Share News

కారును చేజ్‌ చేసి.. రైతును విడిపించి!

ABN , Publish Date - May 09 , 2026 | 03:59 AM

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం కిడ్నాప్‌ కలకలం రేపింది. ధర్మవరం ఆర్డీవో కోర్టుకు వాయిదా నిమిత్తం వచ్చిన ముసుగు నారాయణస్వామి అనే రైతును కొందరు యువకులు కారులో ఎత్తుకుపోయారు.

కారును చేజ్‌ చేసి.. రైతును విడిపించి!

  • కిడ్నాప్‌ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించిన పోలీసులు

  • ధర్మవరంలో ఆరుగురి అరెస్టు

  • భూ వివాదమే కారణం

ధర్మవరం, మే 8(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో శుక్రవారం కిడ్నాప్‌ కలకలం రేపింది. ధర్మవరం ఆర్డీవో కోర్టుకు వాయిదా నిమిత్తం వచ్చిన ముసుగు నారాయణస్వామి అనే రైతును కొందరు యువకులు కారులో ఎత్తుకుపోయారు. తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు.. కారును వెంబడించి, గంటల వ్యవధిలో కిడ్నాపర్లను పట్టుకుని, రైతును విడిపించారు. వన్‌టౌన్‌ సీఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపిన మేరకు.. ముదిగుబ్బ మండలం కమ్మవారిపల్లికి చెందిన రైతు ముసుగు నారాయణస్వామి అదే గ్రామానికి చెందిన కన్యాల నారాయణ నుంచి 1997లో 1.65 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. కొన్నేళ్ల తర్వాత నారాయణ కుమారుడు రవీంద్ర.. అది తన తాత ఆస్తి అని, అందులో తనకూ వాటా ఉందని పలుమార్లు గొడవ చేశాడు. ఈ వివాదంపై రవీంద్ర, నారాయణస్వామి రెండు నెలల కిందట ధర్మవరం ఆర్డీవో కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసు వాయిదా కోసం నారాయణస్వామి శుక్రవారం ఆర్డీవో కోర్టుకు వచ్చారు. విచారణ ముగిశాక.. నారాయణస్వామి బయటకు రాగానే ఆరుగురు వ్యక్తులు ఆయనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారు. కారులో విచక్షణారహితంగా నారాయణస్వామిపై దాడి చేశారు. తమకు రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే వేటకొడవళ్లతో నరికి చంపుతామని బెదిరించారు. కొన్ని బాండ్లపై సంతకాలు చేయించుకున్నారు. కిడ్నాప్‌ సమాచారం అందుకున్న పోలీసులు... ఎన్‌ఎ్‌స గేటు వైపు కారు వెళ్లినట్లు గుర్తించి, వెంబడించారు. శ్రీహరిపురం వద్ద కిడ్నాపర్లను అదుపులోకి తీసుకుని, రైతును విడిపించారు. నారాయణస్వామి నుంచి ఫిర్యాదు తీసుకుని, కేసు నమోదు చేశారు. కిడ్నాప్‌ చేసిన రవీంద్ర, అరుణ్‌, హరి, ఉదయ్‌, మధుసూదన్‌ నాయుడు, ప్రదీ్‌పను అరెస్టు చేశారు.

Updated Date - May 09 , 2026 | 09:20 AM