రైతు జాతర..
ABN , Publish Date - Jan 07 , 2026 | 12:12 AM
మ్మిగనూరు జాతర అంటేనే ఒక ప్రత్యేకత. ఈ జాతరలో రైతులను మొదలుకొని చిన్న పిల్లల వరకు వారికి అవసరమయ్యే వస్తు సామగ్రి లభిస్తుంది.
వివిధ ప్రాంతాల నుంచి విక్రయానికి వృషభాలు
ఎమ్మిగనూరు జాతరలో ప్రతీది ప్రత్యేకమే
ఎమ్మిగనూరు, జనవరి 7 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు జాతర అంటేనే ఒక ప్రత్యేకత. ఈ జాతరలో రైతులను మొదలుకొని చిన్న పిల్లల వరకు వారికి అవసరమయ్యే వస్తు సామగ్రి లభిస్తుంది. దీంతో ఈ జాతరకు జిల్లాతో పాటు పక్కనే ఉన్న తెలంగాణ, కర్ణాటక ప్రాంతాల నుంచి రైతులు, ప్రజలు భారీగా తరతలివస్తారు. ప్రధానంగా రైతులకు అవసరమయ్యే చర్ణాకోలు(చెలకాల) మొదలు కొని వృషభాలు, వ్యవసాయ పనిముట్లు లభిస్తాయి. దీంతో రైతులు ఈ జాతర వచ్చిందంటే తమకు ఏడాది పాటు వ్యవసాయంలో ఉపయోగపడే వృషభాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. పశుపోషకులు ఏడాది పాటు పోషించి పెంచిన వృషభాలను, కోడే దూడలను, కిలారు, సీమ, తూర్పునాటి రకాలకు చెందిన వృషభాలను ఈ జాతరకు తెచ్చి విక్రయిస్తారు. మంత్రాలయం రోడ్డులోని శ్రీనివాస నగర్‌లో ఏర్పాటు చేసిన జాతర సంత ఇటు రైతులు, వృషభాలతో కళకళలాడింది. గుడికల్, చిలకలడోన, కలుదేవకుంట, చిన్నబోంపల్లి, నందవరం, సంతనాగాలాపురం, ముగతితో పాటు కర్ణాటక నుంచి కొంతమంది వ్యాపారులు కిలారు కోడేలను విక్రయానికి తీసుకొచ్చారు. రూ.20వేల నుంచి రూ.2.90లక్షల వరకు జత వృషభాల ధరలు పలుకుతున్నాయి. కలుదేవకుంటకు చెందిన బీసన్న అనే వ్యాపారి ఏడు జతల కిలారు కోడేదూడలను విక్రయానికి తీసుకురాగా రూ. 1.72లక్షలు, రూ.1.70, రూ.1.20, రూ.1.20, రూ.లక్ష ప్రకారం ఐదు జతలను విక్రయించాడు. అలాగే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి రూ.1.66 వేలకు ఓ జత కిలారు కోడే దూడలను విక్రయించాడు. ఇక చిన్న బోంపల్లి, చిలకలడోన, గుడికల్, నందవరం గ్రామాలకు చెందిన రైతులు తమ సీమ ఎద్దులను జత రూ.1.70లక్షల నుంచి రూ.2.90లక్షల వరకు విక్రయించాడు.
ఫ అందుబాటులో వ్యవసాయ పనిముట్లు:
రైతులకు వ్యవసాయంలో అవసరమయ్యే వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు సైతం జాతరలో వ్యాపారులు రైతులకు అందుబాటులో పెట్టారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాల రోడ్డులోని మాచాని సోమప్ప మెమోరియల్‌హాల్ ముందు ఎద్దుల బండ్లు, బండి చక్రాలు, కాడిమాన్లు, నాగళ్లు, గుంటికలు, గొర్రులు, బండి నాగళ్ల, దెంతెలు విక్రయానికి ఉంచారు. వీటిని రైతులు కొనుగోలు చేస్తూ కనిపించారు.
ఫ చెక్కపాయె.. ఇనుము వచ్చే!
ఎన్నో ఏళ్లుగా రైతులకు అవసరమయ్యే పనిముట్లు చెక్కతోనే తయారు చేసిన వాటిని వినియోగిస్తూ వస్తున్నారు. మారిన కాలానుగుణంగా చెక్కస్థానంలో ఇనుముతో తయారు చేసిన వ్యవసాయ పనిముట్లు అధికంగా అమ్ముడవుతున్నాయి. ఎమ్మిగనూరులో జాతరలో ప్రస్తుతం ఇనుముతో తయారు చేసిన ఎద్దుల బండ్లు, గొర్రులు, బండి చక్రాలు, దెంతెలు, నాగళ్లు కనిపిస్తున్నాయి. రైతులు సైతం ఎక్కువ రోజులు మన్నిక వస్తాయన్న ఆశతో వీటిని కొనుగోలు చేస్తున్నారు. గోనెగండ్ల మండలం హెచ.కైరవాడి, పుట్టపాశం, తెలంగాణలోని సింగారంతో పాటు ఆయా ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తమ ఇళ్ల దగ్గరే ఇనుముతో వ్యవసాయ పనిముట్లు తయారు చేసి విక్రయానికి తెచ్చారు. దాదాపు 15-20 రోజుల వరకు వీటిని ఉంచి విక్రయిస్తారు. ఒక ఎద్దుల బండి రూ.40నుంచి రూ. 50 వేల వరకు పలుకుతోంది. ఇనుముతో తయారు చేసిన ఎద్దుల బండ్లకు టైర్ల చక్రాలను అమర్చి విక్రయిస్తున్నారు.
ఫ వ్యాపారాలు అంతంత మాత్రమే
- రామదాసు ఆచారి, కనకవీడు
ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కాడిమాన్లు, పలుగులు, గుంటికలు వంటివి తయారు చేసి విక్రయించేందుకు జాతరలో పెట్టాను. రెండు రోజుల నుంచి ఓక కాడిమాను మాత్రమే అమ్ముడు పోయింది. గత ఏడాదితో పోలిస్తే వ్యాపారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.