కాలాయా? కాల్చారా?
ABN , Publish Date - Mar 25 , 2026 | 04:13 AM
ఒకవైపు జోరుగా రాజధాని పనులు సాగుతుండగా... మరోవైపు వరుస ‘అగ్ని ప్రమాదాలు’ చోటు చేసుకుంటున్నా యి! ఈ నెల 11న ఎల్‌అండ్‌టీ ఉద్దండ్రాయునిపాలెం సైట్‌లో పైపులు కాలిపోయాయి. అప్పుడు రూ.9 కోట్ల మేర నష్టం జరిగినట్టు సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.
అమరావతిలో అగ్నిప్రమాదంపై సందేహాలు
130-150డిగ్రీల ఉష్ణోగ్రతలో మాత్రమే మండే పైపులు
ఉద్దేశపూర్వకంగా కాల్చితే తప్ప అది జరగదు
రూ.10 కోట్ల మేర నష్టం జరిగిందన్న ‘మేఘా’
తుళ్లూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): ఒకవైపు జోరుగా రాజధాని పనులు సాగుతుండగా... మరోవైపు వరుస ‘అగ్ని ప్రమాదాలు’ చోటు చేసుకుంటున్నా యి! ఈ నెల 11న ఎల్‌అండ్‌టీ ఉద్దండ్రాయునిపాలెం సైట్‌లో పైపులు కాలిపోయాయి. అప్పుడు రూ.9 కోట్ల మేర నష్టం జరిగినట్టు సంస్థ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తాజాగా సోమవారం అర్ధరాత్రి రాయపూడి-తుళ్లూరు మధ్య ఉన్న ‘మేఘా’ స్టాక్ పాయింట్‌లోని పైపులకు నిప్పంటుకుంది. ఎల్పీఎస్ జోన్-6 అభివృద్ధికి తీసుకొచ్చిన మెటీరియల్‌ను కాంట్రాక్టర్ అక్కడ ఉంచారు. ఇవి దృఢమైన పీఎల్‌బీ(పర్మినెంట్‌లీ లూబ్రికేటెడ్) హెచ్‌డీపీఈ పైపులు! అండర్ గ్రౌండ్ కేబుళ్లను అమర్చేందుకు వాడతారు. 130 నుంచి 150 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే తప్ప ఆ పైపులకు మంటలు అంటుకునే అవకాశం లేదని నిపుణు లు చెబుతున్నారు. ఉద్దేశపూర్వకంగా తగలబెడితే తప్ప ఇంత వేడి రాజుకోద ని.. దీని వెనుక కుట్ర కోణం ఉందని అనుమానిస్తున్నారు. మొత్తంగా.. అమరావతిలో వరుస గా జరుగుతున్న అగ్నిప్రమాదాలపై పోలీసులు లోతైనా దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు అధికారిగా అడిషనల్ ఎస్పీ ఏటీ రవికుమార్‌ను నియమించారు. ఆయన మేఘా స్టాక్ పాయింట్‌ను మంగళవారం ఇతర పోలీసు అధికారులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌తో పరిశీలించారు. సుమారు రూ.10 కోట్ల మేర నష్టం జరిగినట్లు మేఘా ఇంజనీరింగ్ సంస్థ సీనియర్ మేనేజర్ సురేశ్ ఫిర్యాదులో తెలిపారు. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ సంఘటన స్థలానికి వచ్చి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. అన్ని సాంకేతిక, భౌతిక ఆధారాలను సేకరించాలని, సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించాలని పోలీసులకు సూచించారు. అదేవిధంగా అనుమానితుల కదలికలను గమనించి విచారణ చేయాలన్నారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నిపుణులు కూడా రంగంలోకి దిగారు. మరోవైపు... అగ్ని ప్రమాద స్థలాన్ని అమరావతి అభివృద్ధి సంస్థ(ఏడీసీ) చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీ పార్థసారథి పరిశీలించారు. స్టాక్ పాయింట్లలో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు.

24 గంటల్లో తేల్చండి!
విద్రోహ చర్యలనే అనుమానం
పోలీసులకు చంద్రబాబు ఆదేశం
గుంటూరు, మార్చి 24(ఆంధ్రజ్యోతి): రాజధాని ప్రాంతంలో జరుగుతున్న వరుస అగ్నిప్రమాదాలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనల వెనుక కుట్ర కోణం ఉం దా? అనే విషయాన్ని నిగ్గు తేల్చాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ అంశంపై మంగళవారం డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, గుంటూరు ఎస్పీ వకుల్‌జిందాల్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్‌కుమార్ లడ్హాలతో సీఎం సమీక్షించారు. ‘‘130-140 డిగ్రీల వేడితో నిప్పు అంటిస్తే తప్ప ఆ పైపులు తగలబడవని చెబుతున్నారు. ప్రమాదవశాత్తూ చెలరేగే నిప్పురవ్వతో అంటుకున్న మంట లు కావని స్పష్టమవుతోంది. విద్రో హ చర్య ఉందని నమ్మాల్సి వ స్తోంది. ఇప్పటికి రాజధానిలో 3 ప్రమాదాలు జరిగాయి. వాటన్నింటినీ కలిపి విచారణ జరిపితే వాస్తవాలు బయటికి వస్తాయి. 24 గంటల్లో ఈ ఘటనకు కారణాలు తెలుసుకుని రండి’’ అని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
సీసీ కెమెరాలు పెట్టండి.. పెట్రోలింగ్ పెంచండి
రాజధాని ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టాలని, పెట్రోలింగ్ పెంచాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలో జరుగుతున్న ఘటనల వల్ల అనవసర అడ్డంకులు ఏర్పడతాయని తెలిపారు. నిర్మాణ సంస్థలన్నీ తమ సామాగ్రి నిల్వ చేసుకునే యార్డుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నా రు. సొంత భద్రతా సిబ్బందితోపాటు, డ్రోన్ కెమెరాల ద్వారా భద్రతను పర్యవేక్షించాలని సూచించారు. అలజడి సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.