‘ప్రైవేటు ఫైనాన్స్’కు రైతు కూలీ బలి
ABN , Publish Date - Apr 02 , 2026 | 04:40 AM
ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక రైతు కూలీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు ..
ఎ.కొండూరు, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులు తట్టుకోలేక రైతు కూలీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం చీమలపాడు పెద్ద తండాకు చెందిన భూక్యా హనుమ (43)కు కూలి పనులే ఆధారం. 2024 మే 2న హిరా నందాని ఫైనాన్స్ సర్వీస్ ప్రయివేటు లిమిటెడ్ వద్ద తన ఇంటిని తనఖా పెట్టి రూ.5.23 లక్షలు రుణం తీసుకున్నాడు. 60 నెలల వాయిదా పద్ధతి కాగా, నెలకు రూ.14,446ల కిస్తీ కట్టాలి. అప్పట్నుంచి ప్రతి నెలా కట్టుకుంటూ వస్తున్నాడు. నాలుగు నెలల నుంచి ఆర్థిక ఇబ్బందుల కారణంగా కిస్తీలు కట్టలేకపోయాడు. దీంతో రికవరీ ఏజెంట్లు డబ్బు కట్టాలంటూ వారం నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బుధవారం మరోసారి ఇంటికి వచ్చి బ్లాక్ బోర్డుపై ‘ఇల్లు జప్తు చేస్తామ’ని నోటీసు అంటించారు. దీంతో ఇల్లు జప్తు చేస్తారనే భయంతో మానసికంగా కుంగిపోయిన హనుమ సమీపంలోని మల్బరీ షెడ్డులో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.