AP Govt: ఉద్యోగులకు పండగొచ్చె..
ABN , Publish Date - Jan 15 , 2026 | 03:18 AM
సంక్రాంతి పండగ వేళ ఉద్యోగుల కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనందాన్ని నింపింది. ఉద్యోగులు, పోలీసులకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం వారి...
ఉద్యోగులు, పోలీసుల ఖాతాల్లో పెండింగ్ డీఏ, డీఆర్ ఎరియర్లు
ఒక్కొక్కరికి రూ.70 వేల నుంచి 80 వేల లబ్ధి
5.70 లక్షల మంది ఖాతాల్లో నిధులు జమ చేసిన ఆర్థిక శాఖ
అమరావతి, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగ వేళ ఉద్యోగుల కుటుంబాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆనందాన్ని నింపింది. ఉద్యోగులు, పోలీసులకు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ ఎరియర్లు, సరెండర్ లీవుల మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతున్నాయి. అదే విధంగా కాంట్రాక్టర్లకు పెండింగులో ఉన్న బిల్లుల మొత్తాన్ని కూడా జమ చేస్తున్నారు. భోగి పండగ రోజు ఈ మొత్తాలు జమ అవుతుండటంతో ఉద్యోగులు, పోలీసులు, కాంట్రాక్టర్లలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. డీఏ, డీఆర్ ఎరియర్స్ నిమిత్తం ఒక్కో ఉద్యోగి, పోలీసు ఖాతాలో రూ.70 నుంచి 80వేల వరకు జమ అవుతున్నాయి. పోలీసులకు అదనంగా సరెండర్ లీవులు, టీఏలు కూడా జమ అవుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగులకూ డీఏ, డీఆర్ బకాయిలు జమవుతున్నాయి. సుమారు 5.70 లక్షల మంది ఖాతాల్లో నిధులను ఆర్థికశాఖ జమ చేస్తోం ది. ఉద్యోగ, పోలీసు సంఘాలు ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
పోలీసు సంఘం హర్షం
పోలీసులకు రావాల్సిన సరెండర్ లీవులు, డీఏ ఎరియర్లను ప్రభుత్వం విడుదల చేసిందని ఏపీ పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. దీంతో ఈసారి సంక్రాంతి పండగను తామందరం చాలా సంతోషంగా జరుపుకొంటున్నామని చెప్పారు. గతంలో సీఎం చంద్రబాబును కలవగానే సరెండర్ లీవులు విడుదల చేస్తామని చెప్పారని, హామీ ఇచ్చిన విధంగానే నిధులను విడుదల చేశారన్నారు. ముఖ్యమంత్రికి పోలీసులు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. నిధులు విడుదల చేసేందుకు సహకరించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
థ్యాంక్స్ సీఎం సార్: ఉద్యోగులు
రాష్ట్రంలోని మూడు లక్షల మంది సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు రావాల్సిన 60 నెలల డీఏ బకాయిలను ఒకే దఫాలో చెల్లించినందుకు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులందరూ ఉత్సాహంగా సంక్రాంతి సంబరాలు జరుపుకొనే అవకాశం కల్పించారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఉన్నతాధికారులకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోరుకొండ సతీశ్, సీఎం దాస్ బుధవారం ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు.