Share News

బీద సోదరులతో మాట్లాడితే రూ.లక్ష జరిమానా

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:16 AM

రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే బీద రవిచంద్ర (బీద సోదరులు)లతో ఎవరైనా మాట్లాడితే గ్రామానికి రూ.1 లక్ష జరిమానా చెల్లించాలని నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి ప్రధాన మత్స్యకార గ్రామంలో దురాయి వేశారు.

బీద సోదరులతో మాట్లాడితే రూ.లక్ష జరిమానా

  • ఇస్కపల్లి మత్స్యకార గ్రామంలో దురాయి.. రేపు జువ్వలదిన్నెకు జగన్‌

అల్లూరు, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్‌రావు, ఎమ్మెల్యే బీద రవిచంద్ర (బీద సోదరులు)లతో ఎవరైనా మాట్లాడితే గ్రామానికి రూ.1 లక్ష జరిమానా చెల్లించాలని నెల్లూరు జిల్లా అల్లూరు మండలంలోని ఇస్కపల్లి ప్రధాన మత్స్యకార గ్రామంలో దురాయి వేశారు. స్థానికుల కథనం మేరకు... ఇటీవల సముద్రంలో తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లను స్థానిక మత్స్యకారులు స్వాధీనం చేసుకుని జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లో ఉంచారు. ఆ బోట్లు రాత్రికిరాత్రే మాయమయ్యాయి. దీనివెనుక బీద సోదరుల హస్తం ఉందని మత్స్యకార గ్రామాల అభియోగం. ఈ విషయమై నెల్లూరు, ప్రకాశం జిల్లాలలకు చెందిన మత్స్యకార గ్రామాల కాపులంతా సింగరాయకొండ మండలం పాకల మత్స్యకార గ్రామంలో ఈ నెల 6న సమావేశమయ్యాయి. జరిగిన ఘటనకు ఇస్కపల్లి, జువ్వలదిన్నె, చెన్నారాయునిపాలెం, కావలి మండలంలోని ఓ పంచాయతీ బాధ్యత వహించాలని, పరిహారంగా రూ.3 కోట్లు చెల్లించాలని ఈ చర్చల్లో తీర్మానం చేసుకున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కొందరు టీడీపీకి చెందిన మత్స్యకార నాయకులు బీద సోదరులతో మాట్లాడుతున్నారనే విషయం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో బీద సోదరులతో ఎవరు మాట్లాడినా వారు గ్రామానికి రూ.1లక్ష చెల్లించేలా దురాయి (కట్టుబాటు) చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న జువ్వలదిన్నె హార్బర్‌ పర్యటనకు వస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్‌ కార్యక్రమానికి హాజరవ్వాలని గ్రామంలో చర్చించుకుంటున్నట్టు తెలిసింది. కార్యక్రమానికి హాజరుకాని వారికి దురాయి వేయాలనే ఆలోచనలో గ్రామ పెద్దలు ఉన్నట్టు సమాచారం.

Updated Date - Apr 14 , 2026 | 06:17 AM