మణిపాల్‌లో తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్స
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:20 AM
మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు.
సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సహకారం
కృష్ణలంక, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తొలి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సీఎం సహాయ నిధి సహకారంతో నిర్వహించిన ఈ అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స వివరాలను శనివారం మీడియాకు తెలిపారు. విజయనగరం జిల్లాకు చెందిన కె.సత్యవతి కొన్ని సంవత్సరాలుగా డైలేటెడ్ కార్డియోమయోపతి అనే తీవ్ర గుండె సమస్యతో బాధపడుతున్నారు. సరైన వైద్య చికిత్స తీసుకున్నప్పటికీ ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించి, తీవ్రమైన హార్ట్ ఫెయిల్యూర్ దశకు చేరుకుంది. ఈ పరిస్థితిలో ఆమెకు గుండె మార్పిడికి అవసరమైన సమగ్ర పరీక్షలను నిర్వహించారు. రైట్ హార్ట్ క్యాథెటరైజేషన్‌తో పాటు, గుండె మార్పిడికి ఆమె అర్హతను నిర్ధారించే పూర్తిస్థాయి ట్రాన్స్‌ప్లాంట్ వర్కప్ నిర్వహించారు. ఈ ఇవాల్యుయేషన్ తరువాత ఆమెను జీవన్‌దాన్ అవయవ మార్పిడి పథకం కింద ట్రాన్స్‌ప్లాంట్ జాబితాలో చేర్చారు. అసుపత్రిలోనే ఆమెకు సరిపోయే దాత గుండె అందుబాటులోకి వచ్చింది. మణిపాల్ ఫౌండేషన్, ముఖ్యమంత్రి సహాయనిధి సహకారంతో గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్లు దిలీప్ రత్తి, వరుణ్ పామిడి, శంకరరావు, అనిల్‌కుమార్, ఏవీఎ్‌సఎస్ శ్రీధర్, ఎన్.మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.