Share News

ఐదేళ్ల బాలుడిని రక్షించబోయి ఐదుగురు గల్లంతు

ABN , Publish Date - May 31 , 2026 | 06:07 AM

నదిలో ఈతకు దిగినవారిలో ఓ బాలుడు కొట్టుకుపోతుండగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి సహా మరో నలుగురు గల్లంతయ్యారు.

ఐదేళ్ల బాలుడిని రక్షించబోయి ఐదుగురు గల్లంతు

  • తుంగలో విషాదాంతమైన ఈత సరదా

  • తండ్రి సహా మరో నలుగురి కోసం గాలింపు

  • ఒకరి మృతదేహం లభ్యం.. మంత్రాలయంలో ఘోరం

మంత్రాలయం, మే 30(ఆంధ్రజ్యోతి): నదిలో ఈతకు దిగినవారిలో ఓ బాలుడు కొట్టుకుపోతుండగా, అతడిని కాపాడేందుకు ప్రయత్నించిన తండ్రి సహా మరో నలుగురు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మంత్రాలయం పాతవీధికి చెందిన కాలప్ప ఆచారి, మౌనమ్మ దంపతుల కుమారుడు శశిధర్‌కు ఈనెల 7న వివాహం జరిగింది. ఆదివారం సత్యనారాయణ వ్రతానికి ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ పూజలో పాల్గొనేందుకు మంత్రాలయానికి చెందిన కాలప్పఆచారి తమ్ముడి కుమారుడు రాఘవేంద్రాచారి (28)... హైదరాబాద్‌కు చెందిన సతీశ్‌చంద్ర (36), అతడి కుమారుడు యువన్‌చంద్ర (5), ఎమ్మిగనూరుకు చెందిన ధను (22), అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సంధ్య (21), ఆదోనికి చెందిన కమ్మరి అపర్ణతో కలిసి శనివారం వచ్చారు. ఈ ఆరుగురు శనివారం సాయంత్రం తమ ఇంటి సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లారు. అంతవరకు సరదాగా ఈతకొడుతూ గడిపారు. ఐదేళ్ల యువన్‌చంద్ర అనే బాలుడు నీటిలో మునిగిపోతుండగా కాపాడేందుకు తండ్రి సతీశ్‌చంద్ర, రాఘవేంద్రాచారి, ధను, సంధ్య, అపర్ణ నీటిలో దిగి ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. అపర్ణను సమీపంలో ఉన్న గ్రామస్థులు చూసి.. వెంటనే ఆమెను కాపాడారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గల్లంతైన వారికోసం పుట్టీల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో వడ్ల ధను మృతదేహం లభ్యమైంది. అగ్నిమాపక సిబ్బందితో రాత్రి 8గంటల వరకు గాలింపు కొనసాగించారు.


అనూహ్యంగా వృద్ధుడి మృతదేహం లభ్యం

గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపడుతుండగా ఓ వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన కుటుంబంలో వ్యక్తి అని అందరూ భావించగా మృతదేహాన్ని నదినుంచి బయటకు తీయడంతో వృద్ధుడి మృతదేహం చూసి అవాక్కయారు. మృతుడు కర్ణాటక రాష్ట్రం హాసన్‌ జిల్లా బేలూరు తాలూకా దొడ్డమేదుర్‌ గ్రామానికి చెందిన డీహెచ్‌ యాలక్కిగౌడ (75)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - May 31 , 2026 | 06:11 AM