Share News

పండ్ల ఉత్పత్తులపై రైతు సదస్సులు

ABN , Publish Date - Jan 25 , 2026 | 04:01 AM

రాష్ట్రంలో 22 రకాల పండ్ల ఉత్పత్తులపై జిల్లాల్లో రైతు సదస్సులు నిర్వహించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది.

పండ్ల ఉత్పత్తులపై రైతు సదస్సులు

  • నెలాఖరున ఏలూరులో కోకో కాంక్లేవ్‌.. ఉద్యాన శాఖ నిర్ణయం

అమరావతి, జనవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 22 రకాల పండ్ల ఉత్పత్తులపై జిల్లాల్లో రైతు సదస్సులు నిర్వహించాలని ఉద్యాన శాఖ నిర్ణయించింది. పండ్ల ఉత్పత్తులకు నాణ్యత, మార్కెటింగ్‌, మంచి ధర వచ్చే లక్ష్యంతో పంటల వారీగా జిల్లాల్లో సదస్సులు ఏర్పాటు చేయనున్నది. దీనిలో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో ఏలూరులో కోకో కాంక్లేవ్‌-2026 నిర్వహించనున్నది. ఈసారి పండ్ల తోటల్లో యాజమాన్య పద్ధతులతోపాటు నాణ్యతమైన పండ్ల ఉత్పత్తికి పంట కోత అనంతర పరిజ్ఞానం, ఉప ఉత్పత్తుల తయారీ, వాటి మార్కెటింగ్‌, ఉత్పత్తులకు అదనపు విలువ జోడింపు అంశాలపైనా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు ఉద్యాన శాఖ డైరెక్టర్‌ కె.శ్రీనివాసులు శనివారం ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కోకో, మామిడి, అరటి, జీడిమామిడి, డ్రాగన్‌, దానిమ్మ, బత్తాయి, మిర్చి, కాఫీ తదితర పంటలపై సదస్సులు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఆయా జిల్లాల్లోని ప్రధాన పంటపై దృష్టి సారించి, మిగతా పంటల్లోనూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కోల్డ్‌ చెయిన్‌ సౌకర్యాలు, ఎగుమతులకు అనుకూలమైన అంశాలపైనా రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, మార్కెటింగ్‌ ప్రతినిధులు సదస్సుల్లో పాల్గొని, ఏ పంటని ఏవిధంగా పండిస్తే.. మంచి ధర వస్తుందో వివరిస్తారు. సూక్ష్మసేద్యంలో ఆటోమేషన్‌ విధానంతోపాటు, పండ్ల తోటలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీలు, ఇతర పథకాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు.

Updated Date - Jan 25 , 2026 | 04:01 AM