High Court Judges Bungalows: కల.. ఫలించిన వేళ!
ABN , Publish Date - Jan 12 , 2026 | 06:35 AM
రాజధాని అమరావతి నగరంలో హైకోర్టు జడ్జీల నివాసాలకు సంబంధించి ప్రథమ మోడల్ బంగళా నిర్మాణం పూర్తయింది.
రాజధానిలో హైకోర్టు జడ్జీల తొలి మోడల్ బంగళా రెడీ
గుంటూరు, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి నగరంలో హైకోర్టు జడ్జీల నివాసాలకు సంబంధించి ప్రథమ మోడల్ బంగళా నిర్మాణం పూర్తయింది. నేలపాడుకు సమీపంలో నిర్మించిన ఈ బంగళాలో సువిశాలమైన కారు పార్కింగ్ స్థలంతోపాటు.. సాయంత్రం వేళ రంగురంగుల విద్యుత్ దీపాలు, పచ్చటి లాన్ సోయగాలతో ఆకర్షిస్తోంది. సాధ్యమైనంత త్వరగా మిగతా బంగళాల నిర్మాణాలను కూడా పూర్తి చేసి అప్పగించేందుకు సీఆర్‌డీఏ పనులు వేగవంతం చేస్తోంది. ఇటీవలే సుప్రీం, హైకోర్టు జడ్జీలు కూడా వీటిని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజధానిలోని నేలపాడులో హైకోర్టు తాత్కాలిక భవనంలో కొనసాగుతోంది. దీనికి సమీపంలోనే శాశ్వత హైకోర్టు భవనాల సముదాయం వేగవంతంగా నిర్మాణం జరుగుతోంది. వీటికి దగ్గరగానే హైకోర్టు జడ్జీల బంగళాలు 36 రూపుదిద్దుకొంటున్నాయి. ఒక్కో బంగళా ఆరు వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. అలానే ఒక క్లబ్‌హస్‌ను 15 వేల ఎస్‌ఎఫ్‌టీతో నిర్మిస్తోన్నారు. బిల్టప్ ఏరియా 2.16 లక్షల ఎస్‌ఎఫ్‌టీ, పోడియం ల్యాండ్‌స్కేప్ 1.5 ఎకరాలు, ల్యాండ్ ఏరియా 24.13 ఎకరాలుగా ఉంది. ఇందుకోసం ప్రభుత్వం దాదాపుగా రూ.492 కోట్లను కేటాయించింది.