మన ఇంటికి మన బంగారం!
ABN , Publish Date - Jun 27 , 2026 | 03:57 AM
‘బంగారం.. మేడిన్ ఏపీ’.. ఇలా వినడానికి చాలా బాగుంది కదూ! ‘జొన్నగిరి గోల్డ్’తో ఇది సాకారమవుతోంది. రాయలసీమలోని ఈ పసిడి గని ద్వారా ఇక మన ఇంటికి ‘మన బంగారం’ రానుంది!
మార్కెట్‌లోకి వచ్చేసిన ‘జొన్నగిరి’ గోల్డ్
100, 500 గ్రా. బిస్కెట్లుగా అందుబాటు
ఉత్పత్తి చేసిన గోల్డ్ బార్లపై ఏపీ మ్యాప్
‘మేడిన్ ఆంధ్ర’గా ఖ్యాతి
కర్నూలు నగరంలో అమ్మకాలు ప్రారంభం
కర్నూలు, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ‘బంగారం.. మేడిన్ ఏపీ’.. ఇలా వినడానికి చాలా బాగుంది కదూ! ‘జొన్నగిరి గోల్డ్’తో ఇది సాకారమవుతోంది. రాయలసీమలోని ఈ పసిడి గని ద్వారా ఇక మన ఇంటికి ‘మన బంగారం’ రానుంది! మూడ్రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు జిల్లాలో ప్రారంభించిన జియో మైసూరు-జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టులో ఉత్పత్తి చేసిన బంగారం మార్కెట్‌లోకి వచ్చేసింది. కర్నూలు మార్కెట్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ఉన్న వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. ఇప్పుడు మన మార్కెట్‌లో మన బంగారం మెరుస్తుండడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఎక్కడో ఉత్పత్తి అయిన బంగారాన్ని విక్రయించామని, ఇప్పుడు మన జిల్లాలో ఉత్పత్తి అయిన నాణ్యమైన బంగారం అమ్మకాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని వ్యాపారులు అంటున్నారు. తొలి ఉత్పత్తిగా వచ్చిన బంగారాన్ని సీఎం చంద్రబాబు చేతుల మీదుగా అందుకోవడమే కాకుండా వినియోగదారులకు అమ్మడం ఒక మధురానుభూతి అని కామిశెట్టి జగదీశ్ అనే ఓ వ్యాపారి ఆనందం వ్యక్తం చేశారు. ‘జొన్నగిరి’ బంగారం భవిష్యత్తులో ‘మేడిన్ ఆంధ్ర గోల్డ్’గా ఖ్యాతి చెందుతుందని వ్యాపారులు అంటున్నారు.
ఆ బిస్కెట్‌ను చూడగానే..
999 గోల్డ్ (24 క్యారెట్స్)ను 500, 100 గ్రాముల బిస్కెట్లుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఆ గోల్డ్ బార్‌పై ‘ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ హెరిటేజ్ న్యూ ఎరా, ఫస్ట్ గోల్డ్ ఫ్రమ్ జొన్నగిరి మైన్స్’పాటు ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను కూడా ముద్రించారు. ఆ గోల్డ్ బిస్కెట్‌ను చూడగానే ఇది మేడిన్ గోల్డ్ ఆంధ్ర బంగారంగా స్పష్టమవుతుంది. ఉత్పత్తి వేగం పెరిగి, ఈ బంగారం బిస్కెట్లు దేశవ్యాప్తంగా మార్కెట్‌లోకి వెళితే.. మేడిన్ ఆంధ్ర గోల్డ్‌గా, జొన్నగిరి గోల్డ్‌గా మరింత ప్రసిద్ధి చెందే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఏపీలో తొలిసారి ఉత్పత్తయిన బంగారాన్ని తొలిసారిగా కొనుగోలు చేయాలని పలువురు వినియోగదారులు ఆసక్తిగా ముందుకు వచ్చినా.. ప్రస్తుతం పరిమితంగానే మార్కెట్‌లోకి విడుదల చేయడం వల్ల నిరుత్సాహంతో వెనుదిరిగారు. త్వరలోనే వినియోగదారుల అవసరానికి అనుగుణంగా బంగారాన్ని మార్కెట్‌లోకి విడుదల చేస్తామని యాజమాన్యం అంటోంది. జియో మైసూరు-జొన్నగిరి గోల్డ్ మైన్స్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఈ నెల 24న ప్రారంభించారు. ఆ సందర్భంగా అక్కడ పరిశ్రమలో ఉత్పత్తి అయిన బంగారాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆ సంస్థ చైర్మన్ బి.ప్రభాకరన్, డైరెక్టర్ బి.కార్తికేయన్‌లతో కలిసి ఉత్పత్తి చేసిన బంగారాన్ని కర్నూ లు చెందిన బంగారం వ్యాపారులు కామిశెట్టి జగదీశ్, చక్రవర్తి, శ్రీహరిమూర్తి సహా ఎమరాల్డ్ జ్యువెలర్స్ యాజమాన్యానికి అందజేశారు. వారు ఆ బంగారాన్ని కొనుగోలు చేశారు.
అది మరువలేని అనుభూతి
జొన్నగిరి గోల్డ్ మైన్ తొలి బంగారం ఉత్పత్తిని కొనుగోలు చేయడం, వినియోగదారులకు అమ్మడం ఒక మరువలేని అనుభూతి. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఆ బంగారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్వాలిటీ చాలా బాగుంది. దిగుమతి చేసుకునే గోల్డ్ బార్ ఎలా ఉందో అదే నాణ్యతతో జొన్నగిరి గోల్డ్ ఉంది. నేను 500 గ్రాముల పరిమాణంలో రెండు బిస్కెట్లు కొనుగోలు చేశాను. ఒకదాన్ని ఇప్పటికే వినియోగదారులకు అమ్మేశాను. మరో బిస్కెట్‌ను నా దగ్గరే ఉంచుకున్నా. ఆ గోల్డ్ బార్‌పై ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉండడం ఆనందంగా ఉంది.
- కామిశెట్టి జగదీష్,
వాసవీ బిలియన్ కార్పొరేషన్, కర్నూలు