Share News

పట్టపు కులాన్ని ఎస్టీల్లో చేర్చాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:02 AM

దక్షిణ కోస్తా జిల్లాల్లో 30 లక్షలకుపైగా జనాభా ఉన్న మత్స్యకార పట్టపు కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నాలుగు జిల్లాల మత్స్యకారులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పట్టపు కులాన్ని ఎస్టీల్లో చేర్చాలి

  • మెరైన్‌, పోర్టుల్లో యువతకు ప్రాధాన్యమివ్వాలి

  • ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసిన కాపులు

ఉలవపాడు, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): దక్షిణ కోస్తా జిల్లాల్లో 30 లక్షలకుపైగా జనాభా ఉన్న మత్స్యకార పట్టపు కులస్థులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నాలుగు జిల్లాల మత్స్యకారులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌లో ఉంచిన నాలుగు తమిళనాడు బోట్లను తప్పించిన విషయమై చర్చించేందుకు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల పట్టపు కాపులు, పెద్దలు బుధవారం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలంలోని పెద్దపట్టపుపాలెంలో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా పట్టపు కాపుల పెద్దలు విలేకరులతో మాట్లాడుతూ పుదుచ్చేరి, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన హైస్పీడ్‌ బోట్లు మన తీరప్రాంతంలోకి రాకుండా రాష్ట్రప్రభుత్వం మెరైన్‌ ఫిషరీష్‌ రెగ్యులేషన్‌ (ఏపీ ఎంఎఫ్ ఆర్‌) యాక్ట్‌ను పటిష్టంగా అమలు చేయాలన్నారు. పట్టపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలన్నారు. 75 శాతం సబ్సిడీతో పడవలు, వలలు, ఇంజన్లు అందజేయాలని కోరారు. కాగా, జువ్వలదిన్నె హార్బర్‌లో బోట్ల మాయం ఘటనకు బాధ్యులైనవారు రూ.5కోట్ల జరిమానా కట్టాలని ఈ నెల 6న తీర్మానించారు. అయితే బాధ్యులైన మూడు గ్రామాల కాపులు తాము రూ.1.5 కోట్లు మాత్రమే కట్టగలమని చెప్పారు. బుధవారం మరోసారి ఈ విషయం చర్చకురాగా, జరిమానా కట్టాల్సిందేనని కాపులు తేల్చి చెప్పారు. చర్చల అనంతరం రూ.2.25కోట్లు కట్టేందుకు మూడు గ్రామాల కాపులు అంగీకరించారు.

Updated Date - Apr 23 , 2026 | 04:02 AM