విజయవాడ ఉత్సవ్‌కు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:51 AM
దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులు, పర్యాటకులు, కళాభిమానులను ఆకట్టుకునేలా విజయవాడ ఉత్సవ్, జాతీయ సరస్ మేళాను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు
పున్నమిఘాట్‌లో సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
విజయవాడ అర్బన్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులు, పర్యాటకులు, కళాభిమానులను ఆకట్టుకునేలా విజయవాడ ఉత్సవ్, జాతీయ సరస్ మేళాను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడలోని కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గతేడాది దసరా సందర్భంగా విజయవాడ ఉత్సవ్‌ను వైభవంగా నిర్వహించామని గుర్తుచేశారు. ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి 20 వరకు విజయవాడ ఉత్సవ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబరు 8 నుంచి 23 వరకు జాతీయ సరస్ మేళా కూడా ఉంటుందన్నారు. పున్నమి ఘాట్‌లో సరస్ మేళా, విజయవాడ ఉత్సవ్‌ను నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈసారి ఉత్సవాలకు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఉదయం కనకదుర్గమ్మ దర్శనం, సాయంత్రం విజయవాడ ఉత్సవ్, సరస్ మేళాలో పాల్గొనేలా ప్రజలు రెండు రోజులు ప్లాన్ చేసుకుని రావాలని ఎంపీ సూచించారు.