Share News

కొడుకు కళ్ల ముందే కర్రలు, రాళ్లతో కొట్టి తండ్రిని చంపేశారు!

ABN , Publish Date - Apr 07 , 2026 | 04:31 AM

సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను అతని కొడుకు ముందే బంధువుల సాయంతో దారుణంగా హత్య చేశాడు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

కొడుకు కళ్ల ముందే కర్రలు, రాళ్లతో కొట్టి తండ్రిని చంపేశారు!

  • సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్త దారుణ హత్య

  • బంధువుల సాయంతో ప్రియుడి ఘోరం

  • రాత్రంతా తండ్రి శవం వద్ద చిన్నారి జాగరణ

  • అన్నమయ్య జిల్లాలో ఘటన

చౌడేపల్లె, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): సహజీవనానికి అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను అతని కొడుకు ముందే బంధువుల సాయంతో దారుణంగా హత్య చేశాడు. అన్నమయ్య జిల్లా చౌడేపల్లె మండలం బోయకొండ అటవీ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప కథనం మేరకు.. తమిళనాడు రాష్ట్రం గుడియాత్తంకు చెందిన గాంధీ (32), అతని భార్య రాసాతి చౌడేపల్లె మండలం ఊటూరు వద్ద కోళ్లఫారాలకు కావలి పని చేసేవారు. కొంతకాలంగా బోయకొండ పరిసర ప్రాంతాల్లో భిక్షాటనతో పాటు చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో బోయకొండ యానాదిపాళ్యంకు చెందిన నరసింహులుతో సంబంధం పెట్టుకున్న రాసాతి అతనితోనే ఉంటోంది. గాంధీ తన ఐదేళ్ల కుమారుడు సందీప్‌ను తీసుకుని వెళ్లి భార్యను తనతో రావాలని కోరాడు. ఈ నేపథ్యంలో నరసింహులు అతని సమీప బంధువులు హనుమంతు, పాపన్న, నాగరాజుతో కలిసి గాంధీని తీసుకుని పక్షిరాజపురం సమీపంలోని బోయకొండ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. గాంధీతోపాటు కుమారుడు సందీప్‌ కూడా ఉన్నాడు. అడవిలోని ఒక బండపై కూర్చుని మద్యం తాగారు. మాటామాటా పెరగడంతో నరసింహులు, అతని బంధువులు కలిసి కర్రలు, రాళ్లతో దాడి చేసి గాంధీని హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. చిన్నారి సందీప్‌ రాత్రంతా అడవిలో తండ్రి శవం వద్ద ఉండిపోయాడు. ఉదయం అడవిలో నుంచి నడుచుకుంటూ మదనపల్లె-బోయకొండ ప్రధాన రోడ్డు పక్షిరాజపురం రోడ్డుపైకి వచ్చి వాహనాలను ఆపాడు. ఇద్దరు యువకులు బాలుడిని పక్షిరాజపురం అంగన్‌వాడీ కార్యకర్త వద్దకు చేర్చారు. బాలుడి నుంచి వివరాలు రాబట్టిన ఆమె పోలీసులకు సమాచారం అందించింది. పుంగనూరు రూరల్‌ సీఐ సాయిప్రసాద్‌, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, నలుగురు నిందితులతోపాటు గాంధీ భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Updated Date - Apr 07 , 2026 | 04:34 AM