నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరికి బెయిల్
ABN , Publish Date - Feb 12 , 2026 | 01:38 AM
నకిలీ మద్యం తయారీ కేసులో మరో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న జినేష్, షిబులకు బెయిల్ మంజూరు చేస్తూ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు..
అయినా..రిమాండ్ ఖైదీలుగానే జినేష్, షిబు
ములకలచెరువులో నమోదైన కేసులో లభించని బెయిల్
విజయవాడ, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం తయారీ కేసులో మరో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విజయవాడలోని జిల్లా జైల్లో ఉన్న జినేష్, షిబులకు బెయిల్ మంజూరు చేస్తూ ఆరో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి జి.లెనిన్‌బాబు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బెయిల్ కోసం వీరిద్దరూ దాఖలుచేసిన పిటిషన్లపై వాదప్రతివాదనలు ముగియడంతో కోర్టు తీర్పును వెలువరించింది. ఒకొక్కరు రూ.2 వేలతో రెండు పూచీకతులను సమర్పించాలని, ఎక్సైజ్ అధికారులు విచారణకు పిలిచినప్పుడు హాజరుకావాలని, పాస్‌పోర్టులను కోర్టులో సమర్పించాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. భవానీపురం ఎక్సైజ్ పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ములకలచెరువు కేసులో బెయిల్ రాకపోవడంతో ఇంకా రిమాండ్ ఖైదీలుగా ఈ ఇద్దరు నిందితులు ఉండబోతున్నారు.