Share News

పాంచ్‌ ఫ్లై ఓవర్లు!

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:02 AM

అరవై ఐదో నెంబర్‌ జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ల సమస్య త్వరలో ఓ కొలిక్కిరానుంది. మొత్తం ఐదు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ అధికారులు ప్రతిపాదించనున్నారు. వీటిలో మూడు ప్రజాప్రతినిధుల చొరవతో, మరో రెండు అవసరాలను బట్టి నిర్మించాలని నిర్ణయించారు. స్టేక్‌ హోల్డర్ల సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఫైల్‌ వెళ్లనుంది.

పాంచ్‌ ఫ్లై ఓవర్లు!

- ఎన్‌హెచ్‌-65పై నిర్మాణానికి ప్రతిపాదనలు

- సింగిల్‌ డీపీఆర్‌ పరిధిలోకి విస్తరణ పనులు

- ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు, ప్రజాప్రతినిధుల స్పందనతో మారిన వ్యవహారం

అరవై ఐదో నెంబర్‌ జాతీయ రహదారిపై ఫ్లై ఓవర్ల సమస్య త్వరలో ఓ కొలిక్కిరానుంది. మొత్తం ఐదు ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఎన్‌హెచ్‌ అధికారులు ప్రతిపాదించనున్నారు. వీటిలో మూడు ప్రజాప్రతినిధుల చొరవతో, మరో రెండు అవసరాలను బట్టి నిర్మించాలని నిర్ణయించారు. స్టేక్‌ హోల్డర్ల సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి ఫైల్‌ వెళ్లనుంది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

అరవై ఐదో నెంబర్‌ జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌-65)పై ఐదు ఫ్లై ఓవర్ల ఏర్పాటుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) అధికారులు ప్రతిపాదించబోతున్నారు. వీటిలో మూడు ప్రజాప్రతినిధుల డిమాండ్ల మేరకు, మరో రెండు అవసరాలను బట్టి ఎన్‌హెచ్‌ అధికారులే ప్రతిపాదిస్తున్నారు. ఫ్లై ఓవర్ల అవసరాలకు విరుద్ధంగా ఎన్‌హెచ్‌ గతంలో పరిమితంగా ఫ్లై ఓవర్ల ప్రతిపాదనలు ఉండటంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రజాప్రతినిధులు అప్రమత్తం అయ్యారు. అవసరానికి తగినట్టుగా ఫ్లై ఓవర్ల ఏర్పాటుపై పట్టుదల ప్రదర్శించడంతో.. వారి నుంచి వస్తున్న డిమాండ్‌ మేరకు ఐదు ఫ్లై ఓవర్లను ప్రతిపాదించాలని భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలపై స్టేక్‌ హోల్డర్ల సమావేశంలో చర్చించిన మీదట రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎన్‌హెచ్‌ అధికారులు పంపనున్నారు.

ప్రతిపాదిత ఫ్లై ఓవర్లు ఇవే..

ఎన్‌హెచ్‌-65పై హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో ఇబ్రహీంపట్నం రింగ్‌ సెంటర్‌ దగ్గర 1.3 కిలో మీటర్లు, గొల్లపూడి బైపాస్‌ నుంచి కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వరకు 2.50 కిలోమీటర్లు, కనకదుర్గ ఫ్లై ఓవర్‌ ల్యాండింగ్‌ దగ్గర నుంచి పీఎన్‌బీస్‌, కనకదుర్గ వారధి జంక్షన్‌ మీదుగా స్ర్కూబ్రిడ్జి వరకు ఐదు కిలోమీటర్ల మేర, బెంజిసర్కిల్‌ నుంచి కానూరు వరకు తొమ్మిది కిలోమీటర్ల పొడవున, నిడుమోలు దగ్గర 700 మీటర్ల మేర మొత్తం ఐదు ఫ్లై ఓవర్లను ప్రతిపాదించనున్నారు.

మొదటి నుంచి ఎన్‌హెచ్‌-65 విస్తరణ గందరగోళమే!

ఎన్‌హెచ్‌-65 అనేది మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు వెళుతుంది. ఈ హైవే విస్తరణ విషయంలో గతంలో అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) పరిధి వరకు మాత్రమే అటు హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ నుంచి ఇటు అమరావతి ఓఆర్‌ఆర్‌, మచిలీపట్నం నుంచి అమరావతి ఓఆర్‌ఆర్‌ వరకు రెండు వేర్వేరు డీపీఆర్‌లు తయారు చేయటానికి టెండర్లు పిలిచారు. ఆ మేరకు డీపీఆర్‌ల రూపకల్పన జరిగితే ప్రజల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి. ప్రజాప్రతినిధులు కూడా అభ్యంతరం తెలిపారు.

ప్రజాప్రతినిధుల జోక్యంతో కదలిక

విజయవాడ నగరాన్ని పూర్తిగా వదిలేయటం, రెండు వేర్వేరు డీపీఆర్‌ల రూపకల్పన వల్ల తలెత్తే ఇబ్బందులపై పలు మార్లు ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధుల జోక్యంతో కొంత కదలిక వచ్చింది. బెంజిసర్కిల్‌ నుంచి మచిలీపట్నం వరకు, హైదరాబాద్‌ నుంచి గొల్లపూడి బైసాస్‌ ఆ తర్వాత హరిత బరం పార్కు దగ్గర కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వరకు విస్తరించాలన్న ప్రతిపాదనలను ఎంపీలు వల్లభనేని బాలశౌరి, కేశినేని శివనాథ్‌ (చిన్ని) తీసుకువచ్చారు. అయినప్పటికీ ఎన్‌హెచ్‌ - 65 (ఎన్‌హెచ్‌ - 16తో అనుసంధాన పరిధి)పై బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ స్ర్కూ బ్రిడ్జి నుంచి రాజీవ్‌గాంధీ పార్కు దగ్గర కనకదుర్గ ఫ్లై ఓవర్‌ వరకు కూడా నాలుగు వరసలుగా విస్తరణ లేకుండా ఉంటోంది. ఈ మార్గంలో జరిగిన అనేక ప్రమాదాలలో ఎంతోమంది మృత్యువాత పడ్డారు. దీంతో ఈ మార్గంలో ఫ్లై ఓవర్‌ను తీసుకురావటం వల్ల ఎన్‌హెచ్‌ - 65 ఆరు వరసల విస్తరణ సంపూర్ణమవుతుందని, ఈ మార్గంలో ప్రమాదాలు కూడా గణనీయంగా తగ్గుతాయని ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించటం జరిగింది. ఈ మార్గంలో కూడా ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) ఇటీవల మచిలీపట్నంలో ఎన్‌హెచ్‌ అధికారులు నిర్వహించిన స్టేక్‌ హోల్డర్ల సమావేశంలో గట్టిగా ప్రస్తావించారు. ఈ క్రమంలో ఎన్‌హెచ్‌ - 65ను హైదరాబాద్‌ వయా విజయవాడ, మచిలీపట్నం వరకు ఒకే డీపీఆర్‌ రూపకల్పన చేయాలని నిర్ణయించటం జరిగింది.

Updated Date - Feb 16 , 2026 | 01:02 AM