Share News

వ్యవస్థలన్నిటిపై గొడ్డలి వేటు!

ABN , Publish Date - May 24 , 2026 | 03:47 AM

ఓ తరానికి ఉపాధి కల్పించేలా చంద్రబాబు అవకాశాలు సృష్టిస్తే.. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఓ తరం మొత్తం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు.

వ్యవస్థలన్నిటిపై గొడ్డలి వేటు!

  • జగన్‌ ఏలుబడిలో ఓ తరమంతా అభివృద్ధిలో వెనుకంజ

  • మంత్రి పయ్యావుల, బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌ ధ్వజం

  • రాజారెడ్డి అకృత్యాలపై సమగ్ర పుస్తకం తెస్తాం

  • లేకుంటే తమది సమరయోధుల

  • కుటుంబమని జగన్‌ నమ్మించగలరు: కేశవ్‌

అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): ఓ తరానికి ఉపాధి కల్పించేలా చంద్రబాబు అవకాశాలు సృష్టిస్తే.. జగన్‌ ఐదేళ్ల పాలనలో ఓ తరం మొత్తం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ఆయన ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలపై గొడ్డలి వేటు వేశారని.. కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే సుమారు 800 కంపెనీలను గ్రౌండ్‌ చేయబోతోందని చెప్పారు. శనివారం విజయవాడలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఉన్న పరిశ్రమలను తరిమేసి పారిశ్రామిక రంగంపై గొడ్డలి వేటువేశావ్‌.. పోలవరం డయాఫ్రం వాల్‌పై గొడ్డలి వేటు వేశావ్‌.. ఎన్నికల వ్యవస్థపై గొడ్డలి వేటు వేశావ్‌.. శాంతిభద్రతలను నిర్వీర్యం చేసి వాటిపైనా గొడ్డలి వేటు వేశావ్‌.. అలాంటి గొడ్డలి గురించి మాట్లాడితే మీకు ఉలుకెందుకు జగన్‌.. ముమ్మాటికీ మీది గొడ్డలి పార్టీనే’ అని కేశవ్‌ స్పష్టంచేశారు. జగన్‌ బెంగళూరు నుంచి వచ్చినప్పుడల్లా ఓ వింత వాదన తెరపైకి తెస్తున్నాడని అన్నారు. ‘రాష్ట్రాన్ని అద్భుతంగా పాలించిన తనను సన్మానించాలంటాడు.. నిన్నటికి నిన్న తనంత మంచోడు లేడని సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఇచ్చుకున్నాడు. తనతాత రాజారెడ్డి నుంచి బాబాయి వివేకా వరకు చనిపోయినప్పుడు చంద్రబాబే అధికారంలో ఉన్నాడని చెప్పే ప్రయత్నం చేశాడు. వివేకా హత్య కేసులో ఏం జరిగిందో కడప జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో నిక్కరు వేసుకున్న ఏ కుర్రాడిని అడిగినా చెబుతాడు’ అని చెప్పారు.


1989లో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక సీమలో ఫ్యాక్షనిజానికి అండగా నిలిచిందని, నాటి ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం పార్నపల్లిలో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చిందనే కారణంతో ఆ గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, జొన్నలగడ్డ సోదరులు సత్యనారాయణ, సూర్యనారాయణ ఇళ్లను డైనమెట్లతో పేల్చేసిన ఘనత రాజారెడ్డిదని చెప్పారు. మహిళలపై ఆయన అకృత్యాలను అక్కడి ప్రజలు మరచిపోలేదన్నారు. పెద్దకుడాలలో కృష్ణారెడ్డి అనే టీడీపీ నాయకుడు సెకండ్‌షో సినిమాకు వెళ్లి వస్తుంటే నడిరోడ్డుపై హత్య చేయించారన్నారు. హత్య జరిగే సమయంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఎలిబీ కోసం హైదరాబాద్‌లో ఓ పోలీసు అధికారితో కావాలనే గొడవపెట్టుకున్నారని, ఇలాంటి క్రిమినల్‌ రాజకీయాలకు తెరలేపింది వైఎస్‌ కుటుంబమేనన్నారు. లింగాల మండలంలోనే పాపాయపల్లి రఘురామిరెడ్డి అనే టీడీపీ నాయకుడిని దారుణంగా వేధించి హత్య చేశారని తెలిపారు. ఇలాంటివి పదుల సంఖ్యలో పులివెందులలో జరిగాయని. ఇవన్నీ ఇప్పటి తరాలకు తెలియాలన్నారు. లేకుంటే జగన్‌ మాది స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబమని నమ్మిస్తాడన్నారు. రాజారెడ్డి నుంచి మొదలకుని పులివెందులలో జరిగిన అరాచకాలపై పుస్తకం వేస్తామని తెలిపారు.


ఫ్యాక్షన్‌పై ఉక్కుపాదం మోపింది చంద్రబాబే..

చంద్రబాబు సీఎం అయ్యాక సీమలో ఫ్యాక్షన్‌ను కంట్రోల్లోకి తెచ్చారని కేశవ్‌ గుర్తుచేశారు. వైఎస్‌ కుటుంబం మొదలు పెట్టిన ఫ్యాక్షన్‌ రాజకీయాలను కంట్రోల్‌ చేయడానికి ఆయనకు 30 ఏళ్లు పట్టిందన్నారు. ఎన్నో ఘోరాలు చేసిన జగన్‌ బాధితుడు కాదని.. నిందితుడని అన్నారు. ‘ఆయనకు అధికారమే పరమావధి. తల్లి లేదు.. చెల్లి లేదు. గొడ్డలిపోటును గుండెపోటుగా చూపించగల గొప్ప వ్యక్తి జగన్‌. అన్ని వ్యవస్థలను ఒక్క గొడ్డలి పోటుతో నాశనం చేయగల సత్తా ఉన్న వ్యక్తి జగన్‌. అందుకే గొడ్డలి పార్టీ నెవ్వర్‌ ఎగైన్‌ అనేది ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి’ అన్నారు.


అరెస్టులతో భయోత్పాతం..

ఒక్క చాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ అధికారపీఠం ఎక్కగానే తన ఫ్యాక్షన్‌ నైజాన్ని బయటపెట్టుకున్నారని కేశవ్‌ అన్నారు. అచ్చెన్న అరెస్టు నుంచి చంద్రబాబు అరెస్టు వరకు భయం సృష్టించే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు. పొక్లెయిన్లతో జగన్‌ విధ్వంసం చేస్తే.. తాము అవే పొక్లయిన్లతో నిర్మాణాలు చేస్తున్నామని తెలిపారు. ‘నేరమయ రాజకీయాలను వైఎస్‌ కుటుంబం మొదలుపెట్టింది. దానిని జగన్‌ కొనసాగిస్తున్నారు. వైఎస్‌ మరణం వెనుక జగన్‌ పాత్ర ఉందని బొత్స అన్నారు. వైఎస్‌ను ముద్దాయిగా చేసింది జగనేనని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ స్వయంగా చెప్పారు. జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో రాజశేఖర్‌రెడ్డిని ముద్దాయిగా చేర్చిన పొన్నవోలుకు పదవి ఇచ్చి గౌరవించారు’ అని చెప్పారు. వైఎస్‌ మరణం వెనుక ముందుగా విచారించాల్సింది ఆయన్నేనని లగడపాటి రాజగోపాల్‌ చేసిన ప్రకటనపై ఏ సమాధానం చెబుతారని నిలదీశారు. వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన జేడీ శీలం జగన్‌ గురించి చెబుతూ.. వైఎస్‌ సమాధి వద్ద జగన్‌ రాష్ట్ర విభజనపై తనతో చర్చిస్తూ ఆర్టికల్‌ 3 ఉపయోగించి రాష్ట్రాన్ని మీరు విభజించవచ్చని సలహా ఇచ్చారని.. అది చెప్పే తన కేసుల్లో బెయిల్‌ తెచ్చుకున్నారని చెప్పారంటే జగన్‌ క్యారెక్టర్‌ ఏమిటో తెలుస్తుందని కేశవ్‌ వ్యాఖ్యానించారు.


జగన్‌ సెల్ఫ్‌ గోల్‌: సీఎం రమేశ్‌

రాజారెడ్డిపై కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే రౌడీషీట్‌ ఉందని ఎంపీ సీఎం రమేశ్‌ చెప్పారు. ఓ కులాన్ని అడ్డంపెట్టుకుని దొంగతనాలు చేయించి డబ్బు గడించిన చరిత్ర రాజారెడ్డిదన్నారు. మైన్‌ ఓనర్‌ను అంతమొందించి గనులు దక్కించుకుని ధనవంతుడయ్యారని, పులివెందులలో ఆయన చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావని చెప్పారు. రాజారెడ్డి అకృత్యాలకు సజీవ సాక్షులు పార్నపల్లిలో ఉన్నారని తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం ఎందరినో హత్య చేశారని, రాజారెడ్డిని హత్య చేసింది ఆయన వల్ల ఇబ్బంది పడిన బాధితులే తప్ప మరొకరు కాదన్నారు. రాజారెడ్డిపై రౌడీషీట్‌ సహా పలు కేసులు నమోదయ్యే సమయానికి చంద్రబాబు సీఎం కాదని, కానీ ఆయనపై జగన్‌ బురద చల్లుతున్నారని విమర్శించారు. ‘వైఎస్‌ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు. ఈ విషయంలో జగన్‌ సెల్ఫ్‌ గోల్‌ వేసుకున్నారు. వివేకా హత్య కేసులో ఆయన హస్తం ఉందో లేదో ఓపెన్‌ పోల్‌ పెట్టాలి. జగన్‌కు సంబంధం లేదని వస్తే నేను రాజకీయాలు వదిలేస్తా’ అని సవాల్‌ విసిరారు. సీబీఐ విచారణ చేసి భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిందని, ఎస్టీ కులాన్ని అడ్డుపెట్టుకుని రాజారెడ్డి దోపిడీలు చేసినట్లు పోలీసు రికార్డుల్లో ఉందన్నారు.

Updated Date - May 24 , 2026 | 03:48 AM