Revenue Department: రైతు ఓకే అంటేనే ఫైనల్!
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:19 AM
భూముల రీ-సర్వేలో రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. రైతుల ప్రమేయంతోనే గ్రామంలో భూముల సర్వేను ప్రారంభించి.. ముగిస్తారు.
భూముల రీ-సర్వేలో నయా రూల్స్
సర్వే ప్రారంభం, చివరిలోనూ రైతు ఈ-కేవైసీతోనే హక్కుల నిర్ధారణ
పాస్ పుస్తకాల జారీ సహా ప్రతి దశలోనూ భాగస్వామ్యం
వెబ్‌ల్యాండ్ డేటా ఆధారంగా రైతన్నలకు అధికారుల నోటీసు
గ్రామసభలో తీర్మానానికి పెద్దపీట
త ర్వాతే ఆర్‌వోఆర్‌కు ఆమోదం
రీ సర్వే విధివిధానాల్లో మార్పులు
రెవెన్యూ శాఖ మార్గదర్శకాలు జారీ
భూముల రీ-సర్వేలో అధికారుల ఇష్టాయిష్టాలు కాదు.. అన్నదాతల అభీష్ఠమే ఫైనల్. సర్వే ప్రారంభం నుంచి ముగింపు వరకు అన్ని దశల్లోనూ రైతులదే కీలక పాత్ర. హక్కుల నిర్ధారణ నుంచి పాస్ పుస్తకాల మంజూరు వరకు వారిదే భాగస్వామ్యం. ఒక్కమాటలో చెప్పాలంటే.. భూమికి- రైతుకు ఉన్న బంధాన్ని గుర్తించిన ప్రభుత్వం రీ-సర్వేలో వారినే రాజులను చేసింది. వారి అభిప్రాయాలకే పెద్దపీట వేసింది. ఈ మేరకు రీ-సర్వే విధివిధానాల్లో పలు కీలక మార్పులు చేస్తూ అన్నదాతల భాగస్వామ్యాన్ని పెంచుతూ రెవెన్యూ శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
భూముల రీ-సర్వేలో రైతులకు కీలక పాత్ర కల్పిస్తూ రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం.. రైతుల ప్రమేయంతోనే గ్రామంలో భూముల సర్వేను ప్రారంభించి.. ముగిస్తారు. ఈ మేరకు నోటిఫికేషన్ 13 ప్రకారం రీ-సర్వే ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేయనున్నారు. భూముల సర్వే ప్రారంభం, ముగింపు, రికార్డ్ ఆఫ్ రైట్స్(ఆర్‌వోఆర్-భూమి హక్కుల) నిర్ధారణ, పాస్‌పుస్తకాల జారీ వంటి కీలక అంశాల్లో రైతు భాగస్వామ్యం ఉండాలని రెవెన్యూశాఖ దిశానిర్దేశం చేసింది. ఈ నేపథ్యంలో రీ-సర్వేకు నోటీసులు ఇవ్వడం నుంచి చివరకు భూమి హక్కుల నిర్ధారణ వరకు ప్రతి దశలో రైతుల భాగస్వామ్యం, ఆమోదం ఉండేలా నూతన విధివిధానాలను రూపొందించింది.
వచ్చే 223 రోజుల వ్యవధిలో చేపట్టే భూముల సర్వేలో తొలి 143 రోజుల పాటు ఏం చేయాలి?. ఏ దశలో ఏ పని చేపట్టాలి?... వంటి కీలక అంశాలతోపాటు అధికారుల బాధ్యతలను నిర్దేశిస్తూ భూ పరిపాలనా ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) ఇ. జయలక్ష్మి తాజాగా నూతన విధివిధానాలను జారీ చేశారు. సర్వే, సరిహద్దుల చట్టం-1923 ప్రకారం తొలుత రైతుల భూములు కొలవాలంటే వారికి ఈ-కేవైసీ ఆధారంగా నోటీసులు ఇస్తారు. దీనికి వాట్సాప్, రెగ్యులర్ మెసేజింగ్ సర్వీసె్‌స(ఆర్‌ఎంఎ్‌స)ను ఉపయోగించుకుంటారు. దీంతో ఇప్పుడు ఉన్న వెబ్‌ల్యాండ్‌లో పేర్కొన్న డేటా ఆధారంగా రైతుల ఫోన్ నెంబర్లకు రీ-సర్వే మెసేజ్‌లు పంపిస్తారు. దీనిలో భూమి కొలతలు వేసే సమయాన్ని స్పష్టంగా పేర్కొంటారు. ఇలా నోటీసుల జారీ నుంచి భూముల కొలతలు వేయడం, రైతుల నుంచి అభ్యంతరాలు వస్తే వాటిని పరిష్కరించడానికి 90 రోజుల కాలవ్యవధిని నిర్దేశించారు. గ్రామస్థాయిలో సర్వేయర్(వీఎస్), రెవెన్యూ అధికారి(వీఆర్‌వో)లకు బాధ్యత అప్పగించారు. సర్వే అనంతరం భూములకు ల్యాండ్‌పార్సిల్ మ్యాప్‌లు, వాటికి నెంబర్లు కేటాయించడం, మ్యాప్‌ల్లో విస్తీర్ణంపై వచ్చే తప్పులను సరిచేసే బాధ్యతలను గ్రామ సర్వేయర్, రెవెన్యూ అధికారికి అప్పగించారు. భూముల కొలతలు వేసిన తర్వాత సర్వేయర్లు రూపొందించిన డేటా పరిశీలన, నిర్ధారణ, గ్రామ సభ నిర్వహణకు 12 రోజుల కాలవ్యవధిని నిర్దేశించారు. భూముల సర్వే అనంతరం పట్టా భూముల రికార్డును ఆర్డీవో స్థాయిలో ఆమోదించాలని ఆదేశించారు. తదుపరి జాయింట్ కలెక్టర్(జేసీ) ఆమోదం కోసం ఫైలు పంపించాల్సిన అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే, ప్రభుత్వ భూముల రికార్డును ఆమోదించే బాధ్యతను జేసీకే అప్పగించారు. భూముల సర్వేపూర్తయిన తర్వాత సర్వే-సరిహద్దుల చట్టం ప్రకారం నోటిఫికేషన్ 13 జారీచేసే బాధ్యతను జేసీకి అప్పగించారు. ఆ తర్వాత భూమి హక్కుల(ఆర్‌వోఆర్) ముసాయిదా రికార్డును గ్రామసభలో చర్చించి ఆమోదించాలని తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీనికి 15 రోజుల వ్యవధిని ఇచ్చారు.
ఆది నుంచి తుది వరకు..
గ్రామంలోని రైతులు, పట్టాదారులను పిలిచి సభ నిర్వహిస్తారు. రీ-సర్వే రికార్డులను ప్రదర్శిస్తారు. అధికారులు రూపొందించిన భూమి హక్కుల ముసాయుదా రికార్డులను రైతుల సమక్షంలో ఉంచుతారు. రైతుల భూమి వివరాలు, వాటి విస్తీర్ణం, పాస్‌పుస్తకాలు, వీటిలోని అంశాలను గ్రామసభలో పేరుపేరునా చదివి వినిపిస్తారు. దీనికిగాను రైతుల నుంచి మరో దఫా ఈ-కేవైసీ కింద ఆమోదం తీసుకుంటారు. రైతుల నుంచి వచ్చే అభ్యంతరాలను వెంటనే పరిష్కరిస్తారు. ఆ తర్వాతే భూమి హక్కుల(ఆర్‌వోఆర్) తుది రికార్డును జిల్లా గెజిట్‌లోని ఫామ్-4లో ప్రచురిస్తారు.
రెవెన్యూ, సర్వే అధికారులకు లాగిన్‌లు
రీ-సర్వే నూతన విధివిధానాలు, మార్గదర్శకాల అమలుకోసం ఈసారి వెబ్‌ల్యాండ్ 1.0లో ఆన్‌లైన్ లాగిన్‌లు గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌వో), సర్వేయర్‌లకు ఇచ్చారు. గ్రామ సర్వేయర్ ఇచ్చిన లాగిన్‌లో కొత్తగా ‘రిమార్క్స్’ అనే అంశాన్ని చేర్చారు. దీంతోపాటు మ్యుటేషన్ అవసరం, మ్యుటేషన్ అవసరం లేదు, సాదా బైనమా అవసరం అనే కాలమ్‌లను చేర్చారు. అంటే, ఆయా అంశాలకు సంబంధించి వారు ప్రస్తావించే అవకాశం కల్పించారు. వీఆర్‌వోకు ఇచ్చిన లాగిన్‌లో మ్యుటేషన్, కరెక్షన్(భూమి రకం, స్వభావం), అక్షరదోషాల అంశాలను వీఆర్‌వో తన లాగిన్ ద్వారా నివేదించే అవకాశం కల్పించారు.