Share News

నకిలీ డీఎస్పీ అరెస్టు

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:26 AM

గ్రూప్‌-1 పరీక్ష రాసి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యానని చెప్పుకొంటూ, పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు...

నకిలీ డీఎస్పీ అరెస్టు

  • గ్రూప్‌-1లో ఎంపికైనట్టు చెప్పుకోవడంతో.. మోటివేషనల్‌ క్లాస్‌లకు విద్యా సంస్థల ఆహ్వానం

  • పోలీస్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు తీసుకున్నట్టు మహిళ ఫిర్యాదు

విశాఖపట్నం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 పరీక్ష రాసి డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యానని చెప్పుకొంటూ, పోలీసు శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన నకిలీ డీఎస్పీ చెల్లుబోయిన లోచన్‌కుమార్‌ (26)ను ఫోర్త్‌ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని అల్లిపురం సమీపంలోని భూపే్‌షనగర్‌కు చెందిన లోచన్‌కుమార్‌ తనకు పోలీస్‌ శాఖలో ఉద్యోగం వచ్చిందని జనాలను నమ్మిస్తూ తిరుగుతున్నాడు. తాజాగా విడుదలైన గ్రూప్‌-1 పరీక్షల్లో డీఎస్పీ ఉద్యోగానికి ఎంపికయ్యానని ప్రచారం చేసుకుంటున్నాడు. గతంలో నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రతబాగ్చితో దిగిన ఫొటోను చూపించి, తనను ఆయన అభినందించారంటూ చెప్పుకోసాగాడు. లోచన్‌కుమార్‌ డీఎస్పీ పోస్టుకు ఎంపికైనట్టు కొన్ని పత్రికల్లో సైతం (ఆంధ్రజ్యోతిలో కాదు) వార్తలు రావడంతో రాష్ట్రంలోని కొన్ని విద్యాసంస్థలు మోటివేషన్‌ క్లాస్‌లకు పిలవసాగాయి. అయితే ఇటీవల ఒక మహిళ తనకు పోలీస్‌ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ లోచన్‌కుమార్‌ రూ.11 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఫోర్త్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరులో ఉన్న లోచన్‌కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో లోచన్‌కుమార్‌ అసలు గ్రూప్‌-1లో ఉత్తీర్ణత సాధించలేదని తేలింది. అతనిపై ఎంవీపీ కాలనీ, మల్కాపురం, ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో ఒక్కొక్కటి, ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌లో రెండు మోసం కేసులు ఉన్నట్టు తేలింది. లోచన్‌కుమార్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Feb 08 , 2026 | 04:26 AM