కర్త, కర్మ, క్రియ జోగి!
ABN , Publish Date - May 20 , 2026 | 03:45 AM
జయవాడ ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లా ములకలచెరువులో 2019 నుంచి 2025 వరకు సాగిన నకిలీ మద్యం వ్యవహారంలో..
నకిలీ మద్యం కేసులో ఖజానాకు రూ.9 కోట్ల వరకు గండి
175 పేజీలతో తుది చార్జిషీటు వేసిన సిట్
‘ములకలచెరువు’ వెనుక కుట్ర!
కూటమి ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడానికే అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రం
ప్లాన్ విజయవంతమైతే అద్దేపల్లి కుటుంబానికి రూ.3 కోట్లిస్తానని జోగి ఆశ చూపించారు
అభియోగపత్రంలో సిట్ వెల్లడి
విజయవాడ, మే 19 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇబ్రహీంపట్నం, అన్నమయ్య జిల్లా ములకలచెరువులో 2019 నుంచి 2025 వరకు సాగిన నకిలీ మద్యం వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పష్టంచేసింది. ఆయనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు (ఏ1), ఆయన సోదరుడు జగన్మోహనరావు (ఏ2)ద్వారా నకిలీ కథను నడిపించాడని కోర్టుకునివేదించింది. నకిలీ మద్యం కేసులో దర్యాప్తు పూర్తి కావడంతో సిట్ తుది చార్జిషీటును నాలుగు రోజుల క్రితం దాఖలుచేసింది. దీనిని ఆరో అదనపు ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు సోమవారం పరిగణనలోకి తీసుకుంది. 175 పేజీల తుది చార్జిషీటులో నకిలీ మద్యం ఎలా తయారైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లింది.. ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారో సిట్ అధికారులు వివరించారు. ‘నకిలీ మద్యం విక్రయాల ద్వారా వచ్చిన సొమ్ములను జోగి రమేశ్(ఏ-18), ఆయన సోదరుడు రాము (ఏ-19) స్వాహా చేశారు. ప్రభుత్వ ఖజానాకు రూ.9 కోట్ల వరకు నష్టం చేకూర్చారు. నకిలీ మద్యం సిండికేట్ ద్వారా జోగి బ్రదర్స్‌కు ప్రతి నెల రూ.3-5 లక్షల వరకు ముడుపులు అందాయి. ఈ చెల్లింపులన్నీ కొన్నిసార్లు ఖాతాల ద్వారా బదిలీ కాగా.. కొన్నిసార్లు మాత్రం ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని అక్కడ తీసుకునేవారు’ అని తెలియజేశారు. గుడ్డ కాల్చి కూటమి ప్రభుత్వంపై వేయడానికి జోగి రమేశ్ కుట్ర పన్నారని.. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీకి పునాది వేయడం వెనుక ఇదే అసలు కోణమని స్పష్టమైంది. ‘ములకలచెరువులో పెద్ద కల్తీ మద్యం కేంద్రాన్ని ఏర్పాటు చేసి అలజడి సృష్టించాలని ఆయన అనుకున్నారు. ఇందుకోసం పాత ఆర్కే దాబాను అడ్డాగా మార్చుకున్నారు. తన సన్నిహితుడు అద్దేపల్లి జనార్దనరావును పురిగొల్పారు. ప్లాన్ విజయవంతమైతే ఆయన కుటుంబానికి రూ.3 కోట్ల భారీ ప్యాకేజీ ఇస్తామని జోగి ఆశ చూపించారు’ అని సిట్ తెలిపింది.
గోవా బీచ్‌లో డీల్
నకిలీ మద్యం తయారీకి డీల్ మొత్తం గోవా బీచ్‌లో కుదిరిందని.. దీనికి కింగ్‌పిన్ బెంగళూరువాసి అని సిట్ పేర్కొంది. ‘2022 డిసెంబరులో అద్దేపల్లి జనార్దనరావు గోవా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ బెంగళూరుకు చెందిన డిస్టిలరీ నిపుణుడు నాగరాజు బాలాజీ పరిచయమయ్యాడు. రెక్టిఫైడ్ స్పిరిట్, కార్మెల్, కలరింగ్ ఏజెంట్లు, ఇతర రసాయనాలు ఉపయోగించి బ్రాండెడ్ మద్యాన్ని పోలిన నకిలీ మద్యం ఎలా తయారుచేయాలో ఫార్ములాలు చెప్పాడు. ఆ మద్యం సీసాలపై అతికించే భద్రతా ప్రమాణాలు కలిగిన హోలోగ్రామ్స్‌నూ తానే సరఫరా చేస్తానంటూ బాలాజీ డీల్ కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం ఇబ్రహీంపట్నంలోని పాత బార్ గోడౌన్‌లో పెద్ద స్టెయిన్‌లె్‌స స్టీల్ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి, వేల లీటర్ల స్పిరిట్ మద్యాన్ని తయారుచేయడం ప్రారంభించారు. లీటర్ స్పిరిట్‌కు 1.15 లీటర్ల నీరు, కార్మెల్ కలర్ కలిపి రాత్రికి రాత్రే బ్రాండెడ్ మద్యం బాటిళ్లు తయారు చేసేవారు. దీని బాటిలింగ్, ప్యాకింగ్‌ను ఒడిసాలోని గంజాం జిల్లాకు చెందిన బాదల్ దాస్, ప్రదీప్ దాస్, మిథున్ దాస్, అంతా దాస్ చేశారు. వాళ్లంతా కలిసి ప్రాణాంతక నకిలీ మద్యాన్ని తయారు చేశారు’ అని వివరించింది.
కేసులో నిందితులు వీరే..
అద్దేపల్లి జనార్దనరావు (ఏ1), అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2), నాగరాజు బాలాజీ (ఏ3), నకిరికంటి రవి (ఏ4), సయ్యద్ హాజీ (ఏ5), కట్టా రాజు (ఏ6), బాదల్ దాస్ (ఏ7), ప్రదీప్ దాస్ (ఏ8), మిథున్ దాస్ (ఏ9), అంతా దాస్ (ఏ10), డి.శ్రీనివాసరెడ్డి (ఏ11), అంగలూరు వెంకట కల్యాణ్ (ఏ12), తిరుమలశెట్టి శ్రీనివాసరావు (ఏ13), తలారి రంగయ్య అలియాస్ రాజు (ఏ14), తాండ్ర రమేశ్‌బాబు (ఏ15), షేక్ అల్లాబక్షు (ఏ16), చెక్కా సతీశ్‌కుమార్ (ఏ17), జోగి రమేశ్ (ఏ18), జోగి రాము (ఏ19), ముత్తా మనోజ్ కుమార్ (ఏ20), బాల్జీ సుదర్శన్ (ఏ21), కోయంబత్తూరు పెరుమాల్ సెంథిల్ (ఏ22), దారబోయిన ప్రసాద్ (ఏ23), జినేశ్ కేఎ్‌సకే (ఏ24), షిబు.కె(ఏ25).