Foreign Experts: పోలవరం పనులకు ఫైనల్ టచ్!
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:32 AM
పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులకు ‘ఫైనల్ టచ్’ ఇచ్చేందుకు విదేశీ నిపుణులు ఈ నెల 19న రానున్నారు. డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి.సిస్కో (అమెరికా), రిచర్డ్ డొనెల్లీ, సీస్ హిన్స్‌బెర్జర్ (కెనడా) మూడ్రోజులు...
19న రానున్న విదేశీ నిపుణులు.. 3 రోజులు ప్రాజెక్టు వద్దే మకాం
21 దాకా పనుల పురోగతి పరిశీలన.. కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పణ
అమరావతి, జనవరి 14(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనులకు ‘ఫైనల్ టచ్’ ఇచ్చేందుకు విదేశీ నిపుణులు ఈ నెల 19న రానున్నారు. డేవిడ్ బి.పాల్, గియాస్ ఫ్రాంకో డి.సిస్కో (అమెరికా), రిచర్డ్ డొనెల్లీ, సీస్ హిన్స్‌బెర్జర్ (కెనడా) మూడ్రోజులు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి.. క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని, నాణ్యతను స్వయంగా పరిశీలిస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమక్షంలో వారు 21వ తేదీ దాకా.. మూడ్రోజులపాటు అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణ పనులను సమీక్షిస్తారు. తర్వాత ఢిల్లీ వెళ్లి.. భవిష్యత్‌లో చేపట్టాల్సిన పనులపై సూచనలతో కూడిన నివేదికను కేంద్ర జలసంఘానికి సమర్పిస్తారు. పోలవరం ప్రాజెక్టు పనులు దాదాపు 87,8 శాతం మేర పూర్తయ్యాయి. మరో 12.2 శాతమే మిగిలి ఉన్నాయి ఈ నిపుణుల బృందం ఇప్పటికే నాలుగు దఫాలు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. డెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా కొత్త వాల్‌ను నిర్మించాలని వీరు 2023లోనే సూచించినా.. నాటి జగన్ ప్రభుత్వం వినిపించుకోలేదు. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చాక.. నిపుణుల సూచనల మేరకు గత ఏడాది జనవరి 18వ తేదీన 1,350 మీటర్ల పొడవైన డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను జల వనరుల శాఖ చేపట్టింది ఇందులో 1071 మీటర్ల వరకు పనులు పూర్తయ్యాయి. మరో 279 మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇవి కూడా వచ్చే నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా 359 ప్యానెల్స్‌కు గాను 277 పూర్తయ్యాయి. మరో 82 ప్యానెల్స్ పనులు మిగిలి ఉన్నాయి. 53.32 మీటర్ల ఎత్తులో ఈసీఆర్‌ఎఫ్ డ్యాం పనులు ఇప్పటికే నడుస్తున్నాయి. వీటిని వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేస్తామని నిర్మాణ సంస్థ ధీమాగా చెబుతోంది. ఈ పనులన్నింటినీ విదేశీ నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించి జల సంఘానికి నివేదిక ఇవ్వనున్నారు.