Share News

Fake Liquor Case: అద్దేపల్లి నుంచి జోగికి నెలకు రూ.5 లక్షల ముడుపులు!

ABN , Publish Date - Jan 01 , 2026 | 05:38 AM

నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారి అద్దేపల్లి జనార్దనరావు ఆయన సోదరుడి నుంచి వైసీపీ నేత, మాజీ మంత్ర జోగి రేమేశ్‌కు నెలకు రూ.3-5 లక్షల రూపాయల ముడుపులు అందినట్టు తెలిసింది.

Fake Liquor Case: అద్దేపల్లి నుంచి జోగికి నెలకు రూ.5 లక్షల ముడుపులు!

  • రమేశ్‌ చిన్నాన్న ఆధ్వర్యంలో ఖాతాలు

  • 2023-25 మధ్య 7 వేల ఫోన్‌ కాల్స్‌

  • నకిలీ మద్యం కేసులో జోగి బ్రదర్స్‌పై

  • 100 పేజీల సప్లిమెంటరీ-2 చార్జిషీటు

  • మొత్తం 13 మందిపై అభియోగాలు

విజయవాడ, డిసెంబరు 31(ఆంధ్రజ్యోతి): నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారి అద్దేపల్లి జనార్దనరావు ఆయన సోదరుడి నుంచి వైసీపీ నేత, మాజీ మంత్ర జోగి రేమేశ్‌కు నెలకు రూ.3-5 లక్షల రూపాయల ముడుపులు అందినట్టు తెలిసింది. అదేవిధంగా అద్దేపల్లి సోదరులు, జోగికి మధ్య 2023-25లో ఏడు వేలకు పైగా ఫోన్‌ కాల్స్‌ సంభాషణలు జరిగాయి. ఈ మేరకు నకిలీ మద్యం కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు జోగి బ్రదర్‌పై సుమారు 100 పేజీలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను విజయవాడ ఆరో అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ కోర్టులో బుధవారం సమర్పించారు. సిట్‌ అధికారులు ఎనిమిది మంది నిందితులపై డిసెంబరు 5న తొలి చార్జిషీట్‌ను దాఖలు చేశారు. తర్వాత ముగ్గురు నిందితులపై 12వ తేదీన మొదటి సప్లిమెంటరీ చార్జిషీట్‌ను సమర్పించారు. తాజాగా జోగి రమేశ్‌(ఏ18), ఆయన సోదరుడు రాము(ఏ19), నాగరాజు బాలాజీ(ఏ3), సయ్యద్‌ హజీ(ఏ5), కట్టా రాజు(ఏ6), మిథున్‌ దాస్‌(ఏ9), అంతాదా్‌స(ఏ10), తలారి రంగయ్య(ఏ14), ముత్తా మనోజ్‌కుమార్‌(ఏ20), బాలాజీ సుదర్శన్‌(ఏ21), దారబోయిన ప్రసాద్‌(ఏ23), జినేశ్‌(ఏ24), షిబు(ఏ25)ల పాత్రను వివరిస్తూ రెండో సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌ను దాఖలుచేశారు. నిందితుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్‌డేటా, ఆర్థిక లావాదేవీలను ఇందులో వివరించినట్టు తెలిసింది. సుమారు 20 మంది సాక్షులను చార్జిషీట్‌లో పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోమోహన్‌రావుకు జోగి రమేశ్‌ సోదరులతో ఉన్న బంధాన్ని చార్జిషీట్‌లో వివరించారు. నకిలీ మద్యం ద్వారా అద్దేపల్లి సోదరుల నుంచి జోగి బ్రదర్స్‌ నెలకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ముడుపులు అందుకున్నట్టు పేర్కొన్నారు. అద్దేపల్లి జనార్దనరావు 2021 నుంచి నకిలీ మద్యం తయారీని ఎలా మొదలుపెట్టారన్న అంశాన్ని వివరించారు.


హైదరాబాద్‌లోని నిజాంపేటనుంచి విజయవాడకు మద్యం సరుకును ఏవిధంగా ఎంతెంత పంపారన్న వివరాలను తెలియజేశారు. 2023లో మొత్తం సుమారుగా 500 టిన్‌ల మద్యాన్ని విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న నకిలీ మద్యం తయారీ కేంద్రానికి పంపినట్టు సిట్‌ అధికారులు పేర్కొన్నారు. అద్దేపల్లి సోదరులు, జోగి బ్రదర్స్‌ మధ్య 2023 అక్టోబరు నుంచి 2025 సెప్టెంబరు వరకు సుమారు 7 వేల ఫోన్‌కాల్స్‌తో సంభాషణలు జరిగినట్టు కాల్‌డేటా ద్వారా సిట్‌ ఆధారాలు సేకరించింది. ఆ విషయాన్ని చార్జిషీట్‌లో స్పష్టం చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అదేవిధంగా నిందితుల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను కోర్టుకు సమర్పించారు. అద్దేపల్లి సోదరుల నుంచి జోగి సోదరులకు బ్యాంకు ఖాతాల ద్వారా సుమారుగా రూ.60 లక్షల వరకు చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. జోగి రమేశ్‌కు చెందిన స్వర్ణ డెవలపర్స్‌ పేరుతో ఉన్న బ్యాంక్‌ ఖాతాలో 2021-23 మధ్య సుమారు రూ.కోటి జమ అయినట్టు సిట్‌ గుర్తించిందని సమాచారం. ఒక్క 2024లోనే రూ.25 లక్షలు చేరినట్టు తెలిసింది. ఈ ఖా తాలను జోగి రమేశ్‌ చిన్నాన్న జోగి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నట్టు గుర్తించారని తె లిసింది. ఈ విషయాన్ని చార్జిషీటులో పొం దుపరిచారని విశ్వసనీయంగా తెలిసింది.


నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న 17 మందికి విజయవాడ ఆరో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యా యాధికారి జి. లెనిన్‌బాబు 12వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగించారు. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న జోగి రమేశ్‌, జోగి రాము, శిబు, జినేశ్‌, దారబోయిన ప్రసాద్‌ను కోర్టులో బుధ వారం హాజరుపరిచారు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దనరావు, అద్దేపల్లి జగన్మోహనరావుతోపాటు 12 మందిని వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా న్యాయాధికారి ముందు హాజరుపరిచారు. వారికి జనవరి 12వ తేదీ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు. తనకు జైలులో సదుపాయాలు కల్పించాలని జోగి తరపున న్యాయవాదులు పిటిషన్‌ దాఖ లు చేశారు. దీంతో జోగికి నెల్లూరు జైలులో ఉన్నప్పుడు సదుపాయాల కల్పనకు ఇచ్చిన ఉత్తర్వులను విజయవాడ జిల్లా జైల్లో కూడా అమ లు చేయాలని ఆదేశించారు.

Updated Date - Jan 01 , 2026 | 05:39 AM