Share News

బాణసంచా ఘటనలో మరొకరు మృతి

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:36 AM

కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుళ్ల ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. తీవ్రగాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న...

బాణసంచా ఘటనలో మరొకరు మృతి

  • 24కు చేరిన మృతుల సంఖ్య.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం

సామర్లకోట/కలెక్టరేట్‌ (కాకినాడ),అమరావతి, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా పేలుళ్ల ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. తీవ్రగాయాలతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సామర్లకోట కుమ్మరివీధికి చెందిన వేమగిరి లోవరాజు(38) మంగళవారం మృతిచెందాడు. ప్రమాదంలో ఇప్పటివరకూ 24 మంది మృతిచెందగా, ఇందులో సామర్లకోటకు చెందినవారు నలుగురు ఉన్నారు. సామర్లకోట సీహెచ్‌సీలో తీవ్రగాయాలతో చేరిన పెద్దాపురం కొండయ్యపేటకు చెందిన చాపల శామ్యూల్‌ ఆరోగ్య పరిస్థితి కుదుట పడడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. వేర్వేరు ఆస్పత్రుల్లో ఇంకా మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. కాగా, పేలుళ్ల ఘటనపై ప్రభుత్వం మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ నేతృత్వలోని కమిటీకి అప్పగించింది. ఈ ఘటనకు గల కారణాలు, బాధ్యులను గుర్తించి.. నెల వ్యవధిలోనే నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో సురేశ్‌కుమార్‌ చైర్‌పర్సన్‌గా, ఈగల్‌ ఐజీ ఆకే రవికృష్ణ మెంబర్‌గా ఉన్నారు. ఈ కమిటీకి పూర్తి సహాయ, సహకారాలు అందించాలని కాకినాడ కలెక్టర్‌, ఎస్పీలను ఆదేశించింది. సమన్వయం కోసం ప్రత్యేక నోడల్‌ అధికారిని నియమించాలని కలెక్టరుకు సూచించింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఉన్న రాయవరం ఘటనపై ప్రత్యేక కమిటీ ఇచ్చిన నివేదికలో మార్పులు, అదనపు జాగ్రత్తలేం తీసుకోవాలో నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

Updated Date - Mar 04 , 2026 | 04:37 AM