Share News

నెల్లూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:29 AM

నెల్లూరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)లోని చిన్నపిల్లల ఇంటెన్సివ్‌ వార్డులో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

నెల్లూరు జీజీహెచ్‌లో అగ్నిప్రమాదం

  • చిన్నపిల్లల వార్డులో షార్టుసర్క్యూట్‌

  • భయంతో పరుగులు.. తప్పిన ప్రాణాపాయం

నెల్లూరు (వైద్యం) మార్చి 1 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి (జీజీహెచ్‌)లోని చిన్నపిల్లల ఇంటెన్సివ్‌ వార్డులో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పొగలు దట్టంగా వ్యాపించాయి. దీంతో రోగులు, రోగుల సహాయకులతో పాటు కొందరు వైద్య సిబ్బంది కూడా బయటికి పరుగులు తీశారు. అగ్నిమాపక వాహనాలు వచ్చేటప్పటికే వైద్య సిబ్బంది మంటలాపివేయటంతో అంతా పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ సంఘటనపై పురపాలక శాఖమంత్రి పొంగూరు నారాయణ ఆరా తీశారు. పరిస్థితిని చక్కదిద్దాలని ఆదేశించారు.

అసలేం జరిగిందంటే...

ఆదివారం సాయంత్రం 6 గంటలకు చిన్నపిల్లల ఇన్‌టెన్సివ్‌ వార్డులోని ఏసీలో షార్ట్‌సర్క్యూట్‌ జరిగింది. ఆ సమయంలో 15 మంది పిల్లలతోపాటు, తల్లులు, ఇతర సహాయకులు మొత్తం 35 మంది ఉన్నారు. ఏసీలో మంటలు రాగా, అవి రెండు పడకలకు వ్యాపించి కాలిపోయాయి. ఆ పడకలలో చిన్నారులెవరూ లేక పోవటంతో ప్రాణాపాయం తప్పింది. డ్యూటీలో ఉన్న వైద్యురాలు అద్దాలను పగులగొట్టి, గట్టిగా అరుస్తూ హెచ్చరికలు చేయడంతో వైద్య సిబ్బంది కరెంటు ఆపేశారు. అక్కడే ఉన్న ఫైర్‌ సేప్టీ పరికరాలతో మంటలను ఆర్పేశారు. ముందు జాగ్రత్తగా పక్క వార్డులోని మరో 30 మంది పిల్లలు, వారి సహాయకులను వేరే వార్డుకు తరలించారు. ప్రమాదం నుంచి బయట పడటంతో రోగులు, సహాయకులు ఊపిరిపీల్చుకున్నారు. కలెక్టర్‌ హిమాన్సు శుక్లా ఆదేశాలతో ఎస్పీ అజిత వేజెండ్ల ఆస్పత్రికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి కూడా ఆస్పత్రిని సందర్శించారు. వెంటనే మంటలను ఆపివేసిన వైద్య సిబ్బందిని అభినందించారు.

Updated Date - Mar 02 , 2026 | 04:30 AM