Share News

విశాఖ నుంచి తొలి ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:49 AM

పర్యాటకులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ షిప్‌ అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం పోర్టులో రూ.100 కోట్లతో...

విశాఖ నుంచి తొలి ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌

  • చెన్నై మీదుగా కౌలాలంపూర్‌, సింగపూర్‌

  • 14 రోజుల సముద్ర ప్రయాణం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): పర్యాటకులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ షిప్‌ అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం పోర్టులో రూ.100 కోట్లతో క్రూయిజ్‌ టెర్మినల్‌ నిర్మించిన తరువాత వస్తున్న తొలి ఇంటర్నేషనల్‌ క్రూయిజ్‌ ఇదే. ఇప్పటివరకూ చెన్నై-విశాఖ-పాండిచ్చేరి-చెన్నై మధ్య ఏటా మూడు నుంచి ఐదు సార్లు డొమెస్టిక్‌ క్రూయిజ్‌ నడుస్తోంది. ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ అందుబాటులో ఉన్నా ఆ స్థాయి క్రూయిజ్‌లు మాత్రం రాలేదు. దీనిపై ఏపీ ప్రభుత్వంతో కలసి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్ర(టీటీఏఏ) సంస్థ పనిచేయడంతో కార్డెలియో సంస్థ ముందుకువచ్చింది. జూలై 15న ఇక్కడి నుంచి క్రూయిజ్‌ నడుపుతామని ప్రకటించింది. ఇది విశాఖ నుంచి చెన్నై మీదుగా థాయ్‌ల్యాండ్‌, మలేసియా, సింగపూర్‌ వెళుతుంది. ఈ పర్యటన 14 రోజులు ఉంటుంది. విదేశీ ప్రయాణం కావడంతో దీనికి అవసరమైన ఇమ్మిగ్రేషన్‌ విశాఖలోనే పూర్తిచేస్తారని విజయమోహన్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అయితే ఇందులో వెళ్లాలనుకునే వారికి పాస్‌పోర్టు తప్పనిసరి. అది కూడా ఆరు నెలల ప్రయాణ గడువుతో ఉండాలి. ఈ క్రూయిజ్‌ రావడానికి సీఎం చంద్రబాబు పూర్తి సహకారం అందించినందుకు టీటీఏఏ తరఫున విజయమోహన్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Apr 22 , 2026 | 04:49 AM