Share News

రేషన్‌ కార్డు కాదు ఫ్యామిలీ కార్డు

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:50 AM

రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాల అమలుకు ఫ్యామిలీ కార్డు విధానం తీసుకొస్తున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్‌ తెలిపారు.

రేషన్‌ కార్డు కాదు ఫ్యామిలీ కార్డు

  • ఇక వేరుగా ప్రత్యేక కార్డు..దానితోనే సంక్షేమ లబ్ధి

  • సూపర్‌ సిక్స్‌ పథకాలూ అనుసంధానం

  • రెండేళ్లలో 5 లక్షల కుటుంబాలు బీపీఎల్‌ నుంచి బయటికొచ్చే అవకాశం

  • జీరో పావర్టీపై కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్‌

అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డుతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాల అమలుకు ఫ్యామిలీ కార్డు విధానం తీసుకొస్తున్నట్లు ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూ్‌షకుమార్‌ తెలిపారు. ఆ కార్డుతోనే అన్ని రకాల పథకాల లబ్ధి చేకూరుతుందని, దీనిపై క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నామని వివరించారు. సూపర్‌ సిక్స్‌ పథకాలను కూడా ఫ్యామిలీ కార్డుతో అనుసంధానం చేస్తామని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో జీరో పావర్టీ అంశంపై ఆయన ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మార్గదర్శి, బంగారు కుటుంబం పథకం అమలు తీరును వివరించారు. 20 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులకు అనుసంధానం చేశామన్నారు. గ్రామస్థాయిలో బంగారుమిత్రలను నియమించి ఈ పథకాన్ని పర్యవేక్షిస్తామన్నారు. రాష్ట్రంలో కోటిన్నరకు పైగా కుటుంబాలు దారిద్య్ర రేఖకు దిగువన(బీపీఎల్‌) ఉండగా, రాబోయే రెండేళ్లలో 5 లక్షల కుటుంబాలు బీపీఎల్‌ నుంచి బయటపడే అవకాశం ఉందని చెప్పారు.

జిల్లా నైపుణ్య ప్రణాళికలు

జిల్లా స్థాయిలో నైపుణ్య ప్రణాళికలు రూపొందించాలని నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ అన్నారు. శాఖను పునర్‌వ్యవస్థీకరించామని, జిల్లాల్లో ఉపాధి కల్పన, నైపుణ్య అధికారులు నోడల్‌ అధికారులుగా వ్యవహరిస్తారని చెప్పారు. నైపుణ్యం పోర్టల్‌ ద్వారా లక్ష మందికి స్కిల్‌ అసె్‌సమెంట్‌ చేస్తున్నామని, ఈ నెలాఖరుకు ఇది పూర్తవుతుందని తెలిపారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటి వరకూ 1.46 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. నిర్మాణ రంగంలో కార్మికులపై సర్వే చేస్తున్నామని, రాష్ట్రంలో 20 లక్షల మంది నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారని, వారిలో 4 శాతం మంది మాత్రమే శిక్షణ తీసుకున్నారని వివరించారు. నిర్మాణ రంగంలో 113 రోల్స్‌ ఉన్నాయని, పలు సంస్థలతో మాట్లాడి శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. కొత్తగా రాబోయే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను మనమే అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. జూన్‌లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. అమరావతిలో 5 ఎకరాల్లో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఐటీ శాఖ కారదర్శి కాటమనేని భాస్కర్‌ మాట్లాడుతూ... కౌశలం కార్యక్రమం ద్వారా స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ మానవ వనరులపై సర్వే జరుగుతోందన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 03:50 AM