Share News

కళ్లున్న కబోది.. యాక్‌ ఛీ!

ABN , Publish Date - Feb 09 , 2026 | 04:08 AM

‘ఆంధ్రజ్యోతికి భూ నజరానా’ అని జగన్‌ రోత పత్రిక గతంలో అక్షర వికారం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అది చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నజరానా కాదని... హైకోర్టు ఉత్తర్వుల మేరకు చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయమని...

కళ్లున్న కబోది.. యాక్‌ ఛీ!

  • జగన్‌ రోత పత్రిక మరో నీచ కథనం

  • భూకేటాయింపు పునరుద్ధరణపై అక్షరాలా వికారం

  • జీవీఎంసీ ఆమోదం లేదంటూ ‘ఆంధ్రజ్యోతి’పై అక్కసు

  • ‘వాయిదా’ను... ‘తిరస్కరణ’గా వక్రీకరణ

  • తీర్మానాన్ని ఆమోదించినా చూడలేని గుడ్డితనం

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

ఎంతసేపూ బురదచల్లాలన్న ఆత్రం, ఆరాటమే!.. అసలు నిజం ఏమిటని తెలుసుకోదు..

నిజాలు తెలిసినా చెప్పదు!. ‘యాక్‌ ఛీ’ అని జనం చీదరించుకుంటున్నా.. ‘సాక్షి’ నైజం మారదు.

‘ఆంధ్రజ్యోతికి భూ నజరానా’ అని జగన్‌ రోత పత్రిక గతంలో అక్షర వికారం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అది చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన నజరానా కాదని... హైకోర్టు ఉత్తర్వుల మేరకు చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయమని ‘ఆంధ్రజ్యోతి’ గత నెల 21వ తేదీన సవివరమైన కథనం ప్రచురించింది. రోత పత్రిక రాసిన అబద్ధాలు, అచ్చోసిన అవాకులను తేదీలు, ఆధారాలతో సహా పాఠకుల ముందు పెట్టింది. దీంతో... రోత పత్రికకు నోరు పెగల్లేదు. ఆ తర్వాత... మళ్లీ ఆదివారం కళ్లున్న కబోది తరహాలో మరో పిచ్చి కథనాన్ని ప్రచురించింది. గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌(జీవీఎంసీ) ‘ఆమోదం’లేకుండానే భూకేటాయింపు జరిగిందని వాపోయింది. అది 1986లో అప్పటి ఎన్టీఆర్‌ ప్రభుత్వం ‘ఆంధ్రజ్యోతి’కి కేటాయించిన భూమి. అయితే... జాతీయ రహదారి కోసం అందులో భూమిని తీసేసుకున్నారు. ఏళ్లతరబడి సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలు, హైకోర్టు ఉత్తర్వుల తర్వాత అదే భూమికి ఆనుకుని వెనుకవైపు, పక్కన అంతే విస్తీర్ణంలో 2017లో ప్రభుత్వం కేటాయించింది. అది కూడా... హక్కు/పరిహారంగా ఇవ్వాల్సిన ఈ భూమికి మార్కెట్‌ ధర వసూలు చేసింది.

Untitled-6 copy.jpg


అయితే ‘ఆంధ్రజ్యోతి’ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్న జగన్‌... తాను అధికారంలోకి రాగానే మొత్తం భూకేటాయింపును రద్దు చేశారు. హైకోర్టు ఆదేశాలనూ లెక్క చేయలేదు. చివరికి... హైకోర్టు ఆదేశాల మేరకే ప్రస్తుత ప్రభుత్వం ‘ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపును పునరుద్ధరించింది. ఇది ‘నజరానా’ అని ఏడుపుగొట్టు రాతలు రాసిన ‘యాక్‌ ఛీ’ పత్రిక... ఇప్పుడు జీవీఎంసీ ఆమోదం లేకుండానే కేబినెట్‌ భూ కేటాయింపు జరిపినట్లు మళ్లీ ఏడ్చింది. బీభత్సమైన శూలశోధన చేసి, కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చినట్లు బిల్డప్‌ ఇచ్చింది. ఇదీ అబద్ధపు, బురదజల్లుడు ‘యాక్‌ ఛీ’ కథనమే. ఎందుకంటే.... భూకేటాయింపు పునరుద్ధరణకు జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదం ఉంది. ఇది అక్షరాలా నిజం. 2025 ఆగస్టు 25న జీవీఎంసీ కౌన్సిల్‌ తీర్మానం(1097) చేసింది. ఇదే విషయాన్ని జీవీఎంసీ జోనల్‌ కమిషనర్‌ తహసీల్దారుకు అధికారికంగా తెలిపారు. కొన్ని అంశాలపై సభ్యులకు అభ్యంతరాలు ఉన్నప్పుడు... అప్పటికప్పుడు వాటిపై స్పష్టత ఇవ్వలేని పరిస్థితి ఉంటే... అజెండాలోని సదరు అంశాన్ని వాయిదా వేయడం సహజం. ‘ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపు పునరుద్ధరణపైనా ఇదే జరిగింది. ఓ సభ్యుడు దీనిపై ప్రశ్నలు లెవనెత్తడంతో ఆ అంశాన్ని వాయిదా వేశారు. ‘అజెండాలోని ఆ అంశాన్ని వాయిదా వేయడమైనది’ అంటూ జీవీఎంసీ పౌరసంబంధాల అధికారి చెప్పారంటూ ‘సాక్షి’ ఆదివారం ఒక చిత్రాన్ని ప్రచురించింది. దాని కిందేమో.. ‘తిరస్కరిస్తూ పీఆర్‌వో పంపిన మెసేజ్‌’ అని రాసింది. వాయిదా వేయడానికీ, తిరస్కరించడానికీ మధ్య తేడా కూడా రోతపత్రికకు తెలియలేదు. అధికారులు కోర్టు ఆదేశాలను చూపిస్తూ వాస్తవ పరిస్థితులను వివరించడంతో సభ్యుడు వెనక్కి తగ్గారు. దీంతో సదరు తీర్మానాన్ని కౌన్సిల్‌ ఆమోదించింది.


‘పేదల’పై ప్రేమ పేరుతో...

పేదలకు కేటాయించేందుకు ఇంకెక్కడా స్థలం లేనట్లు... ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన స్థలాన్నే నాటి జగన్‌ ప్రభుత్వం ఎంచుకుంది. ప్రజా ప్రయోజనాల పేరుతో దాన్ని వెనక్కి లాగేసుకుంది. తాజా కథనంలోనూ... ‘ఆ భూమిని గూడులేని పేదలకు ఇవ్వాలని జగన్‌ ప్రభుత్వం నిర్ణయించుకోగా... అదే భూమిని చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రజ్యోతికి ఇచ్చేందుకు తెగబడింది’ అని వగలుపోయింది. భూకేటాయింపు రద్దు... కక్షసాధింపు చర్య అని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ భూమి తమకు అక్కరకు రాదని, మరోచోట స్థలం కేటాయించాలని గృహ నిర్మాణశాఖ కోరింది. స్థల వినియోగం, విలువ పరంగా తమకు నష్టం రాదని హౌసింగ్‌ విభాగం స్పష్టం చేసిన తర్వాతే... ‘ఆంధ్రజ్యోతి’కి భూకేటాయింపును ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇక... జీవీఎంసీలో తీర్మానాన్ని మార్చారా అంటూ రోతపత్రిక మరో పిచ్చి సందేహాన్ని లేవనెత్తింది. గత ఆగస్టులో చేసిన తీర్మానాన్ని మార్చేస్తే... ఇంకా సభ్యులకు తెలియకుండా ఉంటుందా? జీవీఎంసీలో వైసీపీ సభ్యులూ ఉన్నారు కదా! వారు నిలదీయకుండా ఉంటారా? భూ కేటాయింపు పునరుద్ధరిస్తూ 2025 ఆగస్టు 25న కౌన్సిల్‌ ఆమోదించడం నిజం. ఆ తర్వాత 4నెలలకుగానీ జీవో వెలువడలేదు. అధికార యంత్రాంగం ప్రతిదశలో, ప్రతీచిన్న అంశాన్నీ పరిశీలించి, స్పష్టత తీసుకున్న తర్వాతే ఫైలు కదిలింది. నిజానికి ఆ భూమి జీవీఎంసీది కూడా కాదు. కానీ స్థానిక సంస్థగా కౌన్సిల్‌లో తీర్మానం చేయడం లాంఛనప్రాయం. రెవెన్యూ, హౌసింగ్‌ బోర్డు ఆమోదం, తర్వాత క్యాబినెట్‌ ఆమోదించడమే కీలకం. 2024లో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన 13 నెలలకు గానీ తుది ఆదేశాలు వెలువడలేదు. అయినా సరే... బుల్లెట్‌ వేగంతో ఫైలు కదిలిందనడం, జీవీఎంసీ ఆమోదం లేకుండానే ముందుకెళ్లారనడం ‘సాక్షి’కి మాత్రమే చెల్లింది. అందుకే అది... ‘యాక్‌ ఛీ’ అయ్యింది.

Updated Date - Feb 09 , 2026 | 04:13 AM