Share News

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదం

ABN , Publish Date - May 24 , 2026 | 05:08 AM

ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్తు కేంద్రంలో అగ్నిప్రమాదం

  • నిలిచిన ఉత్పత్తి.. ప్రాజెక్టుకు రూ. కోట్లల్లో నష్టం

  • సమగ్ర విచారణకు మంత్రి గొట్టిపాటి ఆదేశం

ముంచంగిపుట్టు(అల్లూరి)/అమరావతి, మే 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జల విద్యుత్‌ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉద యం 12 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో పలువురు ఉద్యోగులు, కార్మికులు గాయపడ్డారు. ఆస్తినష్టం భారీగా వాటిల్లినట్టు తెలుస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఒడిశాలోని ఒనకడిల్లీలో ఉన్న జలవిద్యుత్తు కేంద్రంలోని పవర్‌హౌస్‌ ఆవరణ లో ఉన్న వాక్యూమ్‌ సర్క్యూట్‌ బ్రేకర్‌(షార్ట్‌ సర్క్యూట్‌ లేదా ఓవర్‌ లోడ్‌ జరిగినప్పుడు విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడానికి ఉపయోగించే పరికరం) 11 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద షార్ట్‌ సర్క్యూట్‌ అయింది. అక్కడినుంచి క్షణాల వ్యవధిలోనే మంటలు రెండో అంతస్తుకు వ్యాపించాయి. దీంతో ప్యానల్స్‌, కేబుళ్లు దగ్ధమై విద్యుదుత్పాదన నిలిచిపోయింది. మంటల తీవ్రతకు కొంతమంది కార్మికులు గాయపడ్డారు. వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో లంతాపుట్టు ఆస్పత్రికి తరలించారు. పాడేరు నుంచి, ఒడిశాలోని లంతాపుట్టు, నందపూర్‌ నుంచి అగ్నిమాపక శకటాలు వచ్చి మంటలను అదు పు చేశాయి. ఈ ప్రాజెక్టులో ఆరు జనరేటర్లు ఉండగా 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ప్రమాద సమయంలో 110 మెగావాట్ల ఉత్పాదన జరుగుతోంది. ప్రమాదం కారణంగా జనరేటర్లు నిలిచిపోయాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో జనరేటర్లు ఉన్న ప్రాంతానికి మంటలు వ్యాపించకపోవడంతో పెనుముప్పు తప్పింది. ఈ అగ్ని ప్రమాదం వల్ల సుమారు రూ.3 కోట్ల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ప్రాజెక్టు అధికారులు నోరు విప్పడం లేదు. విద్యుత్తు ఉత్పత్తిని వీలైనంత వేగంగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని ఎస్‌ఈ సీహెచ్‌ అప్పాజీ తెలిపారు. కాగా, మాచ్‌ఖండ్‌ జల విద్యుత్తు కేంద్రంలో జరిగిన ప్రమాదంపై విద్యుత్తు శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమగ్ర విచారణకు ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

Updated Date - May 24 , 2026 | 05:09 AM