Share News

చర్మవ్యాధుల రంగంలో నకిలీ వైద్యులు

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:42 AM

చర్మవ్యాధుల వైద్య రంగంలో సరైన అర్హతలు లేని నకిలీ వైద్యుల చికిత్సలు రోగులకు ప్రాణసంకటంగా మారుతున్నాయని జాతీయ చర్మవ్యాధుల వైద్య నిపుణుల సంఘం...

చర్మవ్యాధుల రంగంలో నకిలీ వైద్యులు

  • వారి చికిత్సలతో రోగులకు ప్రాణసంకటం

  • ‘ఫేక్‌’ల ఏరివేతకు దేశవ్యాప్తంగా ఉద్యమం

  • యాంటీ క్వాకరీ కమిటీ చైర్‌పర్సన్‌ రజిత వెల్లడి

గుంటూరు మెడికల్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): చర్మవ్యాధుల వైద్య రంగంలో సరైన అర్హతలు లేని నకిలీ వైద్యుల చికిత్సలు రోగులకు ప్రాణసంకటంగా మారుతున్నాయని జాతీయ చర్మవ్యాధుల వైద్య నిపుణుల సంఘం (ఐఏడీవీఎల్‌) తెలంగాణ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌, యాంటీ క్వాకరీ కమిటీ నేషనల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రజిత దామిశెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ వైద్యుల ఆట కట్టించేందుకు ఐఏడీవీఎల్‌ యాంటీ క్వాకరీ కమిటీలతో దేశవ్యాప్తంగా ఉద్యమ స్థాయి పోరాటానికి దిగినట్లు పేర్కొన్నారు. గుంటూరులోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) హాల్‌లో ఆదివారం ‘ఏఐ ఇన్‌ డెర్మటాలజీ, యాంటీ క్వాకరీ’ అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఓ దంత వైద్యురాలు హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స చేయగా.. ఇద్దరు వ్యక్తులు మత్తు మందు ఎక్కువై మరణించినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో దంత వైద్యులు స్కిన్‌ క్లినిక్‌లను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పదో తరగతి అర్హతగా కాస్మోటాలజీ కోర్సులు, సౌందర్య చికిత్సలపై ఆన్‌లైన్‌ కోర్సులు చేస్తున్న పలువురు.. చర్మ సంబంధిత చికిత్సలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఆస్పత్రుల్లో ఇతర స్పెషాలిటీ వైద్యులు డెర్మటాలజీ వైద్యుల సర్టిఫికెట్లు సమర్పించి, హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వంటి చికిత్సలు చేస్తున్నారని తెలిపారు.


హైదరాబాద్‌లో ఒకే డెర్మటాలజిస్టు నాలుగు క్లినిక్‌లకు తన డీవీఎల్‌ సర్టిఫికెట్‌ను అద్దెకు ఇచ్చిన విషయాన్ని గుర్తించామని చెప్పారు. ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడొద్దని క్వాలిఫైడ్‌ డెర్మటాలజిస్టులను ఆమె కోరారు. ఐఏడీవీఎల్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ డాక్టర్‌ కేఏ సీతారామ్‌ మాట్లాడుతూ నకిలీ వైద్యుల వివరాలను సభ్యులు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఐఏడీవీఎల్‌ ఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ సీ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ చర్మవ్యాధుల వైద్య రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక పాత్ర పోషించనున్నట్లు చెప్పారు.

Updated Date - Apr 13 , 2026 | 05:43 AM