Share News

నకిలీ నెయ్యి కేసులో చిన్నప్పన్నకు బెయిల్‌

ABN , Publish Date - Feb 06 , 2026 | 03:21 AM

తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నకు హైకోర్టు కఠిన షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది.

నకిలీ నెయ్యి కేసులో చిన్నప్పన్నకు బెయిల్‌

  • కఠిన షరతులతో మంజూరు చేసిన హైకోర్టు

  • ఆస్తుల వివరాలతో అఫిడవిట్‌ దాఖలుకు ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి నకిలీ నెయ్యి సరఫరా చేసిన కేసులో వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్నకు హైకోర్టు కఠిన షరతులతో బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష విలువైన రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. విచారణ కోర్టు వద్ద పాస్‌పోర్టు జమచేయాలని, ఆ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లడానికి వీల్లేదని స్పష్టం చేసింది. దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర సరిహద్దులు దాటి వెళ్లడానికి వీల్లేదంది. దర్యాప్తు అధికారి కోరినప్పుడు హాజరుకావాలని, విచారణకు సహకరించాలని పేర్కొంది. నిందితులు సమాచారం ఇచ్చేందుకు వీలుగా వాట్సప్‌ నెంబర్‌ ఇవ్వాలని దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ‘ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్ష్యాలను తారుమారు చేయడానికి వీల్లేదు. సాక్షులను బెదిరించడం, లోబర్చుకోవడం, ప్రభావితం చేయడానికి వీల్లేదు. విచారణ సమయంలో తప్ప, ఏ సందర్భంలోనూ సాక్షులను, సహచర నిందితులను సంప్రదించకూడదు. బెయిల్‌పై విడుదలైన రెండువారాల్లో వ్యక్తిగతంగా, ఉమ్మడిగా తమకు ఉన్న స్థిర-చరాస్థులు, బ్యాంక్‌ ఖాతాలు, డిమాట్‌ అకౌంట్‌, వ్యాపార ప్రయోజనాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ట్రయల్‌ కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేయాలి. విచారణ ముగిసేవరకు కేసుకు సంబంధించిన వివరాలను ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌, సోషల్‌ మీడియాలో వెల్లడించడానికి, ప్రచురించడానికి వీల్లేదు. నిందితులు వెల్లడించిన, ప్రాసిక్యూషన్‌ గుర్తించిన ఆస్తులను ట్రయల్‌ కోర్టు ముందస్తు అనుమతి లేకుండా విక్రయించడం, తనఖా పెట్టడం, వాటిపై థర్డ్‌పార్టీకి ఎటువంటి హక్కులు కల్పించడానికి వీల్లేదు. దర్యాప్తు సంస్థకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా నేరంతో సంబంధం ఉన్న కంపెనీలు, సంస్థలు, బ్యాంక్‌ ఖాతాలను నిందితులు నిర్వహించడానికి వీల్లేదు. దర్యాప్తు అధికారికి ఫోన్‌నెంబర్‌ అందజేయాలి. ఫోన్‌లో అందుబాటులో ఉండాలి. ఫోన్‌ నెంబర్‌ మారిస్తే వెంటనే దర్యాప్తు అధికారికి తెలియపర్చాలి. కోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ప్రతి శనివారం ఉదయం 10నుంచి సాయంత్రం 5 మధ్య దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలి’ అని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడు షరతులను ఉల్లంఘించినట్లైతే బెయిల్‌ రద్దు కోసం కోర్టును ఆశ్రయించేందుకు ప్రాసిక్యూషన్‌కు స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు ఇచ్చారు. తనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ చిన్నప్పన్న దాఖలు చేసిన పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వ్‌ చేసిన న్యాయమూర్తి గురువారం నిర్ణయాన్ని వెల్లడించారు. ‘దర్యాప్తు కీలక దశలో ఉందనే కారణంతో గతంలో ఓ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించాం. ఆ తర్వాత దర్యాప్తు పూర్తి అయ్యి, చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ను మరింత కాలం కస్టడీలో ఉంచి విచారించాల్సిన అవసరం లేదని భావిస్తున్నాం. పిటిషనర్‌పై మోపిన ఆరోపణల తీవ్రత, సాక్షులనుప్రభావితం చేస్తారన్న ప్రాసిక్యూషన్‌ ఆందోళనను పరిగణనలోకి తీసుకొని కఠిన షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తున్నాం’ అని పేర్కొన్నారు.

Updated Date - Feb 06 , 2026 | 03:21 AM