Konaseema Fire Incident: నాలుగో రోజూ ఆరని మంటలు..!
ABN , Publish Date - Jan 09 , 2026 | 06:12 AM
కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఔట్ మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది నాలుగు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
బ్లోఔట్ నియంత్రణకు శ్రమిస్తున్న ఓఎన్జీసీ సిబ్బంది
అమలాపురం, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఔట్ మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ సిబ్బంది నాలుగు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ఓఎన్జీసీకి చెందిన మోరీ-5 బావిలో డీప్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ సంస్థ డ్రిల్లింగ్ నిర్వహిస్తున్న సమయంలో బ్లోఔట్ సంభవించిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఎగసిపడుతున్న మంటలను అదుపు చేసే పనులకు ఓఎన్జీసీ సిబ్బంది గురువారం శ్రీకారం చుట్టారు. బ్లో ఔట్ సైట్ వద్ద కుప్పకూలిపోయిన డీప్ ఇండస్ర్టీస్ రిగ్గు శకలాలను భారీ క్రేన్ల సాయంతో తొలగిస్తున్నారు. ఎగిసిపడుతున్న గ్యాస్ మంటలను అదుపు చేసేందుకు నిరంతరం వాటర్ అంబ్రెల్లాలతో నీటిని వెదజల్లుతున్నారు. దీంతో మంటల ఎత్తు క్రమంగా తగ్గుతోంది. ఓఎన్జీసీకి చెందిన శ్రీహరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సక్సేనా ఆధ్వర్యంలో నిపుణులు వెల్ మౌత్ వద్ద పరిస్థితిని సమీక్షించారు. బావికి మూత వేసేందుకు అవసరమైన సాంకేతిక సామగ్రిని రిగ్గు సైటు వద్దకు తరలిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే మంటలను పూర్తిస్థాయిలో అదుపులోకి తెస్తారని అఽధికారులు భావిస్తున్నారు.