Share News

Godavari Districts: ఊరూరా సంబరం

ABN , Publish Date - Jan 17 , 2026 | 03:33 AM

గోదావరి జిల్లాల్లో సందడే సందడి.. సంక్రాంతి మూడు రోజులూ ఉత్సాహం ఉరకలేసింది..! ఏ ఊరిలో చూసినా బంధాలు అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు. బతుకుదెరువు కోసమో.. వ్యాపారాల కోసమో..

Godavari Districts: ఊరూరా సంబరం

  • గోదావరి జిల్లాల్లో తెలంగాణ సందడి

  • ఇంటింటా అనుబంధాల సవ్వడి

  • భోగి మంటలు, భోగి పళ్లతో పండగ మొదలు

  • పోయినోళ్ల జ్ఞాపకాలతో ఘనంగా పెద్దల పండుగ

  • కనుమ రోజు పశువుల సందడి.. ప్రభల తీర్థాలు

  • ఏడాదికి సరిపడా జ్ఞాపకాలు పంచిన సంక్రాంతి

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

గోదావరి జిల్లాల్లో సందడే సందడి.. సంక్రాంతి మూడు రోజులూ ఉత్సాహం ఉరకలేసింది..! ఏ ఊరిలో చూసినా బంధాలు అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు. బతుకుదెరువు కోసమో.. వ్యాపారాల కోసమో.. పనుల నిమిత్తమో దూర ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిన కుటుంబాలు పిల్లా పాపలతో సహా సొంతూళ్లలో అడుగుపెట్టాయి. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్‌ నుంచి వేలాది మంది సొంతూళ్లకు చేరుకున్నారు. చానాళ్ల తర్వాత పుట్టిన ఊరిని చూసి పులకించిపోయాయి. కార్లు, ఇతర వాహనాల్లో సొంతూరికి వచ్చిన వారు.. ఊరిలో అడుగుపెట్టగానే ఊరు చాలా మారిపోయింది.. అంటూ ఆశ్చర్యపోయారు. ఇంటికి చేరాక.. ముత్యాల ముగ్గులతో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, బంధువులు, వారి ఇళ్లలో పెరిగిన కొత్తతరం పిల్లలతో సరదాగా, సంతోషంగా గడిపారు. ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి.... మూడు రోజులే అయినా.. మళ్లీ సంక్రాంతి వచ్చే వరకూ మధురానుభూతుల్ని మిగుల్చుతుంది. ఈ జ్ఞాపకలు చెరిగిపోవు. భోగి రోజున భోగి మంటలు వేయడం... పిల్లలకు భోగి పళ్లు పోయడం అదో ఆనందం.


ఎన్ని పండుగలొచ్చినా.. కొత్త బట్టలంటే సంక్రాంతే గుర్తొస్తుంది. రెండో రోజు పెద్దల పండుగ. తమను విడిచి అనంత లోకాలు వెళ్లిపోయిన పెద్దల జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అందరూ సంతోషంగా గడిపారు. పెద్దల పేరుతో బ్రాహ్మణులకు గానీ, తమ బంధువర్గంలోని పెద్దలకు గానీ కొత్తబట్టలు పెట్టడం ఇక్కడి సంప్రదాయం. రకరకాల పండివంటలు చేసుకుని, అందరూ కలసి తినడం.. అల్లర్లు, మర్యాదలు, వెటకారాలు, ఆటపట్టించడం అన్నీ ఓ మధుర జ్ఞాపకమే. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది తరలివచ్చి గోదావరి పల్లెల్లో సందడి చేశారు. కనుమ రోజున పశువులకు పూజలు చేయడం సంప్రదాయం. కోనసీమలో ప్రభల తీర్ధాలను ప్రజలు బాగా ఎంజాయ్‌ చేశారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలతో మూడు రోజుల పాటు దేవాలయాలు కిటకిటలాడాయి. రాజకీయ నేతలు, ప్రముఖు లు, సెలబ్రెటీలు కూడా ఈసారి కోడి పందేలపైనే దృష్టి సారించడం గమనార్హం. గోదావరి పాయలు, కాలువలు, చెరువులు, చేలగట్లు, రొయ్యలు, చేపల చెరువులు, తోటలు, చేలు, నర్సరీలు అన్నీ పర్యాటక స్పాట్లుగా మారిపోయాయి.


అమెరికా నుంచి రాలేక..

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వైఖరి, విధిస్తున్న ఆంక్షలు వల్ల అనేక కుటుంబాలు పండుగను సంతోషంగా జరపుకోలేకపోయాయి. గోదావరి జిల్లాల నుంచి చదువులు, ఉద్యోగాల కోసం అమెరికాకు వెళ్లినవారు అక్కడి ఆంక్షల వల్ల వీసాలు రాక ఇబ్బంది పడుతున్నారు. కొందరేమో భారత్‌కు వస్తే.. మళ్లీ అమెరికాకు తిరిగివచ్చే అవకాశం ఉంటుందో లేదోనని అక్కడే ఉండిపోయారు. ఇలా వేలాది మంది కుటుంబాలతో కలిసి సంక్రాంతి జరుపుకోలేకపోయారు. సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వచ్చిన లక్షలాది మంది మూడురోజుల పండగ పూర్తి కావడంతో కొందరు శనివారం నుంచే తిరుగు పయనానికి సిద్ధమవుతున్నారు.

పోలీసు కాన్వాయ్‌తో వచ్చి.. కోటి పట్టి..

ఉమ్మడి కృష్ణా జిల్లా కీసరలో ఓ వ్యక్తి 25 కోడి పందే లు గెలిచి బుల్లెట్‌ను బహుమతిగా అందుకున్నాడు. గన్నవరం నియోజకవర్గం కేసరపల్లిలో ఒక ప్రముఖుడు కోడి పందెంలో రూ.కోటి గెలుచుకున్నారు. పోలీసు కాన్వాయ్‌తో వచ్చిన ఆయన ఒకే ఒక పందెం కట్టి పది నిమిషాల్లోనే రూ.కోటి కొల్లగొట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి పోలీసు ఎస్కార్ట్‌తో వెళ్లిపోయారు. ఆయన ప్రభుత్వంలోని ముఖ్యనేతకు అత్యంత ఆప్తుడని చెబుతున్నారు. ఇక పెనమలూరు, గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గాల్లోనూ పందేలు జోరుగా సాగాయి. ఈసారి పందేల్లో ఎన్‌ఆర్‌ఐ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాగా, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కోడి పందేల జోరు కొనసాగింది. గమళ్లపాలెంలో ఎక్కువ పందేలు గెలిచిన వ్యక్తికి బుల్లెట్‌ బహుమతిగా అందజేశారు. పై పందేలు కూడా లక్షల్లో సాగాయి. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కోట్లల్లోనే డబ్బులు చేతులు మారినట్లు తెలిసింది.

Updated Date - Jan 17 , 2026 | 03:34 AM