జగన్ డీఎన్‌ఏలోనే అబద్ధాలు
ABN , Publish Date - Mar 13 , 2026 | 03:14 AM
మాజీ సీఎం జగన్ చెప్పినవి కాగ్ లెక్కలు కావని, ఆయన బెంగళూరు టీం ఇచ్చిన లెక్కలని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.
అవి కాగ్ లెక్కలు కావు.. జగన్ టీం లెక్కలు!
ఆయన చెప్పేవన్నీ అసత్యాలు, అర్ధ సత్యాలు
గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం: పయ్యావుల ధ్వజం
అమరావతి, మార్చి 12(ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ చెప్పినవి కాగ్ లెక్కలు కావని, ఆయన బెంగళూరు టీం ఇచ్చిన లెక్కలని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కాగ్ నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. అలస్యంగా అయినా అబద్ధాలు ఎక్కువ, నిజం తక్కువ అంశాలతో ఆయన ప్రెస్‌మీట్ పెట్టారని అన్నారు. ‘‘తాను చేసిన ఆర్థిక విధ్వంసాన్ని కూటమి ప్రభుత్వంపైకి నెట్టే ప్రయత్నం చేశారు. బాధితుల్ని నిందితులుగా చేయడం జగన్ మార్క్ రాజకీయం. బాబాయ్ హత్యలో కూడా ఇలాగే సొంత చెల్లిని నిందితురాలిగా చేయాలని చూశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని కాగ్ స్పష్టం చేసింది. ఆ నివేదికను జగన్ చదవాలి. ఇంత దరిద్రమైన రిపోర్టు దేశ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. జగన్ డీఎన్‌ఏలోనే అబద్ధాలు ఉన్నాయి. 2 గంటలు ప్రెస్‌మీట్ పెట్టి అన్నీ అబద్ధాలే చెప్పారు. రూ.9.74 లక్షల కోట్ల బకాయిలను వైసీపీ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చింది. జగన్ మీడియాలో వండి వార్చిన అవాస్తవాలను కాగ్ లెక్కలుగా చూపిస్తూ మండలిలో బొత్సతో అసత్యాలు చెప్పించే యత్నం చేసి బొక్కబోర్లా పడ్డారు. బెంగళూరు బృందం ఇచ్చే అసత్యాలు, అర్ధ సత్యాలతో బుకాయించే ప్రయత్నం చేస్తున్నారు. 2024-25లో నెట్ బారోయింగ్‌ను కూటమి ప్రభుత్వం ఎక్కడా అధిగమించలేదు. ఇప్పటి వరకు మేం రూ.1,05,800కోట్లు మాత్రమే అప్పు చేస్తే రెండేళ్లలో రూ.3.5 లక్షల కోట్ల అప్పు చేశామని జగన్ చేసిన ఆరోపణలు అవాస్తవం. పరిశ్రమలకు భూ కేటాయింపులపై కోర్టుకెక్కి చీవాట్లు తిన్నారు. ఏపీ ప్రభుత్వానికి అప్పులు ఇవ్వొద్దని 150కి పైగా కార్పొరేషన్లకు లేఖలు రాశారు. ఆస్త్రేలియాలో ఉన్న వ్యక్తితో ఫిర్యాదు చేయించినా స్పందన లేకపోతే సుబ్బారెడ్డితో ప్రధానికి ఫిర్యాదు చేయించారు.
డీవోపీటీకి ఫిర్యాదులు చేస్తామని అధికారులనూ బెదిరిస్తున్నారు. గత ప్రభుత్వంలో జగన్ అవినీతి, దోపిడీ కారణంగా రాష్ట్రాదాయానికి గండిపడింది. రీపేమెంట్ చేసే సాస్కీ స్కీంను జగన్ ఎందుకు వినియోగించుకోలేదు? వైసీపీ హయాంలో 12 శాతం వడ్డీకి ఎందుకు అప్పులు తెచ్చారు? పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రుల కమిటీ కూడా చర్చిస్తుంది. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. గ్యాస్ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని పయ్యావుల పేర్కొన్నారు.