Share News

ఫామ్‌ టూ హోం!

ABN , Publish Date - May 27 , 2026 | 05:00 AM

రైతులు పండించిన కూరగాయలు, పండ్ల ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ‘ఫార్మ్‌ టూ హోం’ విధానం అమలుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

ఫామ్‌ టూ హోం!

  • వినియోగదారుల ఇంటికే కూరగాయలు, పండ్లు

  • వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌పై వ్యూహం

  • జూలై నాటికి మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన

  • 3 కోట్లతో పులివెందులలో ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌

  • రాయలసీమలో అరటికి కోల్డ్‌ స్టోరేజీ సౌకర్యం

  • యాదవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటుపై పరిశీలన

  • మత్స్యకారులకు 200 మెకనైజ్డ్‌ బోట్లకు నిధులు

  • కొత్త ఆక్వా కనెక్షన్లకూ విద్యుత్‌ సబ్సిడీ వర్తింపు

  • అధికారులకు సీఎం చంద్రబాబు నిర్దేశం

అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన కూరగాయలు, పండ్ల ఉత్పత్తులను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా ‘ఫార్మ్‌ టూ హోం’ విధానం అమలుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఫార్మర్‌ ప్రొడ్యూసర్స్‌ ఆర్గనైజేషన్ల ద్వారా ఈ కార్యక్రమం చేపట్టాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌తో పాటు తక్కువ వ్యయంతో ఇంటి వద్దకే చేర్చేలా ఈ కొత్త వ్యూహం ఉపయోగపడుతుందని తెలిపారు. మంగళవారం ఉండవల్లి క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, ప్రాథమిక రంగంలోని ఆరు మిషన్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావాలను అంచనా వేస్తూ, ప్రాంతాల వారీగా పంటల సాగు అంచనా, అందుకు అనుగుణంగా చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పీఎండీఎస్‌- హాఫ్‌మూన్‌ విధానాల్లో సేద్యం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎల్‌నినో కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉన్నప్పటికీ రైతులు నష్టపోకుండా పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ విషయంలో కేంద్రం సహకారం కూడా తీసుకోవాలని, రాష్ట్రంలో చేపడుతున్న ప్రకృతి సేద్యానికి మరింత ప్రోత్సాహం కల్పించాలని స్పష్టం చేశారు. ఈ విధానంలో విజయవంతమైన రైతుల సేవల్ని వినియోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహం

‘కరువు ప్రాంతాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు చోట్ల పశువుల దాణా పండించేలా చూడాలి. వ్యవసాయ యాంత్రీకరణతో పాటు ఆధునీకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలి. భూసార పరీక్షలు చేసి, ఏ పంటకు ఏ భూమి అనువుగా ఉందో రైతులకు తెలియజేయాలి. భూసార పరీక్షలు చేసి, వాటి వివరాలను ఆన్‌లైన్‌లోనూ రైతులకు అందుబాటులో ఉంచాలి. ప్రకృతి సేద్యం సహా ఎన్‌ఎంఎన్‌ఎ్‌ఫ పథకం అమలు కోసం కేంద్రానికి లేఖలు రాయాలి. రైతుబజార్లు, ప్రైవేట్‌ మార్కెట్లలో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. కృష్ణా, గోదావరి డెల్టా సహా వివిధ ప్రాంతాల్లో పంటలకు సాగునీటి సరఫరాపై దృష్టిపెట్టాలి. పురుగు మందుల వాడకాన్ని ఏ మేరకు తగ్గించగలమో అంచనా వేయాలి. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి, సూక్ష్మపోషకాలను పెంచేలా చర్యలు తీసుకోవాలి. యుద్ధ ప్రభావం రసాయన ఎరువులు లభ్యతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రకృతి సేద్యం వైపుగా రైతుల్ని ప్రోత్సహించాలి. ఈ విధానంపై వర్సిటీల ప్రొఫెసర్లు, విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి అధ్యయనం చేసేలా కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలి. రైతు సాధికార సంస్థ ద్వారా హార్వెస్టర్లు, విత్తన యంత్రాలు, ఇతర పరికరాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. డ్రోన్లు, ఫార్మింగ్‌ యంత్రాల వినియోగం మరింత పెంచాలి.’


లక్ష కోట్లతో హార్టీకల్చర్‌ హబ్‌

రాయలసీమ ప్రాంతాన్ని ఉద్యాన హబ్‌గా మార్చేందుకు రూ.40వేల కోట్లతో పూర్వోదయ పథకం అమలులో భాగంగా సాగునీటి ప్రాజెక్టులు, రోడ్డు కనెక్టివిటీ, గోదాములు సహా మౌలిక సదుపాయాల నిర్మాణంతో పాటు రూ.60వేల కోట్ల ప్రైవేట్‌ పెట్టుబడులతో రాయలసీమలో ఉద్యాన రంగాన్ని అభివృద్ధి చేస్తాం. రాయలసీమలో అరటికి కోల్డ్‌ స్టోరేజ్‌ సౌకర్యం కల్పించాలి. తూర్పుగోదావరి జిల్లా దేవరాపల్లి సమీపంలో యాదవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు అంశాన్ని పరిశీలించండి. జూలై నాటికి మదనపల్లెలో ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేస్తాం. పులివెందులలో సెంట్రల్‌ ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబొరేటరీని పూర్తిచేసి, త్వరలో వినియోగంలోకి తేవాలి. దీనికి అవసరమైన రూ.3కోట్లను తక్షణమే విడుదల చేసి కార్యకలాపాలు ప్రారంభించాలి. పశుదాణాతో పాటు సైలేజ్‌ గడ్డిని కూడా తక్కువ ధరకు అందుబాటులోకి తేవాలి. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా పౌల్ర్టీల్లో కోళ్లు చనిపోకుండా చర్యలు తీసుకోవాలి.’


అన్ని నీటి వనరుల్లో చేపల పెంపకం

ఆక్వా జోన్లలో సాగుచేసే రైతులకు ఇచ్చే విద్యుత్‌ సబ్సిడీ అంశంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆక్వా రంగానికి యూనిట్‌కు రూ.1.50 చొప్పున విద్యుత్‌ సబ్సిడీ ఇస్తున్నామని, ఇప్పటికే ఇచ్చిన 50వేల కనెక్షన్లతో పాటు కొత్తగా రిజిస్ర్టేషన్లు చేసుకున్న 12,680 ఆక్వా కనెక్షన్లకూ ఈ సబ్సిడీ వర్తింపజేయాలని అధికారులను ఆదేశించారు. అక్వా రైతులకు విద్యుత్‌ సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.1,100 కోట్లు ఇస్తోందని, కొత్త కనెక్షన్లకు మరో రూ.188 కోట్ల అదనపు సబ్సిడీని కూడా భరిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సాగవుతున్న 4లక్షల ఎకరాలు ఆక్వా జోన్‌ పరిధిలోకి తేవాలని స్పష్టం చేశారు. ఆక్వా రంగంలో నాణ్యత, సర్టిఫికేషన్‌తో పాటు ట్రేసబిలిటీ తీసుకు రావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరుల్లోనూ చేపల పెంపకం ద్వారా స్థానిక మత్స్యకారులకు ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు. సముద్ర తీరంలో మత్స్యకారులకు 200 మెకనైజ్డ్‌ బోట్లను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. బ్లూ ఎకానమీ దిశగా ఆక్వా రంగాన్ని ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు. అలాగే రైతుబజార్ల ఆధునీకరణకు చర్యలు తీసుకోవాలని, మరో 90 నియోజకవర్గాల్లో రైతుబజార్ల ఏర్పాటుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. డిజి రైతబజార్‌ యాప్‌ను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ సమీక్షలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, సీఎస్‌ సాయిప్రసాద్‌, వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2026 | 05:50 AM