Fisheries Growth: సవాళ్లలోనూ మత్స్య రంగ వృద్ధి!
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:01 AM
అనేక ఆటు పోట్లు, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. రాష్ట్రంలో 16.5 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న మత్స్య రంగం గణనీయమైన వృద్ధి సాధిస్తోంది.
2024-25లో జాతీయ సముద్ర ఆహార
ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 34 శాతం
గత నవంబరు నాటికి వృద్ధిరేటు 18.47శాతం
ఆక్వా రైతులకు అండగా కూటమి ప్రభుత్వం
ట్రంప్ సుంకాలతో ఆక్వా మార్కెట్‌లో అస్థిరత
అమెరికా మార్కెటింగ్‌కు ప్రత్యామ్నాయాల అన్వేషణ
సాగుదారులకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్
వేట నిషేధ సమయంలో రూ.20 వేల జీవనభృతి
(ఆంధ్రజ్యోతి-అమరావతి)
అనేక ఆటు పోట్లు, సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. రాష్ట్రంలో 16.5 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న మత్స్య రంగం గణనీయమైన వృద్ధి సాధిస్తోంది. ఇందులో ప్రభుత్వం అందిస్తున్న మద్దతు కీలకంగా ఉంది. దేశ చేపల ఉత్పత్తిలో 30 శాతం వాటాతో ఆంద్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్ర స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో 9 శాతం, వ్యవసాయ రంగంలో 25 శాతం సహకారం అందిస్తోంది. 2024-25లో రూ.21,246 కోట్ల విలువైన జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 34 శాతం నమోదైంది. దేశంలో రొయ్యల ఉత్పత్తి 75 శాతం రాష్ట్రం నుంచే అవుతోంది. రాష్ట్రంలో 5.85 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. 2024-25లో 55.39 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి కాగా, 2025-26లో 66.62 లక్షల టన్నుల లక్ష్యంలో ఇప్పటికే 46 లక్షల టన్నుల ఉత్పత్తి అయ్యాయి. ఉత్పత్తి లక్ష్యం జీవీఏ రూ.1,53,955 కోట్లు కాగా, గత నవంబరు నాటికి మత్స్య రంగం వృద్ధిరేటు 18.47 శాతంగా నమోదైందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ఆక్వా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి ఆధారంగా రైతులకు మార్కెటింగ్ కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం క్లస్టర్ విధానాన్ని తెచ్చింది. ఆక్వా చెరువులను మత్స్య శాఖ జియో ట్యాగ్ చేస్తోంది. 2025-26లో అదనంగా లక్ష ఎకరాల్లో ఆక్వా సాగు విస్తరించాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆక్వా సాగులో ఉత్పాదకతను పెంచి, నిర్వహణను మెరుగుపర్చి, ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ఐవోటీ పరికరాలు, నాణ్యమైన దాణా వాడుతున్నారు. రసాయనాల వాడకానికి డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. బయోఫ్లోక్ టెక్నాలజీ, ఆర్‌ఏఎస్, చెరువుల లైనింగ్, ఆధునిక నర్సరీల వంటివి ప్రోత్సహిస్తున్నారు.
సాగుదారులకు పలు సవాళ్లు
తూర్పు తీరంలోని భారత ప్రాదేశిక జలాల్లో సముద్ర చేపల నిల్వలు తగ్గుముఖం పట్టాయని మత్స్యశాఖ గుర్తించింది. ఇది మత్స్యకారుల ఆదాయంపై ప్రభావం చూపిస్తోంది. మరోవైపు రొయ్యలు, చేపల చెరువుల నిర్వహణ వ్యయం పెరిగిపోతోంది. మరోవైపు వైర్‌సలతో చేపలు, రొయ్యల రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. చాలీచాలని కోల్డ్ చైన్, ల్యాండింగ్ సెంటర్లు, ప్రాసెసింగ్, స్టోరేజీ సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేక ఆక్వా రంగం కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల బాదుడుతో ఆక్వా మార్కెట్‌లో అస్థిరత ఏర్పడింది. దీంతో సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని, ఆక్వా ధరలు తగ్గకుండా.. అమెరికా మార్కెటింగ్‌కు ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. ఆక్వా అథారిటీ ఆధ్వర్యంలో కమిటీ వేసి, సాగుదారుల్ని ఆదుకునేందుకు కృషి చేస్తున్నారు.
ఆక్వా రైతులకు ప్రభుత్వం భరోసా
ఆక్వా జోన్లలో అర్హత కలిగిన సాగుదారులకు ప్రభుత్వం యూనిట్ విద్యుత్ రూపాయిన్నరకే ఇస్తోంది. 2024-25లో 50 వేలపైగా విద్యుత్ కనెక్షన్లకు రూ.903 కోట్ల వ్యయంతో 3,417 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను సరఫరా చేశారు. హామీ మేరకు 2025-26లో జోన్, నాన్ జోన్లలోని 68 వేల కనెక్షన్లకు రాయితీ ధరపై 5 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరాకు రూ.1,100 కోట్లు ప్రభుత్వం భరిస్తోంది. 75 పీతల పెంపకం యూనిట్లు, 175 అలంకార చేపల పెంపకం యూనిట్లు, 200 సముద్రపు నాచు పెంపకం యూనిట్లను ఏర్పాటు చేశారు. బాపట్ల జిల్లా పరసావారిపాలెంలో పీఎంఎంఎ్‌సవై పథకం కింద రూ.88.08 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ అభివృద్ధి చేస్తున్నారు. సాగరమాల పథకంలో రాయదరువు గ్రామం వద్ద పూడిపోయిన సముద్ర ముఖ ద్వారాన్ని తెరిచి, 20 వేల మత్స్యకార కుటుంబాలకు మేలు చేస్తున్నారు.
గత ప్రభుత్వ జీవో 217 రద్దు
మంచినీటి జలాశయాల్లో చేపల పెంపకం ద్వారా మత్స్యకార సంఘాలు ఆదాయం పొందటానికి విఘాతం కలిగించేలా గత ప్రభుత్వం తెచ్చిన జీవో 217ను కూటమి ప్రభుత్వం ఇప్పటికే రద్దు చేసింది. 29 జలాశయాల్లో 997.49 లక్షల చేప పిల్లల్ని నిల్వ చేస్తున్నారు. 2025-26లో 3,458 జలవనరుల్లో 4 కోట్ల చేప పిల్లల్ని వదిలి.. 1,442 మత్స్యకార సహకార సంఘాల్లోని 2.17 లక్షల మంది సభ్యులతో పాటు 19,510 మంది లైసెన్స్‌డ్ మత్స్యకారులకు లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే పీఎంఎంఎ్‌సవై కింద 102 మత్స్యకార సహకార సంఘాలను మత్స్యరైతు ఉత్పత్తి సంస్థలుగా మార్చింది.
మత్స్యకారులకు ఆర్థిక సాయం
‘మత్స్యకార సేవలో’ కింద వేట నిషేధ సమయంలో ఒక్కో మత్స్యకార కుటుంబానికి ప్రభుత్వం రూ.20 వేలు జీవనభృతిగా ఇస్తోంది. 2025లో 1,21,433 కుటుంబాలకు రూ.242.86 కోట్ల సాయం చేసింది. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. గడచిన ఏడాదిలో 256 క్లైములను పరిష్కరించారు. చేపల వేట కోసం లీటర్‌కు రూ.9 రాయితీపై 21,574 పడవలకు డీజిల్ సరఫరా చేస్తోంది. సముద్ర చేపల ఉత్పత్తిని పెంచేందుకు 60ః40 కేంద్ర, రాష్ట్ర వాటాగా రూ.7.70 కోట్లతో 22 ఆర్టిఫిషియల్ రీఫ్ (కృత్రిమ దిబ్బ)లను ఏర్పాటు చేశారు. రెండో దశలో 162 ఏర్పాటు చేయనున్నారు. చేపల ఉత్పత్తిని పెంచడానికి తీర ప్రాంతంలో 9.50 లక్షల సముద్ర చేపల సీడ్స్‌ను విడుదల చేయాలని నిర్ణయించగా, కాకినాడ తీరంలో 50 వేల సముద్ర చేపల సీడ్స్‌ను వదిలారు. తీర ప్రాంతంలోని మత్స్యకార గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, జీవనోపాధి కార్యకలాపాలకు రూ.2 కోట్ల చొప్పున 15 గ్రామాలకు రూ.30 కోట్లు కేటాయించారు. పీఎంఎంఎ్‌సవై కింద 2025లో రాయితీపై 772 యూనిట్ల పడవలు, వలలు, ఇంజన్లు మత్స్యకారులకు సరఫరా చేశారు.