Retirement Farewell: జస్టిస్ మల్లికార్జునరావుకు ఘనంగా వీడ్కోలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 04:07 AM
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావుకు గురువారం హైకోర్టు ఘన వీడ్కోలు పలికింది.
న్యాయ సేవలను కొనియాడిన హైకోర్టు సీజే జస్టిస్ ఠాకూర్
అమరావతి, జనవరి 8(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మల్లికార్జునరావుకు గురువారం హైకోర్టు ఘన వీడ్కోలు పలికింది. ఆయన ఈ నెల 18న పదవీ విరమణ చేయనుండగా, సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ముందుగానే వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. జస్టిస్ మల్లికార్జునరావు న్యాయసేవలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ కొనియాడారు. సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి కృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఉన్నతస్థానానికి ఎదిగారన్నారు. ఆయన శేషజీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా సాగాలని ఆకాంక్షించారు. జస్టిస్ మల్లికార్జునరావు మాట్లాడుతూ..‘ న్యాయమూర్తిగా వృత్తి జీవితం ఎంతో సంతృప్తినిచ్చింది. సుదీర్ఘ వృత్తి జీవితంలో నాకు సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ అన్నారు. అంతకుముందు అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం ఇన్‌చార్జి అధ్యక్షుడు కేవీ రఘువీర్.. ఆయన సేవలను, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, జస్టిస్ మల్లికార్జునరావు కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్లు, న్యాయవాదులు పాల్గొన్నారు. అలాగే, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్ మల్లికార్జునరావు, కిరణ్మయి దంపతులను ఘనంగా సత్కరించి, జ్ఞాపిక, పట్టువస్త్రాలు బహూకరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి సి.సుబోధ్ తదితరులు పాల్గొన్నారు.