క్షీణిస్తున్న సంతానోత్పత్తి!
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:52 AM
ఆధునిక జీవనశైలి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం... కారణాలు ఏమైతేనేం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్-టీఎఫ్ఆర్) గణనీయంగా క్షీణిస్తోంది..!
రాష్ట్రంలో 1.5కి పడిపోయిన సంతానోత్పత్తి రేటు
2035 నాటికి ఒకటికి పడిపోయే ప్రమాదం.. జనాభా వృద్ధి 0.3కు తగ్గే చాన్స్
యువత తగ్గి.. పెరిగిపోతున్న వృద్ధులు.. సంతానోత్పత్తి రేటును 2.1కి పెంచాలి
5 ప్రధాన అంశాలతో ప్రత్యేక ప్రణాళిక.. త్వరలోనే ప్రజల ముందు చర్చకు
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తగ్గిస్తాం: మంత్రి సత్యకుమార్
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆధునిక జీవనశైలి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడం, మానసిక ఒత్తిడి, వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం... కారణాలు ఏమైతేనేం రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (టోటల్ ఫెర్టిలిటీ రేట్-టీఎఫ్ఆర్) గణనీయంగా క్షీణిస్తోంది..! ఒకవైపు పిల్లల్ని కనే వారు తగ్గిపోతుంటే.. మరోవైపు కొందరు ఒక్కరితోనే సరిపెట్టుకుంటున్నారు. ఫలితంగా రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5కి పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2035 నాటికి ఇది మరింత దిగజారి ఒక శాతం కంటే తక్కువకు పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. జనాభా వృద్ధి రేటు కూడా 2035 నాటికి 0.3 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటును పెంచాలని, లేకుంటే భవిష్యత్‌లో యువత సంఖ్య తగ్గిపోతుందని. దీనివల్ల రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తీవ్ర విఘాతం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపించడం లేదు. దీనిపై ఆరోగ్య శాఖ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ సమస్యను సమష్టిగా ఎదుర్కోవడానికి ప్రజలు, మీడియా, ఇతర భాగస్వాములు ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి నడుం బిగించాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ పిలుపునిచ్చారు.
యువ జనాభా పెరిగేలా చర్యలు..
ప్రస్తుత తరుణంలో జనాభా స్థిరీకరణకు సంతానోత్పత్తి రేటు 2.1 ఉండాలి. కానీ దేశంలో, రాష్ట్రంలో పలు దశాబ్దాలుగా అనుసరిస్తున్న జనాభా నియంత్రణ విధానాలతో ఈ రేటు 1.5కి పడిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2035 నాటికి రాష్ట్రంలో జనాభా స్థిరీకరణే లక్ష్యంగా ఐదు అంశాలతో నూతన ప్రణాళికను రూపొందించింది. ఈ క్రమంలో జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికాలని నిర్ణయించింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనేలా కుటుంబాలు స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకునే పరిస్థితుల్ని కల్పించడమే లక్ష్యంగా నూతన విధానం రూపొందించింది. 2011లో రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు వాళ్లు మొత్తం జనాభాలో 25 శాతం ఉండగా.. సంతానోత్పత్తి క్షీణత కారణంగా ఇది 2036 నాటికి 15 శాతానికి తగ్గనుంది. అలాగే 60 ఏళ్లు దాటిన వారి జనాభా 10 శాతం నుంచి 2036 నాటికి 19 శాతానికి పెరుగనుంది. 2047 నాటికి 23 శాతానికి పెరిగి... స్వర్ణాంధ్ర సాధన లక్ష్యానికి తీవ్ర విఘాతం ఏర్పడే అవకాశం ఉంది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు రానున్న 10 సంవత్సరాలు అత్యంత కీలకమని, 2035 నాటికి 2.1 సంతానోత్పత్తి రేటును సాధించి జనాభా స్థిరీకరణకు బాటలు వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు తగ్గింపు: మంత్రి
అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో క్షీణిస్తున్న సంతానోత్పత్తి రేటుపై ఆరోగ్య మంత్రి సత్యకుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా స్థిరీకరణ దిశగా నూతన ప్రళాళికలు అమలు చేస్తామని ఆయన తెలిపారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటున్న మహిళలు ప్రస్తుతం 70 శాతం ఉండగా.. దాన్ని 50 శాతానికి తగ్గిస్తామని చెప్పారు. మహిళా సాధికారతకు బలమైన పునాదులు వేయడం, సామాజిక భద్రతతో గౌరవప్రదమైన, ఆరోగ్యవంతమైన, ఆర్థిక ప్రగతికి బాటలు వేయడం తమ ప్రణాళిక ప్రధాన ఉద్దేశమని వివరించారు. ఈ ప్రణాళికను సీఎం ఆదేశాల మేరకు విస్తృత చర్చ కోసం త్వరలోనే ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు.