ఒంటరిగా భావిస్తూ.. విద్యార్థిని బలవన్మరణం
ABN , Publish Date - Sep 24 , 2026 | 12:03 AM
స్నేహితులు ఉన్నా ఒంటరిగా భావిస్తూ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది.
కొత్తపల్లి కేజీబీవీలో ఘటన
విచారణ చేపడుతామన్న డీఈవో
భయాందోళనలో విద్యార్థినుల తల్లిదండ్రులు
కేసు నమోదు చేసిన పోలీసులు
నందికొట్కూరు/ కొత్తపల్లి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్నేహితులు ఉన్నా ఒంటరిగా భావిస్తూ ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈఘటన కొత్తపల్లి మండలంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాలు.. లింగాపురం గ్రామానికి చెందిన బోయ కృష్ణంరాజు, విజయలక్ష్మి దంపతుల పెద్ద కుమార్తె భవ్య(17). ఆమె 7వ తరగతిలో కేజీబీవీలో ప్రవే శం పొందింది. ప్రస్తుతం కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. కొంత కాలంగా ఆమె ఓ విద్యార్థినితో స్నేహంగా ఉండేది. ఇటీవలే వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. స్నేహితురాలు దూరంగా ఉండటంతో భవ్య జీర్ణించుకోలేకపోయింది. ఒంటరితనం భరించలేక బాతరూంలకు వాడే లిక్విడ్‌ను బుధవారం తెల్లవారుజామున తాగి ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన తోటి విద్యార్థినులు హాస్టల్ సిబ్బందికి తెలియజేశారు. వారు వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో ఆత్మకూరులోని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తండ్రి కృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జయశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆత్మహత్యపై పలు అనుమానాలు..
చదువులో ముందుండే భవ్య ఆత్మహత్య చేసుకోవడంపై ఆమె బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్ సిబ్బంది ఆత్మహత్య చేసుకుందన్న సమాచారాన్ని ఆలస్యంగా ఎందుకు చేరవేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమ కూతురు చావుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.
కేజీబీవీ వద్ద ఉద్రిక్తత
కేజీబీవీలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఆ పాఠశాలలో విద్యార్థినుల తల్లిదండ్రులు అక్కడి చేరుకున్నారు. విద్యార్థినుల భద్రతపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా అధిక సంఖ్యలో తల్లిదండ్రులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక సిబ్బంది, పోలీసులు వారిని నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. దీంతో సమస్య సద్దుమణిగింది.
ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు
విద్యార్థిని భవ్య మృతి చెందడంతో డీఈవో జనార్దనరెడ్డి, ఆత్మకూరు ఆర్‌డీవో వెంకటశివ, డీఎస్సీ రామాంజనాయక్, రూరల్ సీఐ సురేష్ కుమార్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకున్నారు. భవ్య మృతికి గల కారణాలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. డీఈవో మీడియాతో మాట్లాడుతూ విద్యార్థిని మృతి చెందడం బాధాకరమన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థినులు ఆత్మహత్య చేసుకుంటే తల్లిదండ్రులకు తీరని లోటు అన్నారు. విచారణ పూర్తయ్యాక ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. బాధ్యులు ఎవరైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.