Share News

ఫొటో సరదా మింగేసింది

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:29 AM

సరదాగా ఫొటోలు దిగడానికి ప్రయత్నించి గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. విహారానికి వచ్చిన వీరు తమ కుటుంబాలను అంతులేని విషాదంలో ముం చేశారు.

ఫొటో సరదా మింగేసింది

  • గోదారిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం

  • ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో విషాదం

  • భద్రాచలం విహారానికి ఏడుగురు

  • వారిలో ఐదుగురు అమరావతి ఎస్‌ఆర్‌ఎం విద్యార్థులు

  • కొల్లిగూడెంలో గోదావరిలో స్నానాలు

  • ఫొటోలు దిగడానికి లోతుగా నీళ్లు లేవని.. 2.5 కి.మీ. నడిచి మరో గోదావరి తీరానికి..

  • అక్కడ నదిలోని రాళ్లగుట్టల వద్దకు వెళ్లే యత్నంలో మునిగిపోయిన ఆరుగురు విద్యార్థులు

  • ఈత రావడంతో ఒకరు ఒడ్డుకు

  • నదిలోకి దిగకుండా తీరాన్నే మరొకరు..

  • ఘటన గురించి ఆరా తీసిన సీఎం

  • గాలింపు చర్యలు పెంచాలని ఆదేశం

కుక్కునూరు, భద్రాచలం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): సరదాగా ఫొటోలు దిగడానికి ప్రయత్నించి గోదావరిలో మునిగి ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. విహారానికి వచ్చిన వీరు తమ కుటుంబాలను అంతులేని విషాదంలో ముం చేశారు. ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లోని ఏలూరు జిల్లా కుక్కునూరు మం డలం వేలేరు ప్రాంతంలో శుక్రవారం ఈ ఘోరం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటే సమయానికి మూడు మృతదేహాలను గజఈతగాళ్లు వెలికితీశారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం నదిలో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన ఏడుగురు విద్యార్థుల్లో ఇప్పుడు మిగిలిన ఇద్దరే ఆ ఘటనకు సాక్ష్యంగా నిలిచారు. ప్రమాదం నుంచి బయటపడిన చుండూరు దీపక్‌ అనే విద్యార్థి పోలీసులకు తెలిపిన వివరాలివి.. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం కాలేజీలో దీపక్‌, గడ్డం హర్షవర్దన్‌, గోకా తేజజ్ఞసాయి, పాశం సతీశ్‌కుమార్‌, చారుగండ్ల శ్రీకర్‌గుప్తా చదువుతున్నారు. స్నేహితుడికి చెందిన కారులో దీపక్‌, హర్ష, తేజ్‌, సతీశ్‌ బయలుదేరగా, దారిమధ్యలో విజయవాడలో దగ్గుబాటి నవదీప్‌ (ఉయ్యూరు కేఎల్‌యూ), భద్రాచలంలో శ్రీకర్‌, పొడిచేటి అభిరామ్‌ (ఇంటర్మీడియెట్‌) జత కలిశారు. శ్రీకర్‌, అభిరామ్‌లది తెలంగాణ.

Untitled-4 copy.jpg


అందరు కలిసి భద్రాచలం రామాలయంలో దర్శనం చేసుకున్నారు. అనంతరం పర్ణశాల వెళ్లి తిరిగి వచ్చి సినిమా చూశారు. అక్కడికి సమీపంలోని గోదావరి తీర ప్రాంతాన్ని చూడటానికి కొల్లిగూడెం ఇసుక ప్రాంతానికి వచ్చారు. అక్కడే ఉన్న గోదావరి తీరంలో స్నానం చేశారు. అనంతరం సరదాగా ఫొటోలు దిగాలని భావించారు. కానీ అక్కడ గోదావరిలో లోతుగా నీళ్లు లేకపోవడంతో ఇసుకలో సుమారు రెండున్నర కిలోమీటర్లు నడిచి అవతలివైపు రాళ్లగుట్టలతో ఉన్న గోదావరి వద్దకు వెళ్లారు. అక్కడ కృష్ణాజిల్లా కలిదిండి గ్రామానికి చెందిన చండూరి దీపక్‌ మినహా మిగిలిన ఆరుగురు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నదిలో మధ్యలో ఉన్న రాళ్లగుట్టలపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ గోదావరి లోతును అంచనా వేయలేక నీళ్లలోకి జారారు. వీరిలో తేజ నది లోతులోకి వెళ్లాడు. మునిగిపోకుండా కాపాడటానికి హర్ష, సతీశ్‌, నవదీప్‌, శ్రీకర్‌, అభిరామ్‌లు ఒకరి చేయి ఒకరు పట్టుకుని తేజను లాగే ప్రయత్నం చేశారు. ప్రవాహం వేగానికి అందరూ నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో హర్షకు ఈత రావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఒడ్డునే ఉన్న దీపక్‌ కూడా ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. విషయం వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. భద్రాచలం ఎటపాక, కుక్కునూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెస్క్యూ టీమ్‌ గాలింపు చర్యలు చేపట్టగా, ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిని శ్రీకర్‌, అభిరామ్‌, నవదీప్‌గా గుర్తించారు. వీరిలో శ్రీకర్‌ (20)), అభిరామ్‌ (17)లది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం. నవదీప్‌ (19)ది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కనుమూరు. గల్లంతయిన వారిలో తేజ్‌ది (19) కృష్ణాజిల్లా ఉయ్యూరు. సతీశ్‌ స్వస్తలం మదనపల్లి.


‘పరిధి’పై తర్జనభర్జన

గోదావరిలో మునిగి విద్యార్థులు గల్లంతైన ప్రమాద స్థలి పరిధి విషయంలో రెండు మండలాల పోలీసులు, రెవెన్యూ అధికారులు తర్జనభర్జన పడ్డారు. విద్యార్థులు ముందుగా పోలవరం జిల్లా ఎటపాక మండలం కొల్లిగూడెం ఇసుక ర్యాంప్‌ వద్దకు వచ్చారు. అక్కడ వాహనాలు ఉంచి గోదావరి వద్దకు వచ్చి స్నానానికి దిగి గల్లంతయ్యారు. ఈ సమాచారం ముందుగా ఎటపాక మండలం పోలీసులకు చేరింది. అయితే ఘటన జరిగిన ప్రదేశం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం వేలేరు గోదావరి రేవుకు సమీపంలో ఉంది. దీంతో ఎటపాక పోలీసులు అది కుక్కునూరు పోలీసుల పరిధిలోకి వస్తుందని భావించారు. కాగా కొల్లిగూడెం ఇసుక ర్యాంప్‌ ఎటపాక ప్రాంతంలో ఉంది. విద్యార్థులు అటువైపు ఉన్న గోదావరిలో స్నానానికి దిగి గల్లంతయ్యారు. దీంతో జరిగిన ఘటన ఎటపాక మండల పరిధిలోకి వస్తుందని కుక్కునూరు పోలీసులు, రెవెన్యూ సిబ్బంది భావించారు. ‘మీ పరిధి.. అంటే మీ పరిధి..’ అంటూ రెండు వైపులా పోలీసు, రెవెన్యూ వర్గాల్లో చర్చ జరిగింది. చివరికి ఉన్నతాధికారుల జోక్యంతో కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వైదిక ఉద్యోగిగా చేరక ముందే..

భద్రాచలానికి చెందిన పొడిచేటి అభిరామ్‌ రామాలయంలో వైదిక సేవల్లో పాల్గొంటున్నాడు. ఏప్రిల్‌లో అధికారికంగా వైదిక ఉద్యోగిగా విధుల్లోకి అభిరామ్‌ను తీసుకోవాల్సి ఉందని దేవస్థానం వర్గాల ద్వారా తెలుస్తోంది. అభిరామ్‌ తాత భద్రాద్రి దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకుడు పొడిచేటి రామచంద్రాచార్యులు. కాగా తండ్రి వంశీ ఐటీసీలో మేనేజరుగా పని చేస్తున్నారు. కాగా, చారుగుళ్ల శ్రీకర్‌ తండ్రి వ్యాపార రంగంలో ఉన్నారు.

చంద్రబాబు ఆరా

విద్యార్థుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. ఆ చూకీ లభించని ఇద్దరు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అసరాగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

Updated Date - Mar 21 , 2026 | 05:32 AM