చేపల చెరువులు తవ్వేస్తున్నారు..
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:00 AM
అక్రమార్కులు బరితెగించారు. కోన గ్రామంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములను చెరపట్టారు. వారం రోజులుగా చేపల చెరువుల తవ్వకాలు సాగిస్తున్నారు. డొంకదారిని సైతం ఆక్రమించేశారు. గ్రామస్థులు అడ్డు చెప్పినా లెక్కచేయకుండా ముందుకు సాగిపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
- కోన గ్రామంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల ఆక్రమణ
- వారం రోజులుగా జరుగుతున్న తవ్వకాలు
- డొంకదారిపై చెరువు గట్టు పోయడంతో వివాదం
- అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్థుల వేడుకోలు
అక్రమార్కులు బరితెగించారు. కోన గ్రామంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములను చెరపట్టారు. వారం రోజులుగా చేపల చెరువుల తవ్వకాలు సాగిస్తున్నారు. డొంకదారిని సైతం ఆక్రమించేశారు. గ్రామస్థులు అడ్డు చెప్పినా లెక్కచేయకుండా ముందుకు సాగిపోతున్నారు. అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
వేసవిలో సముద్రతీర ప్రాంతంలో చేపల చెరువుల తవ్వకాలు ఊపందుకున్నాయి. మచిలీపట్నం దక్షిణ మండలంలోని కోన గ్రామం సమీపంలో అసైన్డ్, ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించేసి, ఎలాంటి అనుమతులు లేకుండా చెరువుల తవ్వకాలు చేపట్టారు. అంతటితో ఆగకుండా డొంకదారిని ఆక్రమించేసి దానిపై చెరువు గట్టు వేయడంతో గ్రామస్థులు అడ్డు చెప్పారు. అయినా చెరువుల తవ్వకాలు ఆగడంలేదు.
25 ఎకరాలకుపైగా..
కోన గ్రామంలో పశువుల మేత, ఇతరత్రా అవసరాల కోసం 93 ఎకరాలకుపైగా భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఇటీవల కాలం వరకు ఈ భూమి ఖాళీగానే ఉంది. అయితే కాలక్రమంలో ఈ భూమిని కొందరు మూకుమ్మడిగా చేపల చెరువులకు లీజుకు ఇచ్చారు. మరికొందరు భూములను తక్కువ ధరకు విక్రయించేశారు. రెండేళ్ల క్రితం ఈ భూములకు సంబంధించి వివాదాలు వచ్చాయి. అయినా సరిచేసుకుని లీజుకు ఇచ్చారు. ఈ భూముల పక్కనే సుమారు 25 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ఈ భూమిని మచిలీపట్నానికి చెందిన వ్యక్తి కొంతకాలంపాటు సాగు చేసి ఇతరులకు విక్రయించేశాడు. గత వారం రోజులుగా అసైన్డ్ భూముల పక్కనే చేపల చెరువుల తవ్వకాల పనులు సరిహద్దులతో సంబంధం లేకుండా చేస్తున్నారు. అసైన్డ్ భూమితో పాటు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి, డొంక దారిని కూడా ఆక్రమించి కొత్తగా గట్టువేయడంతో గ్రామస్థులు అడ్డు చెప్పారు. అయినా పనులు జరుగుతూనే ఉన్నాయి. డొంక దారిని, ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న ఘటనపై రెవెన్యూ అధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.