచారం

చేపల వేటకు వెళ్లి గోదావరిలో ఐదుగురు మృతి చెందిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గొల్లగూడెం ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పోలవరం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Updated Date - Jul 19 , 2026 | 03:41 AM