Share News

ఏనుగుల దాడిలో రైతు మృతి

ABN , Publish Date - Jun 27 , 2026 | 04:15 AM

ఏనుగుల దాడిలో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. తిరుపతి జిల్లా పాకాల మండలం ఈ-పాలగుట్టపల్లె పంచాయతీ దేవినేనిఇండ్లకు చెందిన కె.తిమ్మారెడ్డి (65) వ్యవసాయం చేసుకుంటూ..

ఏనుగుల దాడిలో రైతు మృతి

  • తిరుపతి జిల్లాలో ఘటన

  • డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విచారం

  • పరిహారం అందించాలని ఆదేశం

పాకాల, అమరావతి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): ఏనుగుల దాడిలో ఓ రైతు మృత్యువాత పడ్డాడు. తిరుపతి జిల్లా పాకాల మండలం ఈ-పాలగుట్టపల్లె పంచాయతీ దేవినేనిఇండ్లకు చెందిన కె.తిమ్మారెడ్డి (65) వ్యవసాయం చేసుకుంటూ ఇంటివద్ద ఒంటరిగా ఉంటున్నాడు. అటవీ ప్రాంత సమీపంలోని పొలం దగ్గరకు గురువారం రాత్రి వెళ్లిన తిమ్మారెడ్డిపై ఏనుగులు దాడిచేశాయి. దారుణంగా తొక్కి కాలువిరిచి దూరంగా పడేశాయి. శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. శుక్రవారం రాత్రి గ్రామస్థులు పొలం వద్ద ఆయన మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తిమ్మారెడ్డి మృతి విషయం తెలియడంతో పరిసర గ్రామాల రైతులు చీకటి పడితే బయటికి రావడానికే భయపడుతున్నారు. ఈ విషయం తెలిసి అటవీశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తిమ్మారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపి, తక్షణమే వారి కుటుంబానికి పరిహారం అందించే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు.

Updated Date - Jun 27 , 2026 | 04:16 AM