కజ్జికాయల కోసం చిన్నల్లుడి గొడవ!
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:18 AM
అనంతపురం జిల్లాలో ఓ వింత ఫిర్యాదు పోలీసు గ్రూపులో నవ్వుల పువ్వులు పూయించింది. ఉరవకొండలో గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి...
అనంతపురం క్రైం, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లాలో ఓ వింత ఫిర్యాదు పోలీసు గ్రూపులో నవ్వుల పువ్వులు పూయించింది. ఉరవకొండలో గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఓ ఇంటికి ముగ్గురు అల్లుళ్లు రాగా, చిన్నల్లుడు మినహా.. మిగిలిన ఇద్దరికీ అత్తింటివారు కాస్త ఎక్కువ మర్యాద చేశారు. దీంతో ఆగ్రహించిన చిన్నల్లుడు గొడవకు దిగడంతో అత్త 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఓ కానిస్టేబుల్ ఆ ఇంటికి వెళ్లి చిన్నల్లుడిని ప్రశ్నించగా, ‘చూడండి సార్.. పెద్దల్లుళ్లిద్దరికీ కజ్జికాయలు పెట్టారు. నాకు పెట్టడం లేదు. ఇదేం మర్యాద..? మీరే న్యాయం చెప్పండి’ అని తనకు జరిగిన అవమానం గురించి వివరించాడు. దీంతో ఆ కానిస్టేబుల్ కజ్జికాయలను ముగ్గురు అల్లుళ్లకూ తానే సమంగా పంచి తిరిగొచ్చారు. ఈ విషయం ఉన్నతాధికారులకు గ్రూపులో నివేదించగా అది చూసి పోలీసు అధికారులు, సిబ్బంది నవ్వు ఆపుకోలేకపోయారు.