వైసీపీ జేబుల్లోకి పోయే సొమ్ము ఖజానాకు..
ABN , Publish Date - Mar 07 , 2026 | 03:34 AM
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతి ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని...
అందుకే గనులు, ఎక్సైజ్‌లో గణనీయ వృద్ధి: పయ్యావుల కేశవ్
2026-27 బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం
అమరావతి, మార్చి 6(ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రాంతీయ అసమానతలకు తావులేకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, అమరావతి ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో స్పష్టం చేశారు. శుక్రవారం సభలో 2026-27 బడ్జెట్‌ను ఆమోదించారు. ఈ సందర్భంగా ద్రవ్య వినిమయ బిల్లుపై మంత్రి మాట్లాడుతూ.. రాయలసీమలో రాజకీయ నిరుద్యోగులు ఒక్క దగ్గర చేరి సీమ గురించి ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘‘రాయలసీమ హార్టికల్చర్ హబ్ కోసం ప్రభుత్వం రూ.30,000 కోట్లు, ప్రైవేటు రంగం నుంచి మరో రూ.50,000 కోట్ల నుంచి రూ.70,000 కోట్ల వరకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులను వారసత్వంగా ఇచ్చింది. అందుకే ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. అయితే, చంద్రబాబు సమర్థ నాయకత్వంతో వాటన్నింటినీ అధిగమిస్తున్నాం. దేశంలోకి వస్తున్న ప్రతి రూ.100 పెట్టుబడిలో రూ.25 ఏపీకి వస్తోందని ఒక బ్యాంకు చేసిన సర్వేలో తేలింది. ప్రస్తుతం గనుల శాఖ నుంచి 33 శాతం అదనంగా ఆదాయం వస్తోంది. గతంలో వైసీపీ జేబుల్లోకి పోయే డబ్బును ఖజానాకు తరలించాం. ఎక్సైజ్ ఆదాయం కూడా 24శాతం పెరిగింది. గతంలో ప్రైవేటు ఖజానాకు పోతున్న ఆదాయాన్ని రాష్ట్ర ఖజానాకు తీసుకొస్తున్నాం’’ అని మంత్రి మండిపడ్డారు. ‘‘2023-24లో మూలధన వ్యయం రూ.24,000 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.53,915 కోట్లకు పెంచాం. మూలధన వ్యయం పెరగడం వల్ల మౌలిక వసతులు మెరుగుపడి వేగంగా అభివృద్ధి జరుగుతుంది. పాలన అంటే బటన్లు నొక్కడం కాదు. ప్రజలకు వారి కాళ్ల మీద వారు నిలబడే శక్తి అందించడం’’ అని మంత్రి కేశవ్ వివరించారు. కాగా, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, కూన రవికుమార్, జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, విష్ణుకుమార్‌రాజు, కాల్వ శ్రీనివాసులు ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొని మాట్లాడారు.